
థర్డ్ పార్టీ ప్లాన్‌లో సొంత నష్టానికి పరిహారం రాదు
కాంప్రహెన్సివ్ పాలసీలోనే మెరుగైన రక్షణలు
అందుబాటులో ఎన్నో యాడాన్ ప్లాన్‌లు
వీటితో ఆరి్థక భారం తగ్గించుకోవచ్చు
రక్షణలు, మినహాయింపులను సమగ్రంగా తెలుసుకోవాలి
మేఘాలకు చిల్లులు పడ్డాయా! అన్నట్టు స్వల్ప వ్యవధిలోనే వర్షాలు కుమ్మేయడం ఇటీవలి కాలంలో సాధారణమైపోయింది. గంటలో 10 సెంటీమీటర్లకు పైగా పడుతున్న వర్షంతో హైదరాబాద్, ముంబై సహా ఎన్నో నగరాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం చూస్తున్నాం. వర్షాలు, వరదల కారణంగా వాహనాలు దెబ్బతిని ఆర్థిక నష్టం ఎదురైతే..? బైక్ లేదా కారు ఇంజన్ దెబ్బతింటే..? అలాంటి సందర్భంలో థర్డ్ పార్టీ బీమా కవరేజీ ఉన్నా, ఎందుకూ ఉపయోగపడదు. కావాల్సింది సమగ్ర కవరేజీతో కూడిన బీమా పాలసీ. ఇది లేకపోతే ఎదురయ్యే నష్టాన్ని సొంతంగా భరించాల్సి వస్తుంది. అందుకే వాహన బీమా పాలసీ తీసుకునే ముందు పరిశీలించాల్సిన విషయాలు బోలెడు ఉన్నాయి.
మెరుగైన ఆదాయం నేపథ్యంతో మన దేశంలో కార్లు కొనే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2024–25లో 43 లక్షల కార్లు అమ్ముడుపోయాయి. అంతకుముందు ఆరి్థక సంవత్సరంలోనూ 42 లక్షల కార్లు అమ్ముడయ్యాయి. ద్విచక్ర వాహన అమ్మకాలు 2024–25లో ఏకంగా 1.9 కోట్లకు చేరాయి. కానీ, వాహనం కొనేటప్పుడు ఎక్కువ మంది చేస్తున్న పెద్ద తప్పు.. డీలర్ ఇచ్చే థర్డ్ పార్టీ ఆటో ఇన్సూరెన్స్ ప్లాన్‌తో సరిపెట్టుకోవడం.
తొలిసారి వాహనం కొనుగోలు చేస్తున్న వారే కాదు, కొత్త వాహనానికి మారుతున్న వారిలోనూ ఎక్కువ మంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్లాన్‌కే పరిమితమవుతున్నారు. ఎందుకంటే మోటారు వాహ న చట్టం ప్రకారం.. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కవర్ తీసుకోవడం తప్పనిసరి. కారు అయితే మూడేళ్లు, టూవీలర్ అయితే ఐదేళ్ల కాలానికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు సమయంలోనే తీసుకోవాల్సి ఉంటుంది. కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ (సమగ్ర బీమా) తప్పనిసరి కాదు. దీంతో చాలా మంది వాహనదారులు అనవసర ఖర్చు ఎందుకని భావించి థర్డ్‌పార్టీ కవరేజీకి పరిమితమవుతున్నారు.
థర్డ్ పార్టీ.. సొంతానికి రాజీ
థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అన్నది.. తన వాహనం కారణంగా మరో వ్యక్తికి (మూడో పక్షం/థర్డ్ పార్టీ) గాయాలు కావడం లేదా మరణానికి దారితీయడం లేదా మూడో పార్టీకి చెందిన ప్రాపర్టీకి నష్టం కలిగించిన సందర్భాల్లో పరిహారం చెల్లించడానికి పరిమితమవుతుంది. వాహనదారుడు గాయపడడం లేదా సొంత వాహనానికి నష్టం ఏర్పడితే ఈ ప్లాన్‌లో పరిహారం రాదు. ఇందుకు థర్డ్ పార్టీతోపాటు ఓన్ డ్యామేజ్ పాలసీ కూడా ఉండాలి. కాంప్రహెన్సివ్ ఆటో ఇన్సూరెన్స్ ప్లాన్‌లో ఇవన్నీ ఉంటాయి. స్టాండర్డ్ కాంప్రహెన్సివ్ పాలసీలో వరదల వల్ల కారు లేదా బైక్ ఇంజన్‌కు నష్టం వాటిల్లితే పరిహారం లభిస్తుంది.
