బ్లాక్చైన్పై ఐసీఐసీఐ లావాదేవీలు | ICICI Bank, Emirates NBD tie up to execute blockchain-based | Sakshi
Sakshi News home page

బ్లాక్చైన్పై ఐసీఐసీఐ లావాదేవీలు

Oct 13 2016 12:33 AM | Updated on Sep 4 2017 5:00 PM

బ్లాక్చైన్పై ఐసీఐసీఐ లావాదేవీలు

బ్లాక్చైన్పై ఐసీఐసీఐ లావాదేవీలు

‘బ్లాక్ చైన్ టెక్నాలజీ’ని ఉపయోగించి అంతర్జాతీయ ఆర్థిక వాణిజ్యం, చెల్లింపుల లావాదేవీలను నిర్వహించినట్టు ఐసీఐసీఐ బ్యాంకు బుధవారం ప్రకటించింది.

 ఈ టెక్నాలజీని వినియోగించిన తొలి దేశీయ బ్యాంకు

 ముంబై: ‘బ్లాక్ చైన్ టెక్నాలజీ’ని ఉపయోగించి అంతర్జాతీయ ఆర్థిక వాణిజ్యం, చెల్లింపుల లావాదేవీలను నిర్వహించినట్టు ఐసీఐసీఐ బ్యాంకు బుధవారం ప్రకటించింది. ఎమిరేట్స్ ఎన్‌బీడీ సాయంతో ప్రయోగాత్మకంగా ఐసీఐసీఐ బ్యాంకు ఈ టెక్నాలజీ ఆధారంగా లావాదేవీలు జరిపి చూసింది. దేశీయంగా ఈ టెక్నాలజీని ఉపయోగించిన మొదటి బ్యాంకుగా, అంతర్జాతీయంగా ఈ టెక్నాలజీని వినియోగించిన మొదటి కొన్ని బ్యాంకుల్లో ఒకటిగా ఐసీఐసీఐ బ్యాంకు నిలిచింది.

‘చెల్లింపుల లావాదేవీల ధ్రువీకరణ, అంతర్జాతీయ వాణిజ్య పత్రాలు... కొనుగోలుఆర్డర్, ఇన్వాయిస్, షిప్పింగ్, బీమా తదితర పత్రాలను ఎలక్ట్రానిక్ రూపంలో బ్లాక్‌చైన్ టెక్నాలజీ సాయంతో అప్పటికప్పుడే అందుకోవడం సాధ్యమవుతుంది. ఈ టెక్నాలజీ వల్ల ప్రక్రియ సులభతరం కావడంతోపాటు సమయం కూడా ఆదా అవుతుంది.

ప్రస్తుత క్లిష్టమైన, సుదీర్ఘ సమయంతో కూడిన పేపర్ ప్రక్రియకు ఇది భిన్నమైనది’ అని ఐసీఐసీఐ తెలిపింది. ఈ టెక్నాలజీతో ముంబైలోని దిగుమతిదారుడు, ముంబైలోని ఐసీఐసీఐ బ్యాంకు, దుబాయిలోని ఎగుమతిదారుడు, ఎమిరేట్స్ ఎన్‌బీడీ ఏకకాలంలో సమాచారాన్ని చూసేందుకు వీలుంటుందని  పేర్కొంది. అలాగే, డాక్యుమెంట్లు, ఆస్తుల యాజమాన్యం ధ్రువీకరణ, లెడ్జర్‌ను వెంటనే పరిశీలించవచ్చని తెలిపింది.

భవిష్యత్తు ఈ టెక్నాలజీదే: ఇప్పుడే వినియోగంలోకి వస్తున్న బ్లాక్ చైన్ టెక్నాలజీ రాబోయే సంవత్సరాల్లో బ్యాంకింగ్ రంగంలో గణనీయమైన పాత్ర పోషిస్తుందని భావిస్తున్నట్టు ఐసీఐసీఐ ఎండీ, సీఈఓ చందాకొచర్ అన్నారు. సంక్లిష్టమైన ద్వైపాక్షిక, బహుపాక్షిక బ్యాంకింగ్ లావాదేవీలను ఎలాంటి అవాంతరాలు లేకుండా సత్వరమే, మరింత భద్రతతో నిర్వహించడం ఈ విధానంలో సాధ్యమని ఆమె చెప్పారు.

ఇది ఎలా పనిచేస్తుంది...?
బ్లాక్‌చైన్ అనేది లావాదేవీల డేటాబేస్. లావాదేవీలు, ఒప్పందాలు, కాంట్రాక్టులు తదితర సమాచారం డిజిటల్ రూపంలో రికార్డ్ అవుతుంది. ఈ లెడ్జర్ అన్నది ఒక్క చోటే నిక్షిప్తం కాదు.  వందలు, వేలాది కంప్యూటర్ల మధ్య పంపిణీ అవుతుంది. దీంతో ఈ వ్యవస్థలో భాగంగా ఉన్న వారెవరైనా తాజా సమాచారాన్ని పొందడానికి వీలవుతుంది. ఈ టెక్నాలజీని బ్యాంకులు వాడేట్టు అయితే వాటికి మధ్యవర్తులతో పనుండదు. మాన్యువల్‌గా చేసే పని కూడా చాలా వరకు తగ్గుతుంది. విదేశాలకు డబ్బులు పంపడం కూడా క్షణాల్లోనే జరిగిపోతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement