
దేశీయంగా చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఈ) తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించుకోవడానికి ఈ–కామర్స్ మాధ్యమం దన్నుగా నిలుస్తోంది. సుస్థిర, సమ్మిళిత అభివృద్ధికి దోహదకారిగా ఉంటోంది. కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం, దేశవ్యాప్తంగా వినియోగదారులకు నేరుగా చేరువ కావడానికి, వ్యాపార వృద్ధికి అమెజాన్‌లాంటి డిజిటల్ మార్కెట్‌ప్లేస్‌ల రూపంలో చిన్న వ్యాపారాలకు కొత్తగా మరిన్ని అవకాశాలు లభిస్తున్నాయి.
మరోవైపు, ఎఫ్‌ఎంసీజీ (వేగంగా అమ్ముడయ్యే వినియోగ వస్తువులు) అమ్మకాలు, పట్టణ మార్కెట్లలో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో గణనీయ స్థాయిలో ఉంటున్నాయి. ప్రస్తుతం ఆన్‌లైన్ లావాదేవీల్లో 60 శాతం వాటా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలదే ఉంటోంది. దీంతో దేశవ్యాప్తంగా వినియోగదారులకు నేరుగా చేరువ చేసే డిజిటల్ మార్కెట్‌ప్లేస్‌ల రూపంలో చిన్న సంస్థలకు కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తున్నాయి.
వ్యాపార వృద్ధికి దోహదకారి..
‘భారత ఈ–కామర్స్ వ్యవస్థ, ఎంఎస్‌ఎంఈలకు కీలకమైన వృద్ధి చోదకంగా మారింది. డిమాండ్ భారీగా ఉండే పండుగల సీజన్‌లో ఇది మరింత ఉపయోగకరంగా ఉంటోంది.అలాగే, లోకల్ షాప్‌లు, ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలు, వినూత్నమైన స్టార్టప్‌లను ప్రోత్సహించే ప్రోగ్రాంలతో చిన్న వ్యాపారాలు దేశవ్యాప్తంగా విస్తరించేందుకు వీలవుతోంది. సీజనల్ నియామకాలు కూడా ఆర్థికంగా సానుకూల ప్రభావం చూపుతున్నాయి. లక్షల కొద్దీ ఉద్యోగాలు కల్పిస్తున్నాయి‘ అని ఇండియా ఎస్‌ఎంఈ ఫోరం ప్రెసిడెంట్ వినోద్ కుమార్ తెలిపారు.
డిజిటల్ మార్కెట్‌ప్లేస్‌ల ద్వారా అదే రోజు లేదా మరుసటి రోజే డెలివరీ అప్షన్లతో వినియోగదారులకు సత్వరం సేవలు అందించేందుకు వీలవుతోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి