
3.8 లక్షల ఉద్యోగాల కల్పన
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రాలో భారీగా సీజనల్ హైరింగ్
డెలివరీ, లాజిస్టిక్స్ విభాగాల్లో అత్యధిక నియామకాలు
పండుగ సీజన్‌లో అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయనే అంచనాల నేపథ్యంలో దేశీయంగా ఈ–కామర్స్ కంపెనీలు భారీ స్థాయిలో సిబ్బందిని తీసుకుంటున్నాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మింత్రా సహా దిగ్గజ ఈ–కామర్స్ ప్లాట్‌ఫాంలు సుమారు 3.8 లక్షలకు పైగా సీజనల్ ఉద్యోగావకాశాలు కల్పించాయి. సరఫరా వ్యవస్థ, లాజిస్టిక్స్, కస్టమర్ సర్వీస్ తదితర కార్యకలాపాలవ్యాప్తంగా నియామకాలు చేపట్టాయి.
ఫ్లిప్‌కార్ట్ 2.2 లక్షల సీజనల్ ఉద్యోగాలు కల్పించినట్లు వెల్లడించింది. అలాగే, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో పండుగ సీజన్ కోసమే కొత్తగా 650 డెలివరీ హబ్‌లను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ‘పండుగ సీజన్ సందర్భంగా 28 రాష్ట్రాలవ్యాప్తంగా ఉద్యోగావకాశాలు, మౌలిక సదుపాయాలు, టెక్ వినియోగాన్ని గణనీయంగా పెంచుకుంటున్నాం.
2.2 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించడంతో పాటు లాస్ట్–మైల్ డెలివరీల కోసం ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో కూడా ఏర్పాట్లు చేశాం‘ అని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. అటు అమెజాన్ ఇండియా కూడా హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, పుణే, బెంగళూరు, లక్నో సహా దేశవ్యాప్తంగా 400 పైగా నగరాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 1.5 లక్షల పైగా ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపింది.
ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లు, సోర్టింగ్ కేంద్రాలు, లాస్ట్–మైల్ డెలివరీ స్టేషన్ల నెట్‌వర్క్‌లో ఈ మేరకు నియమించుకున్నట్లు వివరించింది. అలాగే కొత్తగా 12 ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లను (ఎఫ్‌సీ) ఏర్పాటు చేయడంతో పాటు ఆరు ఎఫ్‌సీలను విస్తరించినట్లు పేర్కొంది. అటు హుబ్లీ్ల, త్రివేండ్రం, రాజ్‌పురా, గోరఖ్‌పూర్, మొరాదాబాద్, ప్రయాగ్‌రాజ్‌లో కొత్తగా ఆరు సోర్టింగ్ సెంటర్స్ కూడా నెలకొల్పింది.
‘క్విక్’ విస్తరణ...: ఫ్యాషన్, లైఫ్‌స్టయిల్ ఈకామర్స్ సంస్థ మింత్రా సైతం 11,000 నియామకాలు జరిపినట్లు వివరించింది. లాజిస్టిక్స్, కస్టమర్ సర్వీస్, లాస్ట్–మైల్ డెలివరీ విభాగాల్లో సిబ్బందిని తీసుకున్నట్లు పేర్కొంది. ఈ–కామర్స్, క్విక్ కామర్స్ విస్తరణ కారణంగా ఎక్కువగా డెలివరీ, లాజిస్టిక్స్ విభాగాల్లో నియామకాలు ఉంటున్నాయి.
హైరింగ్ 25 శాతం అప్..
గతేడాదితో పోలిస్తే ఈసారి పండుగ ల్లో సీజనల్ హైరింగ్ 20–25% పెరగవచ్చని క్వెస్ స్టాఫింగ్ సొల్యూషన్స్ సీఈవో నితిన్ దవే తెలిపారు. పండుగకి సంబంధించి ఈ–కామర్స్ సంస్థల ముందస్తు సన్నాహాలను సూచిస్తూ జూలై, ఆగస్టు మధ్య హైరింగ్ ప్రతిపాదనలు 53 శాతం పెరిగినట్లు వివరించారు. సంప్రదాయ మార్కెట్ల పరిధి దాటి ఇతర ప్రాంతాలకు వ్యాపారాలు విస్తరిస్తున్న నేపథ్యంలో కేవలం మెట్రోలే కాకుండా జైపూర్, కోయంబత్తూర్, ఇండోర్, నాగ్‌పూర్‌లాంటి ద్వితీయ శ్రేణి పట్టణాలు కూడా హైరింగ్ హబ్‌లుగా ఎదుగుతున్నాయని దవే చెప్పారు.
గత అయిదేళ్లుగా పండుగల సందర్భంగా తాత్కాలిక నియామకాలు చాలా వేగంగా పెరిగి, ప్రస్తుతం నెమ్మదిగా స్థిర స్థాయికి చేరుతున్నాయన్నారు. కరోనా మహమ్మారి అనంతరం ఒక్కసారిగా ఎగిసిన నియామకాల వృద్ధి రేటు ప్రస్తుతం కాస్త నెమ్మదించినప్పటికీ సంఖ్యాపరంగా రిక్రూట్‌మెంట్ క్రమంగా పెరుగుతూనే ఉందని టీమ్‌లీజ్ సర్వీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎ. బాలసుబ్రమణియన్ వివరించారు. డెలివరీ సిబ్బందికి అత్యధికంగా డిమాండ్ నెలకొందని, పండుగ సీజన్ నియామకాల్లో వీరి వాటా 40% వరకు ఉంటుందని పేర్కొన్నారు. తర్వాత స్థానాల్లో వేర్‌హౌస్ వర్కర్లు (20%), కస్టమర్ సపోర్ట్ (15%), రిటైల్ ఫ్లోర్ సిబ్బంది (10 %), ఫీల్డ్ టెక్నీíÙయన్లు (8 %) ఉన్నారు.
సాక్షి, బిజినెస్ డెస్క్