
రూ. 26,853 కోట్లతో 60 శాతం కొనుగోలు ప్రతిపాదన
ఆర్థిక రంగంలోనే భారీ ఎఫ్‌డీఐ డీల్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఆర్‌బీఎల్ బ్యాంకులో మెజారిటీ 60 శాతం వాటాలను కొనుగోలు చేసేందుకు యూఏఈకి చెందిన ఎమిరేట్స్ ఎన్‌బీడీ బ్యాంక్ ప్రతిపాదించింది. ఇందుకోసం రూ. 26,853 కోట్లు ఆఫర్ చేసింది. విలువపరంగా దేశీ ఆర్థిక రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి సంబంధించి ఇది అత్యంత భారీ డీల్ కానుంది.
ఇటీవలే జపాన్‌కి చెందిన ఎస్‌ఎంబీసీ మరో దేశీ ప్రైవేట్ బ్యాంక్ యస్ బ్యాంకులో 24.9 శాతం వాటాలను రూ. 16,333 కోట్లతో కొనుగోలు చేసిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.
త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ఆమోదించిన సందర్భంగా ఎమిరేట్స్ ఎన్‌బీడీ బ్యాంక్ నుంచి రూ. 26,853 కోట్ల సమీకరణకు కూడా తమ బోర్డు ఆమోదముద్ర వేసినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు ఆర్‌బీఎల్ బ్యాంకు తెలిపింది. ఈ డీల్‌తో రెండు బ్యాంకుల భాగస్వాములకు ప్రయోజనం చేకూరగలదని ఆర్‌బీఎల్ బ్యాంక్ ఎండీ ఆర్ సుబ్రమణియకుమార్ తెలిపారు.
ప్రిఫరెన్షియల్ ఇష్యూ ..
ఒక్కొక్కటి రూ. 10 ముఖ విలువ చేసే 95.90 కోట్ల వరకు ఈక్విటీ షేర్లను రూ. 228 రేటు చొప్పున ఎమిరేట్స్ ఎన్‌బీడీ బ్యాంకునకు ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన కేటాయించేందుకు బోర్డు ఆమోదించింది. ఇది 60 శాతం వాటాకు సమానం. ప్రిఫరెన్షియల్ ఇష్యూ అనంతరం ఆర్‌బీఎల్ బ్యాంకుపై ఎమిరేట్స్ ఎన్‌బీడీ బ్యాంక్‌నకు నియంత్రణ లభిస్తుంది. అటుపైన దాన్ని ప్రమోటరుగా వ్యవహరిస్తారు.
ఆర్‌బీఎల్ బ్యాంకును విదేశీ బ్యాంక్ అనుబంధ సంస్థగా వర్గీకరిస్తారు. ప్రిఫరెన్షియల్ ఇష్యూ కారణంగా ఎమిరేట్స్ ఎన్‌బీడీ, ఆర్‌బీఎల్ బ్యాంక్ షేర్‌హోల్డర్లకు ఓపెన్ ఆఫర్ ఇవ్వాల్సి వస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆర్‌బీఎల్ బ్యాంకు నికర లాభం 20 శాతం క్షీణించి రూ. 223 కోట్ల నుంచి రూ. 179 కోట్లకు క్షీణించింది.