మాటల్లో కాదు.. చేతల్లో చూపాలి | Economist and policy analyst Sanjaya Baru views the Indian economy | Sakshi
Sakshi News home page

మాటల్లో కాదు.. చేతల్లో చూపాలి

May 28 2026 3:21 AM | Updated on May 28 2026 3:21 AM

Economist and policy analyst Sanjaya Baru views the Indian economy

ఎకానమీటాక్‌

కేంద్రంలో సుస్థిరమైన ప్రభుత్వాలు ఉన్నప్పటి కంటే సంకీర్ణ సర్కార్లు ఉన్నప్పుడే ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉంది. పీవీ నరసింహారావు, మన్మోహన్‌ సింగ్, వాజ్‌పేయి ప్రభుత్వాలు దీనిని నిదర్శనం. ఇందిర, మోదీ సారథ్యంలో ఎకానమీ తీవ్ర సమస్యల్లోకి జారిపోవడం చూస్తున్నాం. 

→ రాజకీయంగా బలమైన మెజారిటీ ఉన్నప్పుడే ఆర్థికంగా బలహీన పనితీరు ఉంటుంది. ఎందుకంటే, వారు తమ పొలిటికల్‌ బలాన్ని మరింత పెంచుకోవాలని చూస్తారు తప్ప, ఆర్థిక సవాళ్లపై పెద్దగా ఫోకస్‌ చేయరు. 

→ కొంత మంది ఆర్థిక వేత్తలు చెబుతున్నట్టు, భారత ఆర్థిక వ్యవస్థ ఇతర దేశాల కంటే మెరుగ్గా ఉందనడంలో అర్థం లేదు. ఎందుకంటే, గతంతో పోలిస్తే భారత్‌ పనితీరు ఎలా ఉందో చూడాలి. ఈ శతాబ్దం తొలి పదేళ్లలో సగటు ఎకానమీ వృద్ధి రేటు 7–7.5 శాతంగా ఉంది. మరిప్పుడు సగటు వృద్ధి 6 శాతానికి పడిపోయింది. 

→ 2020 కల్లా మన జీడీపీని 5 ట్రిలియన్‌ డాలర్లకు చేర్చాలన్నదే లక్ష్యమని ప్రధాని మోదీ 2017లో ప్రకటించారు. ఆ టార్గెట్‌ తర్వాత 2022కి, ఆపై 2025కి మారింది. ఇప్పుడు 2026లో కూడా మనం ఇంకా 4 ట్రిలియన్‌ డాలర్ల వద్దే ఉన్నాం. లక్ష్యం మాత్రం ఆమడ దూరంలోనే ఉంది. సమస్యలు గుర్తించి, తగిన పాలసీ చర్యలు చేపట్టాలి. 

→ ప్రైవేటు పెట్టుబడులు పెరగకపోవడానికి 3 కారణాలున్నాయి. చాలా రంగాల్లో ఉత్పత్తులకు డిమాండ్‌ పుంజుకోవడం లేదు. దీన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వ పెట్టుబడులు పెంచుతున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2019లో చెప్పారు. దీనివల్ల డిమాండ్‌ పెరిగి, ప్రైవేటు పెట్టుబడులు పెరుగుతాయన్నారు. అదేమీ జరగలేదు. 

→ సంపన్నులు దేశాన్ని విడిచిపోతున్నారు. కొంత మంది బడా కార్పొరేట్లు సైతం విదేశాల్లో తమ ఫ్యామిలీ ఆఫీసులు తెరుస్తున్నారు. దీనివల్ల దేశం నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయి. ఇక మూడోది ఎఫ్‌డీఐలు మందగిస్తున్నాయి. గణాంకాలే దీనికి నిదర్శనం. 

→ తయారీ రంగం, వృద్ధి రేటు, ఎగుమతులు, ఉద్యోగ కల్పన ఇలా ఏ డేటా చూసినా.. 1990– 2015 మధ్య అంటే  పాతికేళ్ల పాటు ఎకానమీకి స్వర్ణ యుగం అనే చెప్పొచ్చు. ఇందిగా గాంధీ హయాంలో, ఇప్పుడు మోదీ జమానాలో ఆర్థిక వ్యవస్థ పనితీరు అసలేం బాగోలేదు. అయితే, బీజేపీ పీఎం అటల్‌జీ పాలనలో మాత్రం సంస్కరణల పరంగా, పెట్టుబడుల పరంగా కూడా మంచి నాయకత్వం లభించింది. 

→ ప్రధాని మోదీ పొదుపు మంత్రం జపిస్తే సరిపోదు. మరింత ఫోకస్‌ అవసరం. గతంలో 1991లో ఫారెక్స్‌ సంక్షోభాన్ని పీవీ, 1998లో అణు పరీక్షల కారణంగా అమెరికా విధించిన ఆంక్షలను అటల్‌జీ ఎదుర్కొన్న తీరును గమనించండి. ప్రస్తుతం మాటలే తప్ప అలాంటి చేతలు కనిపించడం లేదు. ఎకానమీ మందగమనానికి గల్ఫ్‌ వార్, క్రూడ్‌ ధరల పెరుగుదల మాత్రమే కాదు, చాలా అంశాలు ప్రభావం చూపుతున్నాయి. 

– డా. సంజయ బారు, పాలసీ ఎనలిస్ట్‌  

Advertisement
 
Advertisement
Advertisement