breaking news
Emirates NBD
-
ఆర్బీఎల్ బ్యాంకులో ఎన్‌బీడీకి మెజారిటీ వాటాలు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఆర్బీఎల్ బ్యాంకులో మెజారిటీ 60 శాతం వాటాలను కొనుగోలు చేసేందుకు యూఏఈకి చెందిన ఎమిరేట్స్ ఎన్బీడీ బ్యాంక్ ప్రతిపాదించింది. ఇందుకోసం రూ. 26,853 కోట్లు ఆఫర్ చేసింది. విలువపరంగా దేశీ ఆర్థిక రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి సంబంధించి ఇది అత్యంత భారీ డీల్ కానుంది. ఇటీవలే జపాన్‌కి చెందిన ఎస్ఎంబీసీ మరో దేశీ ప్రైవేట్ బ్యాంక్ యస్ బ్యాంకులో 24.9 శాతం వాటాలను రూ. 16,333 కోట్లతో కొనుగోలు చేసిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ఆమోదించిన సందర్భంగా ఎమిరేట్స్ ఎన్బీడీ బ్యాంక్ నుంచి రూ. 26,853 కోట్ల సమీకరణకు కూడా తమ బోర్డు ఆమోదముద్ర వేసినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు ఆర్బీఎల్ బ్యాంకు తెలిపింది. ఈ డీల్‌తో రెండు బ్యాంకుల భాగస్వాములకు ప్రయోజనం చేకూరగలదని ఆర్బీఎల్ బ్యాంక్ ఎండీ ఆర్ సుబ్రమణియకుమార్ తెలిపారు. ప్రిఫరెన్షియల్ ఇష్యూ .. ఒక్కొక్కటి రూ. 10 ముఖ విలువ చేసే 95.90 కోట్ల వరకు ఈక్విటీ షేర్లను రూ. 228 రేటు చొప్పున ఎమిరేట్స్ ఎన్బీడీ బ్యాంకునకు ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన కేటాయించేందుకు బోర్డు ఆమోదించింది. ఇది 60 శాతం వాటాకు సమానం. ప్రిఫరెన్షియల్ ఇష్యూ అనంతరం ఆర్బీఎల్ బ్యాంకుపై ఎమిరేట్స్ ఎన్బీడీ బ్యాంక్‌నకు నియంత్రణ లభిస్తుంది. అటుపైన దాన్ని ప్రమోటరుగా వ్యవహరిస్తారు. ఆర్బీఎల్ బ్యాంకును విదేశీ బ్యాంక్ అనుబంధ సంస్థగా వర్గీకరిస్తారు. ప్రిఫరెన్షియల్ ఇష్యూ కారణంగా ఎమిరేట్స్ ఎన్బీడీ, ఆర్బీఎల్ బ్యాంక్ షేర్హోల్డర్లకు ఓపెన్ ఆఫర్ ఇవ్వాల్సి వస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంకు నికర లాభం 20 శాతం క్షీణించి రూ. 223 కోట్ల నుంచి రూ. 179 కోట్లకు క్షీణించింది. -
బ్లాక్చైన్పై ఐసీఐసీఐ లావాదేవీలు
ఈ టెక్నాలజీని వినియోగించిన తొలి దేశీయ బ్యాంకు ముంబై: ‘బ్లాక్ చైన్ టెక్నాలజీ’ని ఉపయోగించి అంతర్జాతీయ ఆర్థిక వాణిజ్యం, చెల్లింపుల లావాదేవీలను నిర్వహించినట్టు ఐసీఐసీఐ బ్యాంకు బుధవారం ప్రకటించింది. ఎమిరేట్స్ ఎన్బీడీ సాయంతో ప్రయోగాత్మకంగా ఐసీఐసీఐ బ్యాంకు ఈ టెక్నాలజీ ఆధారంగా లావాదేవీలు జరిపి చూసింది. దేశీయంగా ఈ టెక్నాలజీని ఉపయోగించిన మొదటి బ్యాంకుగా, అంతర్జాతీయంగా ఈ టెక్నాలజీని వినియోగించిన మొదటి కొన్ని బ్యాంకుల్లో ఒకటిగా ఐసీఐసీఐ బ్యాంకు నిలిచింది. ‘చెల్లింపుల లావాదేవీల ధ్రువీకరణ, అంతర్జాతీయ వాణిజ్య పత్రాలు... కొనుగోలుఆర్డర్, ఇన్వాయిస్, షిప్పింగ్, బీమా తదితర పత్రాలను ఎలక్ట్రానిక్ రూపంలో బ్లాక్‌చైన్ టెక్నాలజీ సాయంతో అప్పటికప్పుడే అందుకోవడం సాధ్యమవుతుంది. ఈ టెక్నాలజీ వల్ల ప్రక్రియ సులభతరం కావడంతోపాటు సమయం కూడా ఆదా అవుతుంది. ప్రస్తుత క్లిష్టమైన, సుదీర్ఘ సమయంతో కూడిన పేపర్ ప్రక్రియకు ఇది భిన్నమైనది’ అని ఐసీఐసీఐ తెలిపింది. ఈ టెక్నాలజీతో ముంబైలోని దిగుమతిదారుడు, ముంబైలోని ఐసీఐసీఐ బ్యాంకు, దుబాయిలోని ఎగుమతిదారుడు, ఎమిరేట్స్ ఎన్బీడీ ఏకకాలంలో సమాచారాన్ని చూసేందుకు వీలుంటుందని పేర్కొంది. అలాగే, డాక్యుమెంట్లు, ఆస్తుల యాజమాన్యం ధ్రువీకరణ, లెడ్జర్‌ను వెంటనే పరిశీలించవచ్చని తెలిపింది. భవిష్యత్తు ఈ టెక్నాలజీదే: ఇప్పుడే వినియోగంలోకి వస్తున్న బ్లాక్ చైన్ టెక్నాలజీ రాబోయే సంవత్సరాల్లో బ్యాంకింగ్ రంగంలో గణనీయమైన పాత్ర పోషిస్తుందని భావిస్తున్నట్టు ఐసీఐసీఐ ఎండీ, సీఈఓ చందాకొచర్ అన్నారు. సంక్లిష్టమైన ద్వైపాక్షిక, బహుపాక్షిక బ్యాంకింగ్ లావాదేవీలను ఎలాంటి అవాంతరాలు లేకుండా సత్వరమే, మరింత భద్రతతో నిర్వహించడం ఈ విధానంలో సాధ్యమని ఆమె చెప్పారు. ఇది ఎలా పనిచేస్తుంది...? బ్లాక్‌చైన్ అనేది లావాదేవీల డేటాబేస్. లావాదేవీలు, ఒప్పందాలు, కాంట్రాక్టులు తదితర సమాచారం డిజిటల్ రూపంలో రికార్డ్ అవుతుంది. ఈ లెడ్జర్ అన్నది ఒక్క చోటే నిక్షిప్తం కాదు. వందలు, వేలాది కంప్యూటర్ల మధ్య పంపిణీ అవుతుంది. దీంతో ఈ వ్యవస్థలో భాగంగా ఉన్న వారెవరైనా తాజా సమాచారాన్ని పొందడానికి వీలవుతుంది. ఈ టెక్నాలజీని బ్యాంకులు వాడేట్టు అయితే వాటికి మధ్యవర్తులతో పనుండదు. మాన్యువల్‌గా చేసే పని కూడా చాలా వరకు తగ్గుతుంది. విదేశాలకు డబ్బులు పంపడం కూడా క్షణాల్లోనే జరిగిపోతుంది.