స్పేస్‌ఎక్స్‌ ఐపీఓతో ప్రభంజనం | Elon Musk Becomes World First Trillionaire The Rise of Musconomy spacex ipo | Sakshi
Sakshi News home page

స్పేస్‌ఎక్స్‌ ఐపీఓతో ప్రభంజనం

Jun 12 2026 8:30 AM | Updated on Jun 12 2026 10:03 AM

Elon Musk Becomes World First Trillionaire The Rise of Musconomy spacex ipo

ఆధునిక పారిశ్రామిక ప్రపంచంలో అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ వివాదాలు-విజయాల నడుమ దూసుకుపోతున్న ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ చరిత్ర సృష్టించారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికిన ఆయన సంస్థ ‘స్పేస్‌ఎక్స్’ గురువారం యూఎస్‌ మార్కెట్‌లో రికార్డు స్థాయిలో 75 బిలియన్ డాలర్ల పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) నిధులను సేకరించింది. ఈ చారిత్రాత్మక పరిణామంతో శుక్రవారం మార్కెట్ ట్రేడింగ్ ప్రారంభ సమయానికి ఎలాన్ మస్క్ అధికారికంగా ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్ (1.1 ట్రిలియన్‌ డాలర్లకు పైగా నికర ఆస్తుల అధిపతి-సుమారు రూ.103 లక్షల కోట్లు)గా అవతరించారు.

పెట్టుబడిదారుల నమ్మకం, సాంకేతిక రంగంలో మస్క్ మార్క్ వ్యూహాలు సంప్రదాయ ఆర్థిక సూత్రాలను తిరగరాస్తూ ‘మస్కోనమీ’ అనే సరికొత్త ఆర్థిక శకానికి తెరలేపాయి.

సంపదలో అందని ఎత్తులో మస్క్

ఈ ఐపీఓ కంటే ముందే ఫోర్బ్స్ అంచనాల ప్రకారం మస్క్ నికర విలువ సుమారు 780 బిలియన్ డాలర్లుగా ఉండేది. ప్రస్తుత పరిణామాలతో ఆయన సంపద 1.1 ట్రిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. ప్రస్తుత ప్రపంచ ధనవంతుల జాబితాలో ఆయనకు, మిగిలిన వారికి మధ్య ఉన్న వ్యత్యాసం ఊహకందని రీతిలో పెరిగిపోయింది.

‘ప్రపంచంలో రెండో అత్యంత ధనవంతుడు ఒరాకిల్ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ సంపద కేవలం 300 బిలియన్ డాలర్ల(రూ.28 లక్షల కోట్లు) సమీపంలోనే ఉంది. అంటే మస్క్ ఆస్తులతో పోలిస్తే అది మూడింట ఒక వంతు కంటే తక్కువ. దీనిని బట్టి మస్క్ ఏ స్థాయి ఆధిక్యంలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు’ అని ఫోర్బ్స్ డిప్యూటీ ఎడిటర్ (వెల్త్ విభాగం) మాట్ డురోట్ అన్నారు. ప్రస్తుతం మస్క్ సంపదలో సింహభాగం స్పేస్‌ఎక్స్ నుంచే వస్తోంది. ఈ సంస్థలో ఆయనకు సుమారు 866 బిలియన్ డాలర్ల విలువైన వాటా ఉంది. టెస్లా, ఎక్స్ (ట్విట్టర్) వంటి ఇతర ఆస్తులతో కలిసి ఆయన అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.

విలక్షణ వ్యక్తిత్వం.. అభిమాన సామ్రాజ్యం

ప్రపంచవ్యాప్తంగా అపరకుబేరులపై, సామాజిక అసమానతలపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న తరుణంలోనూ మస్క్ మాత్రం భిన్నమైన ప్రజాదరణను సొంతం చేసుకున్నారు. వారెన్ బఫెట్ వంటి సంప్రదాయ పారిశ్రామికవేత్తల తరహా కాకుండా ఇంటర్నెట్ సంస్కృతిలో ఒక కేంద్ర బిందువుగా మారి ‘పాప్ కల్చర్’ ఐకాన్‌గా అవతరించారు. ఆయన ‘నో-ఫిల్టర్’ (నిర్మొహమాటంగా మాట్లాడే) శైలి, సోషల్ మీడియా వేదికగా సామాన్యులతో నేరుగా సంభాషించే విధానం లక్షలాది మంది నమ్మకమైన అభిమానులను సంపాదించి పెట్టిందని కొందరు భావిస్తున్నారు.

సవాళ్లు – వివాదాలు

మస్క్ ప్రస్థానం కేవలం విజయాలతోనే సాగలేదు. ఆయన చుట్టూ ఎప్పుడూ వివాదాలు ముసురుకుంటూనే ఉంటాయి. ఒకే వ్యక్తి చేతిలో అపరిమితమైన అధికారం కేంద్రీకృతం కావడంపై విమర్శకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతు ఇవ్వడం, ప్రభుత్వ సామర్థ్య విభాగం (డోజ్‌)లో కీలక పాత్ర పోషించడం తీవ్ర చర్చకు దారితీసింది. ఆ తర్వాత విధానపరమైన విభేదాల వల్ల ట్రంప్‌తో సంబంధాలు దెబ్బతిన్నప్పటికీ ఇటీవల ఇరుపక్షాలు కొంత సర్దుబాటు ధోరణిని ప్రదర్శించాయి. రాజకీయ వివాదాల కారణంగా గత ఏడాది అంతర్జాతీయ మార్కెట్లలో టెస్లా వాహనాల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి.

మస్క్‌ కంపెనీ ఐపీఓకు ఎందుకంత ఆదరణ?

ఆర్థిక విశ్లేషకుల ప్రకారం, సాధారణ కంపెనీల వాల్యుయేషన్లు వాటి లాభనష్టాల ఆధారంగా లెక్కిస్తారు. కానీ మస్క్ కంపెనీల విషయంలో ఇది వర్తించదు. దీనినే మార్కెట్ వర్గాలు ‘ఎలాన్ ప్రీమియం’ అని పిలుస్తున్నాయి. అంటే భవిష్యత్తు విజన్ పట్ల మస్క్‌పై ఉన్న నమ్మకంతోనే పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరిస్తున్నారు. ‘టెస్లా తరహాలోనే స్పేస్‌ఎక్స్ కూడా పూర్తిగా మస్క్ వ్యూహంపై నడుస్తున్నదే. 1.5 ట్రిలియన్‌ నుంచి 2 ట్రిలియన్‌ డాలర్ల మార్కెట్ క్యాప్ అనేది సంప్రదాయ ఆర్థిక సూత్రాలకు విరుద్ధం. దీనిని కేవలం ‘ఎలాన్ మస్క్ ప్రీమియం’గా మాత్రమే వర్గీకరించగలం’ అని రినైసాన్స్ క్యాపిటల్ సీనియర్ స్ట్రాటజిస్ట్ మాట్ కెన్నెడీ అన్నారు.

సరిహద్దులు లేని వ్యాపార సామ్రాజ్యం

మస్క్(54) దక్షిణాఫ్రికాలో జన్మించి పెన్సిల్వేనియా వర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కేవలం టెస్లా, స్పేస్‌ఎక్స్‌లకే పరిమితం కాలేదు. ఆయన వ్యాపార నెట్‌వర్క్ అపారమైనది.

సంస్థ పేరుప్రధాన రంగం
టెస్లాఎలక్ట్రిక్ వాహనాలు, క్లీన్ ఎనర్జీ
స్పేస్ఎక్స్అంతరిక్ష పరిశోధనలు, శాటిలైట్ ఇంటర్నెట్
న్యూరాలింక్బ్రెయిన్-కంప్యూటర్ ఇంప్లాంట్స్
ది బోరింగ్ కంపెనీభూగర్భ రవాణా సొరంగాలు
ఎక్స్ (గతంలో ట్విట్టర్)గ్లోబల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌
ఎక్స్‌ఏఐకృత్రిమ మేధ

టెస్లాను ప్రపంచంలోనే అత్యంత విలువైన కార్ల కంపెనీగా మార్చడం ద్వారా అమెరికన్ ఆటోమొబైల్ రంగానికి ప్రపంచవ్యాప్తంగా అపారమైన గౌరవాన్ని తెచ్చారని జనరల్ మోటర్స్ మాజీ వైస్ చైర్మన్ బాబ్ లుట్జ్ మస్క్‌ను ప్రశంసించారు.

మన కాలపు ఎడిసన్

మస్క్ అసాధారణ ప్రవర్తనపై ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ ఆయన సృజనాత్మకతను ప్రపంచ దిగ్గజాలు సైతం అంగీకరిస్తున్నారు. ఒకప్పుడు మస్క్‌తో సుదీర్ఘ న్యాయపోరాటం చేసిన జేపీ మోర్గాన్ చేజ్ సీఈఓ జామీ డిమోన్ సైతం ఇటీవల మనసు మార్చుకున్నారు. మస్క్‌ను మన కాలపు థామస్ ఎడిసన్, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ అని ఆయన కొనియాడడం గమనార్హం. మొత్తంగా సాంప్రదాయ ఆర్థిక రంగానికి సవాలు విసురుతూ, అంతరిక్షాన్ని వ్యాపారమయం చేస్తూ మస్క్ సాధించిన ఈ ‘ట్రిలియనీర్’ మైలురాయి మానవ చరిత్రలోనే ఒక అపూర్వ ఘట్టంగా నిలిచిపోనుంది.

ఇదీ చదవండి: కరుగుతోన్న బంగారు కొండ.. వరుసగా రెండో రోజు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement