
గత ఆర్థిక సంవత్సరంలో అంటే 2023–24 గానూ సుమారు 9 కోట్ల రిటర్నులు చేసినట్లు ఒక లెక్క ఉంది. ఇక 2024–25కి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 25.8.2025 నాటికి 3,67,94,801 రిటర్నులు పడ్డాయి. అంటే ఫైల్ చేసినట్లు. ఇందులో 3.54 కోట్ల మంది సక్రమంగా వెరిఫై చేశారు. గొప్ప విషయం ఏమిటంటే 2.29 కోట్ల మంది రిటర్నులు ప్రాసెస్ అయ్యాయి. అంటే అస్సెస్‌మెంట్ అయినట్లే. 13 లక్షల మంది వెరిఫై చేయలేదట.
మీరు ఒకసారి చెక్ చేసుకొండి. వెరిఫై చేసుకోపోతే వెంటనే వెరిఫై చేయండి. వైరిఫై జరిగితే కానీ అసెస్‌మెంట్ మొదలుపెట్టరు. గతవారం అయితే రిటర్నులు వేసిన కొంతమంది అసెస్‌మెంట్ పూర్తి చేసి రీఫండ్ మొత్తాన్ని వారి వారి బ్యాంకు అకౌంట్లలో జమ చేయడం జరిగింది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ వారి కృషి, కష్టాన్ని, సామర్థ్యాన్ని మెచ్చుకోవాలి. శెహభాష్...
టాక్స్ అడిట్ అవసరం లేని వారికి జూలై 31 నుంచి సెప్టెంబర్ 15 వరకు గడువు తేది ముందుగానే పొడిగించారు. గతంలో పొడిగింపుల పర్వం లేదా వాయిదాల పద్ధతి ఉండేది. దానిని పక్కన పెట్టి గత 2 ఏళ్లుగా ఎటువంటి పొడిగింపు చేయకుండా నిలకడగా ఉన్నారు. కానీ ఏడాది ఆరంభంలో ఈసారి పెద్ద పొడిగింపు చేశారు. ఇప్పుడు అన్‌లైన్‌లో పనులు చకచకా జరుగుతున్నాయి. ఎటువంటి ఇబ్బందులు లేవు. ఫాస్ట్‌గా, మృదువు గా బండి నడుస్తోంది. ఈ కాలమ్ చదివే సమయానికి ఫైలర్ల సంఖ్య 4 కోట్లు దాటిందన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇంకో 5 కోట్లకు పైచిలుకు రిటర్నులు వేయాలి. మీరు వేసిన 4 కోట్ల మందిలో ఉన్నారా..? వేయాల్సిన 5 కోట్ల మందిలో ఉన్నారా..?
- వెంటనే ఏం చేయాలంటే...
పాన్ కార్డుని తీయండి - ఆధార్‌తో పాన్ అనుసంధానం చేసుకోండి.
- మీకు ఎన్ని బ్యాంకు అకౌంట్లు ఉన్నాయో ఆరా తీయండి. చాలా మందికి ఒక అకౌంటు లేదా రెండు అకౌంట్లు గుర్తుంటాయి. నిత్యం వాడే అకౌంట్లు గుర్తుంటాయి. ఎన్ని ఉన్నాయో మరిచిపోతుంటాము. ఎవరో తెలిసిన వ్యక్తి లోన్ ఇప్పిస్తాడు. అప్పుడు బ్యాంకులో అకౌంటు ఓపెన్ చేస్తాము. లోన్ క్లియర్ అయ్యాక ఈ సంగతి మరిచిపోతాము. ఉద్యోగాల బదిలీ వలన, ఇంటికి దగ్గరగా ఉందనో.. దగ్గర బంధువు ఉన్నాడని తెరిచిన అకౌంటు... ఇలా ఒక జాబితా చేసుకొండి. అన్నీ బ్యాంకు అకౌంటు వివరాలు సేకరించండి. వాటిలో వ్యవహారాలకు వివరాలు రాసుకొండి. ఇన్నీ ఉన్నా ఏదో ఒకదాన్ని మాత్రమే రిఫండ్ కోసం ఎంచుకోండి. అలా ఎంచుకోకపోతే రీఫండ్ రానే రాదు.
- వివిధ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు... వాటి విషయంలో అశ్రద్ధ వహిస్తాము. గుర్తు తెచ్చుకోండి. పుట్టింటి నుంచి వచ్చిన డబ్బును అదే ఊరిలో ఫిక్స్‌డ్ వేసి మరిచిపోయే నారీమణులు ఎందరో.... అన్ని వివరాలు సేకరించండి.
- మీరు ఉద్యోగస్తులు అయితే ఫారమ్ 16 అడగండి. అందులో అన్నీ వివరాలు చెక్ చేసుకొండి.
- ప్రతి నెలా తయారయ్యే శాలరీ స్లిప్‌ను జాగ్రతగా ఉంచండి.
- ఫారమ్ 16 ఎ లో కరెక్ట్ చేసి భద్రపరచండి.
- డివిడెండ్ల మీద ఆదాయం బ్రోకర్‌ని అడిగి తెలుసుకొండి. స్టేట్‌మెంట్ తీసుకొండి.
- మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు అమ్మకాలు స్టేట్‌మెంట్ తీసుకొండి. పూర్తి స్టేట్‌మెంట్ అడగండి
- అద్దె మీద ఆదాయం ఆదాయం ఉంటే ఇంటి అడ్రెస్సు, కిరాయిదారు పాన్/ఆధార్ తీసుకొండి. ప్రాపర్టీ టాక్సు రశీదులు తీసుకోండి.
- విదేశాల్లో ఉండే కుటుంబ సభ్యుల నుంచి వచ్చే మొత్తం వివరాలు తెలుసుకోండి
- అలాగే విదేశీ ఆస్తుల మీద ఆదాయం కూడా
- పాత పద్ధతిలో డిడక్షన్లకు అయితే అన్ని కాగితాలు, వివరాలు కావాలి. అద్దె రశీదులు... విరాళాల వివరాలు ఉండాలి.
- కరెక్ట్ ఫారాన్ని సెలెక్ట్ చేసుకోండి. డిపార్ట్‌మెంట్ వారి ఉపకరణాలు ఉపయోగపడుతాయి.
- ఇప్పుడు ఫైలింగ్‌కు ఉపక్రమించండి. ఆల్ ద బెస్ట్.....
