భారతీయులేనా పనిమంతులు.. మేం పనికి రామా? టీసీఎస్‌పై అమెరికన‍్ల ఆగ్రహం!

Ex Us Tcs Employee Lawsuit Against Tcs For Favoring Indians, South Asians - Sakshi

దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌ (టీసీఎస్‌) చిక్కుల్లో పడింది. ఉద్యోగుల్ని నియమించుకునే విషయంలో వివక్ష చూపుతుందంటూ ఆ సంస్థ మాజీ ఉద్యోగి కోర్టులో పరువు నష్టం దావా వేశాడు. 

గతవారం (డిసెంబర్‌7)న టీసీఎస్‌ మాజీ ఉద్యోగి కాట్జ్ అమెరికా న్యూజెర్సీ జిల్లా కోర్టును ఆశ్రయించారు. అమెరికాలో ఉద్యోగుల నియామకంలో స్థానికులపై వివక్ష చూపిస్తోందని ఆరోపిస్తూ దాఖలు చేసిన క్లాస్‌ యాక్షన్‌ దావాలో పేర్కొన్నారు. స్థానికంగా ఉద్యోగాలు ఇచ్చేందుకు సౌత్‌ ఏషియన్‌, భారతీయుల్ని మాత్రమే ఎంపిక చేసుకుంటుందని, స్థానికుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. టీసీఎస్‌ కావాలనే ఉద్దేశపూర్వకంగా యునైటెడ్ స్టేట్స్‌లో దాదాపు 70శాతం దక్షిణాసియా ఉద్యోగులను (ప్రధానంగా భారత్‌  నుండి) నియమించారనేది ప్రధాన ఆరోపణ 

భారతీయులేనా పనిమంతులు
ఆఫీస్‌ వర్క్‌ విషయంలో టీసీఎస్‌ భారతీయులు, అమెరికన్‌లు మధ్య వ్యత్యాసం చూస్తుందని కోర్టులో వాదించారు. యూఎస్‌కి చెందిన ఐటీ పరిశ్రమలో కేవలం 12శాతం నుండి 13 శాతం మంది మాత్రమే దక్షిణాసియాకు చెందినవారు ఉంటే.. అమెరికాకు చెందిన టీసీఎస్‌ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 70శాతం దక్షిణాసియాకు చెందిన వారు ఉన్నారని అన్నారు. వర్క్ వీసాల (హెచ్‌1 బీ) ద్వారా యూఎస్‌కు వచ్చిన వారిలో భారతీయులు ఎక్కువగా ఉన్నారని కోర్టులో దావా వేసిన టీసీఎస్‌ మాజీ ఉద్యోగి కాట్జ్ వెల్లడించారు. 

9 ఏళ్ల పాటు ఉద్యోగం
9 సంవత్సరాలకు పైగా టీసీఎస్‌లో పనిచేసిన కాట్జ్, వివిధ ప్రాజెక్టులకు ఉద్యోగులను కేటాయించే హెచ్‌ఆర్‌ విభాగం నుంచి సరైన సహాయం లేకపోవడం,సంస్థలో సరైన అవకాశాలు లభించకపోవడంతో తనను తొలగించారని పేర్కొన్నారు. కాబట్టి టీసీఎస్‌ చట్టవిరుద్ధమైన నియామకాలు చేపట్టకుండా నిరోధించాలని, వివక్ష లేని నియామక పద్ధతులను అవలంబించాలని ఫిర్యాదుదారు అభ్యర్థించారు. జాబ్‌ నుంచి తొలగించినందుకు నష్టపరిహారం కావాలని కోర్టును కోరాడు.  

టీసీఎస్‌కు అనుకూలంగా 
గతంలో టీసీఎస్‌ ఇదే తరహా వివాదంలో చిక్కుకుంది. 2019లో ముగ్గురు మాజీ ఉద్యోగులు దాఖలు చేసిన ఇదే విధమైన వ్యాజ్యంపై కాలిఫోర్నియా జిల్లా కోర్టు టీసీఎస్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. భారతీయ ఐటి సంస్థ యుఎస్ కార్యాలయాల్లో అమెరికన్లకు బదులుగా భారతీయులతో పనిచేయడానికి ఇష్టపడుతుందన్న వాదనలను జ్యూరీ తిరస్కరించింది.

టీసీఎస్‌తో పాటు ఇతర టెక్‌ కంపెనీలు సైతం
టీసీఎస్‌తో పాటు ఇన్ఫోసిస్,హెచ్‌సిఎల్‌టెక్, విప్రో వంటి ఇతర భారత్‌కు చెందిన ఐటీ కంపెనీలు అమెరికాలో వివక్షతతో కూడిన నియామకాలు చేపడుతున్నాయంటూ ఉద్యోగులు కోర్టులను ఆశ్రయించిన ఘటనలు గతంలో చోటు చేసుకున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top