IIT ఫెయిల్.. సొంతంగా AI నేర్చుకుని | Failed IIT Self Taught AI Built a Successful Career | Sakshi
Sakshi News home page

IIT ఫెయిల్.. సొంతంగా AI నేర్చుకుని దుబాయ్‌!

May 31 2026 7:40 PM | Updated on May 31 2026 8:23 PM

Failed IIT Self Taught AI Built a Successful Career

ఐఐటీ ప్రవేశ పరీక్షలో విఫలం కావడం అంటే.. చాలామంది విద్యార్థుల జీవితాల్లో పెద్ద నిరాశగా భావించాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి ఫెయిల్యూర్ ఒక ముగింపు కాదు, కొంతమందికి కొత్త ప్రారంభానికి మార్గం అవుతుంది. అలాంటి ఒక ప్రేరణాత్మక కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టు ప్రకారం.. ఒక యూజర్ తన జీవిత ప్రయాణాన్ని పంచుకుంటూ, తాను రెండు సార్లు ఐఐటీ ఎంట్రన్స్ పరీక్షలో విఫలమైనట్లు చెప్పుకున్నారు. చిన్న పట్టణం నుంచి వచ్చినందుకు.. చుట్టూ ఉన్నవారితో పోల్చుకోవడం, ప్రెజర్స్ అన్నీ చాలా కష్టంగా అనిపించాయని అతను చెప్పుకోచ్చారు. ఒకానొక దశలో జీవితం ముగిసిపోయినట్టే అనిపించిందని కూడా పేర్కొన్నారు.

ఫెయిల్యూర్ తర్వాత తన ఊరిని వదిలి, వేరే నగరంలోని ప్రభుత్వ కాలేజీలో చేరాడు. ఆ సమయంలో ఆర్థిక ఇబ్బందులు తీవ్రంగా ఉండేవి. తల్లిదండ్రులు ఎక్కువగా సహాయం చేయలేని పరిస్థితి కావడంతో, చదువు కోసం లోన్స్ తీసుకోవాల్సి వచ్చింది. అలాగే చిన్న పిల్లలకు మ్యాథ్స్ ట్యూషన్ చెప్పి కొంత ఆదాయం సంపాదించాడు. కొన్ని సార్లు రెండు సమోసాలతో రోజంతా గడపాల్సిన పరిస్థితి కూడా ఎదురైంది. అయినప్పటికీ అతను వెనక్కి తగ్గలేదని వివరించారు.

ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని.. కాలేజీ పూర్తి చేసిన తర్వాత, అతనికి నెలకు రూ.20,000 జీతంతో ఒక ఐటీ సపోర్ట్ జాబ్ వచ్చింది. అది పెద్ద జీతం కాకపోయినా.. అతని కెరీర్‌కు ఒక ప్రారంభం అయింది. కానీ అతను అక్కడే ఆగిపోలేదు. తన కుటుంబ పరిస్థితిని మార్చాలనే లక్ష్యంతో, ఉద్యోగం తర్వాత ఖాళీ సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మిషిన్ లెర్నింగ్ (ML) నేర్చుకోవడం ప్రారంభించాడు.

ఎలాంటి కోచింగ్ లేకుండా, ఎలాంటి మెంటార్ లేకుండా, కేవలం ఇంటర్నెట్ సాయంతో అతను స్వయంగా ఈ టెక్నాలజీలను నేర్చుకున్నాడు. ఈ ప్రయత్నం అతని కెరీర్‌లో పెద్ద మలుపు తీసుకువచ్చింది. తర్వాత అతనికి ఏఐ ప్రాజెక్టులపై పని చేసే అవకాశం వచ్చింది. అక్కడి నుంచి అతను ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్, బిజినెస్ లీడర్‌షిప్ రోల్స్‌లోకి ఎదిగాడు.

కొన్నేళ్ల తర్వాత.. ఐఐటీలో సీటు పొందిన తన స్నేహితులతో సమాన స్థాయిలో సంపాదిస్తున్నానని పేర్కొన్నారు. ప్రస్తుతం అతను దుబాయ్‌లో ఉన్నట్లు తన ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఒకప్పుడు పాలు కొనడానికి కూడా ఇబ్బంది పడిన కుటుంబం నుంచి, ఇప్పుడు రెండవ ఆలోచన లేకుండా కావలసినవి కొనగలిగే స్థాయికి ఎదిగానని పేర్కొన్నాడు.

జీవితంలో ఎదగాలంటే.. పర్ఫెక్ట్ స్టార్ట్ అవసరం లేదు, మీకు దృఢ సంకల్పం కావాలి అని వెల్లడించాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ అతని పట్టుదలను, కష్టపడి ఎదిగిన తీరును ప్రశంసిస్తున్నారు.

ఇదీ చదవండి: రాత్రికి రాత్రే కంపెనీ క్లోజ్.. రోడ్డున పడ్డ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు!

Advertisement
 
Advertisement
Advertisement