కానీ, ఇందులో తిరకాసు ఉంది. వర్షపు నీటిలో మునిగినప్పుడు ఇంజన్‌ను స్టార్ట్ చేయడం కారణంగా ఇంజన్‌కు నష్టం వాటిల్లితే పరిహారం రాదు. నీటి వల్ల ఇంజన్‌కు సహజంగా నష్టం జరిగితేనే పరిహారం వస్తుంది. నీటిలో మునిగినప్పుడు ఇంజన్‌ను ఆన్ చేయడానికి ప్రయత్నించడం వల్ల ఇంజన్‌లోని కంబషన్ చాంబర్‌లోకి నీరు ప్రవేశిస్తుంది. దీంతో లోపలి విడిభాగాలు దెబ్బతింటాయి. దీన్ని హైడ్రోస్టాటిక్ లాక్‌గా చెబుతారు. ఇక్కడ పాలసీ దారుడు మొదటి పార్టీ, బీమా సంస్థ రెండో పార్టీ అవుతుంది.
ఇంజన్ ప్రొటెక్షన్ కవర్
నీటిలో మునిగినప్పుడు ఇంజన్‌ను స్టార్ట్ చేయడానికి ప్రయత్నించడం వల్ల జరిగే నష్టానికి కూడా పరిహారం కావాలంటే అప్పుడు కాంప్రహెన్సివ్ పాలసీకి అదనంగా ఇంజన్ ప్రొటెక్షన్ కవర్‌ను జోడించుకోవాలి. ఇంజన్ ప్రొటెక్షన్ కవరేజీ ఉంటే అప్పుడు వరద నీటి కారణంగా ఇంజన్‌కు, గేర్ బాక్స్‌కు నష్టం ఏర్పడితే మరమ్మతులకు అయ్యే అధిక వ్యయాలను బీమా సంస్థ చెల్లిస్తుంది. రీపెయిర్ చేయలేని విధంగా దెబ్బతింటే కొత్త ఇంజన్, గేర్ బాక్స్‌కు అయ్యే వ్యయాలను నిబంధనల మేరకు చెల్లిస్తుంది. కనుక రెగ్యులర్ పాలసీకి అదనంగా ఇంజన్ ప్రొటెక్షన్ కవర్ కూడా తీసుకోవాలి.
ప్రీమియం కొంత పెరిగినప్పటికీ.. ఊహించని పరిస్థితుల్లో ఆరి్థక నష్టాన్ని నివారిస్తుంది. ఇంజన్‌కు మరమ్మతులు సొంతంగా చేయించుకోవాలంటే భారీగానే ఖర్చవుతుంది. ‘వాహనాలు అత్యాధునిక టెక్నాలజీతో వస్తున్నాయి. ఎలక్ట్రిక్, డీజిల్, పెట్రోల్ అన్నదానితో సంబంధం లేకుండా అవి కీలక ఆస్తులుగా మారుతున్నా యి. వాటికి రక్షణ కల్పించుకోవాలి. సమగ్ర బీమా రక్షణతో మానసికంగా నిశి్చంత ఏర్పడుతుంది’ అని పాలసీబజార్ మోటార్ ఇన్సూరెన్స్ బిజినెస్ హెడ్ పరాస్ పస్రిచా తెలిపారు.
జీరో డిప్రీసియేషన్ కవర్
వాహనంలోని విడిభాగాలు వాడుకలో కొంత కాలానికి విలువను కోల్పోతుంటాయి. క్లెయిమ్ చేసినప్పుడు ఆ మేరకు విలువలో బీమా సంస్థలు కోత పెడతాయి. ప్రమాదం కారణంగా ఏదైనా విడిభాగం దెబ్బతిని దాన్ని పూర్తిగా మార్చుకోవాల్సి వస్తే, అప్పుడు పూర్తి పరిహారం రాక, కొంత జేబు నుంచి ఖర్చు చేయాల్సి వస్తుంది. జీరో డిప్రీషియేషన్ కవర్ ఉంటే విడిభాగం మార్పిడి ఖర్చును బీమా సంస్థే చెల్లిస్తుంది.
