డాక్టర్‌ రెడ్డీస్‌ లాభం రూ. 1,247 కోట్లు

Dr Reddys Q3 net profit up 77percent at Rs 1247 cr - Sakshi

క్యూ3లో 77 శాతం అప్‌..

కొత్త ఔషధాలు, సానుకూల ఫారెక్స్‌ ఊతం

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో దేశీ ఫార్మా దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ (డీఆర్‌ఎల్‌) నికర లాభం రూ. 1,247 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో నమోదైన రూ. 706 కోట్లతో పోలిస్తే ఇది 77 శాతం అధికం. విదేశీ మారకంపరంగా సానుకూలతలు, కొత్త ఔషధాలను ప్రవేశపెట్టడం తదితర అంశాలు ఇందుకు దోహదపడ్డాయని సంస్థ సీఎఫ్‌వో పరాగ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. సమీక్షాకాలంలో ఆదాయం 27 శాతం పెరిగి రూ. 5,320 కోట్ల నుంచి రూ. 6,770 కోట్లకు పెరిగినట్లు వివరించారు.

గతేడాది సెప్టెంబర్‌లో అమెరికా మార్కెట్లో ప్రవేశపెట్టిన రెవ్‌లిమిడ్‌ ఔషధం .. కంపెనీ ఆదాయాలకు అర్ధవంతమైన రీతిలో తోడ్పడుతోందని ఆయన పేర్కొన్నారు. మూడో త్రైమాసికంలో అయిదు కొత్త ఔషధాలను ప్రవేశపెట్టామని, పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఉత్తర అమెరికా మార్కెట్లో 25 కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టే అవకాశం ఉందని వివరించారు. ధరలపరమైన తగ్గుదల ధోరణులు దాదాపుగా గత రెండు త్రైమాసికాల్లో చూసిన విధంగానే ఉన్నట్లు సంస్థ సీఈవో ఎరెజ్‌ ఇజ్రేలీ పేర్కొన్నారు. అమెరికా, రష్యా మార్కెట్లలో వృద్ధి తోడ్పాటుతో పటిష్టమైన ఆర్థిక పనితీరు కనపర్చగలిగామని డీఆర్‌ఎల్‌ కో–చైర్మన్‌ జి.వి. ప్రసాద్‌ తెలిపారు.

ఫలితాల్లో ఇతర ముఖ్య విశేషాలు..
► కొత్త ఔషధాల ఆవిష్కరణ, ఉత్పత్తుల రేట్ల పెంపుతో భారత్‌ మార్కెట్లో ఆదాయం 10 శాతం పెరిగి రూ. 1,130 కోట్లకు చేరింది.  
► కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్లో ఆదాయం 64 శాతం వృద్ధి చెంది రూ. 3,060 కోట్లుగా నమోదైంది. వర్ధమాన మార్కెట్లలో ఆదాయం 14 శాతం, యూరప్‌లో అమ్మకాలు ఆరు శాతం పెరిగాయి.  
► క్యూ3లో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై రూ. 480 కోట్లు వెచ్చించారు. పెట్టుబడి వ్యయాలపై కంపెనీ రూ. 1,500 కోట్లు వెచ్చించనుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top