న్యూఢిల్లీ: దేశీ ప్రయివేట్ రంగ సంస్థ ఆర్‌బీఎల్ బ్యాంక్‌ను దుబాయ్ దిగ్గజం ఎమిరేట్స్ ఎన్‌బీడీ బ్యాంక్ సొంతం చేసుకోనుంది. ఆర్‌బీఎల్‌లో 74 శాతం వాటా కొనుగోలు ప్రతిపాదనకు తాజాగా ఆర్‌బీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆర్‌బీఎల్ విదేశీ బ్యాంకుగా అవతరించనుంది.
ఏప్రిల్ 1 నుంచి ఏడాదిలోగా ఎమిరేట్స్ ఎన్‌బీడీ వాటాను కొనుగోలు చేయవలసి ఉంటుంది. యూఏఈలో రెండో పెద్ద బ్యాంకుగా నిలుస్తున్న ఎమిరేట్స్ ఎన్‌బీడీ 2025 అక్టోబర్‌లో ఆర్‌బీఎల్ బ్యాంక్‌లో 60 శాతం వాటా కొనుగోలుకి ఆసక్తిని ప్రకటించింది. ఇందుకు రూ. 26,853 కోట్లు వెచ్చించనుంది.
కాగా.. ఆర్‌బీఐ అనుమతి కారణంగా మెజారిటీ వాటా కొనుగోలు చేయడంతోపాటు.. ఆర్‌బీఎల్ చెల్లించిన మూలధనంలో ఎమిరేట్స్ ఎన్‌బీడీ కనీసం 51 శాతం వాటాను కొనసాగించవలసి ఉంటుంది. తద్వారా విదేశీ బ్యాంక్ అనుబంధ సంస్థగా ఆర్‌బీఎల్ కార్యకలాపాలు కొనసాగనున్నాయి. ఏడాదిలోగా ఆర్‌బీఎల్ బ్రాంచీలను ఎమిరేట్స్ ఎన్‌బీడీలో విలీనం చేయవలసి ఉంటుంది.