రిటర్న్ టు ఇన్‌వాయిస్
ఈ యాడాన్ కవర్ తీసుకుంటే.. వాహనం చోరీకి గురైనా లేక ప్రమాదంలో పూర్తిగా దెబ్బతిని మరమ్మతులు చేయలేని సందర్భంలో తిరిగి వాహనం కొనుగోలు, పన్నులు, రిజి్రస్టేషన్‌కు అయ్యే చార్జీలన్నింటినీ బీమా కంపెనీ నుంచి పొందొచ్చు. ఈ సందర్భంగా ‘ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వ్యాల్యూ’ (ఐడీవీ) గురించి తెలుసుకోవాలి. వాహనం చోరీకి గురైనప్పుడు లేదా ప్రమాదం వల్ల మరమ్మతులు చేయలేని స్థితిలో వాహనం ధరతో సంబంధం లేకుండా ఐడీవీనే బీమా సంస్థ చెల్లిస్తుంది.
రోడ్ సైడ్ అసిస్టెన్స్
ప్రయాణంలో ఉన్నట్టుండి బైక్ లేదా కారు మొరాయించొచ్చు. ఎంత ప్రయత్నించినా అది స్టార్ట్ అవ్వకపోతే అప్పుడు రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్ అదుకుంటుంది. అంతేకాదు రోడ్డు ప్రమాదం కారణంగా వాహనం దెబ్బతిని నిలిచిపోయిన సందర్భంలోనూ సాయపడుతుంది. వారంలో అన్ని రోజులూ, రోజులో అన్ని సమయాల్లోనూ ఈ సదుపాయాన్ని బీమా సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి.
బైక్ లేదా కారును సమీపంలోని మరమ్మతుల కేంద్రానికి (సరీ్వసింగ్ సెంటర్)కు తరలిస్తారు. ఇందుకయ్యే ఖర్చును బీమా కంపెనీయే పెట్టుకుంటుంది. సుదూర ప్రయాణాలు చేసే వారికి ఈ కవరేజీ అనుకూలం. సాధారణంగా వాహనం మొరాయించిన ప్రదేశం నుంచి 50 కిలోమీటర్ల పరిధిలో (ఒక్కొక్క కంపెనీ ఒక్కో పరిమితి)ని కేంద్రానికి టోయింగ్ వాహనంపై తరలిస్తాయి. చిన్న సమస్య అయితే కొన్ని సందర్భాల్లో మెకానిక్‌ను పంపించి అక్కడికక్కడే పరిష్కారం చూపిస్తుంటాయి.
న్యాయ సాయం
ఇది కూడా ఐచ్ఛిక కవరేజీయే. ప్రమాదం అనంతరం ఎదురయ్యే న్యాయ సమస్యలకు సంబంధించి సాయాన్ని దీని కింద ఉచితంగా పొందొచ్చు. ప్రమాదం వల్ల నేరాభియోగాలు ఎదుర్కోవాల్సి వస్తే లాయర్ సేవలకు అయ్యే చార్జీలను బీమా కంపెనీ చెల్లిస్తుంది.
బ్యాటరీకి రక్షణ
ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా బైక్ బ్యాటరీ దెబ్బతింటే రూ.50,000 వరకు ఖర్చు అవుతుంది. అదే ఎలక్ట్రిక్ కారులో బ్యాటరీ మార్చుకునేందుకు కొన్ని రెట్లు అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. తయారీ లోపాలు లేదా వాడుకలో భాగంగా బ్యాటరీ దెబ్బతింటే స్టాండర్డ్ ఆటో ఇన్సూరెన్స్‌లో పరిహారం రాదు. కనుక బ్యాటరీ ప్రొటెక్షన్ కవర్‌ను జోడించుకుంటే.. ఉన్నట్టుండి బ్యాటరీ విఫలమైతే మరమ్మతులు లేదా కొత్త బ్యాటరీ ఏర్పాటుకు అయ్యే వ్యయాలను పొందొచ్చు.
డైలీ అలవెన్స్ కవర్
ప్రమాదం లేదా ప్రకృతి విపత్తుల కారణంగా వాహనానికి మరమ్మతులు అవసరమై గ్యారేజీకి వెళ్లిందనుకోండి. వాహన మరమ్మతులు పూర్త య్యే వరకు రోజువారీగా రూ.500–1,500 వరకు నగదు ప్రయోజనం పొందొచ్చు. దీనివల్ల ప్రత్యామ్నాయ రవాణా కోసం అయ్యే ఖర్చులను భర్తీ చేసుకోవచ్చు.
ఇతర యాడాన్‌లు
ఇవి కాకుండా కన్జ్యూమబుల్స్, టైర్ ప్రొటెక్టర్, క్లచ్ ప్రొటెక్టర్ తదితర యాడాన్ కవర్‌లు అందుబాటులో ఉన్నాయి. తమ అవసరాలకు అనుకూలంగా ఉన్న వాటిని, ప్రీమియం ఆధారంగా
ఎంపిక చేసుకోవచ్చు.
వ్యక్తిగత వస్తువులు పోతే..
కాంప్రహెన్సివ్ కారు పాలసీలో కారు చోరీకి గురైతే ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వ్యాల్యూ ప్రకారం బీమా సంస్థ చెల్లింపులు చేస్తుంది. కానీ, కారులో ఉన్న విలువైన వస్తువులకు సైతం పరిహారం కోరుకునే వారు ఈ యాడాన్ పాలసీ తీసుకోవచ్చు.
ఇవి గమనించాలి..
→ ముఖ్యంగా వరద నీటికి అవకాశం ఉన్న పల్లపు ప్రాంతాల్లో నివసించే వారు, ఆయా ప్రాంతాల మీదుగా రవాణా చేసే వారు ఇంజన్ ప్రొటెక్షన్ కవర్‌ను తప్పకుండా తీసుకోవాలి.
→ పాలసీ తీసుకునే ముందు అందులో కవరేజీ సదుపాయాలు, మినహాయింపులతోపాటు ఏవైనా తగ్గింపులు ఉన్నాయా? అని సమగ్రంగా తెలుసుకోవాలి. ఇతర ప్లాన్లలోని ఫీచర్లతో పోల్చి చూసుకున్న తర్వాత మెరుగైన బీమా పాలసీని తీసుకోవాలి. వాహన డీలర్ ఆఫర్ చేసే ప్లాన్లలో ఫీచర్ల వివరాలను ఆయా కంపెనీల వెబ్‌సైట్లకు వెళ్లి తెలుసుకోవచ్చు. కేవలం ప్రీమియం కాకుండా రక్షణ సదుపాయాలను గమనించాలి.
→ వాహనానికి ఎలాంటి కవరేజీ అవసరం అన్నది తెలుసుకున్న తర్వాతే కొనుగోలుకు వెళ్లాలి.
→ కొనుగోలు సమయంలో కొందరు సరైన వివరాలు ఇవ్వడం లేదు. దీనివల్ల తర్వాత క్లెయిమ్ తిరస్కరణ ఎదురుకావొచ్చు.
→ ముఖ్యంగా జీరో డిప్రీసియేషన్, ఇంజన్ ప్రొటెక్షన్, రోడ్‌సైడ్ అసిస్టెన్స్, రిటర్న్ టు ఇన్‌వాయిస్ కవర్‌లను జోడించుకోవడం ఎంతో అవసరం.
→ తక్కువ ఖర్చు అయ్యే భాగాలకు ప్రత్యేకంగా యాడాన్‌లు అవసరం లేదు.
→ నో క్లెయిమ్ బోనస్ ఆఫర్ చేసే ప్లాన్‌ను పరిశీలించొచ్చు. దీనివల్ల ఒక సంవత్సరంలో ఎలాంటి క్లెయిమ్ లేనప్పుడు రెన్యువల్ ప్రీమియంపై తగ్గింపు లభిస్తుంది.
– సాక్షి, బిజినెస్ డెస్క్