ఆగస్ట్‌లో విమాన ప్రయాణికుల్లో వృద్ధి  

Domestic air passenger traffic rose 5 pc to 1 r in August: Icra - Sakshi

5 శాతం పెరిగి 10.2 కోట్లు 

రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా నివేదిక  

న్యూఢిల్లీ: దేశీ విమాన ప్రయాణికుల రద్దీ ఆగస్ట్‌లో 5 శాతం పెరిగింది. 1.02 కోట్ల మంది విమాన సేవలను వినియోగించుకున్నట్టు రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. ఆగస్ట్‌ నెలకు సంబంధించి ఈ రంగంపై ఒక నివేదికను గురువారం విడుదల చేసింది. జూలై నెలలో విమాన ప్రయాణికుల సంఖ్య 97 లక్షలతో పోలిస్తే 5 శాతం పెరిగినట్టు పేర్కొంది.  ఇక 2021 ఆగస్ట్‌ నెల గణాంకాలతో పోల్చి చూస్తే 52 శాతం పెరిగినట్టు తెలిపింది.

ఇక కరోనా ముందు సంవత్సరం 2019 ఆగస్ట్‌ నెల గణాంకాల కంటే 14 శాతం తక్కువే ఉన్నట్టు వివరించింది. విమాన సర్వీసులు పూర్తి సాధారణ స్థాయికి చేరుకోవడంతోపాటు, కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిపోయినందున ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల రద్దీ వేగంగా పుంజుకోవచ్చని ఇక్రా అంచనా వేసింది. భారత ఎయిర్‌లైన్స్‌ సంస్థలకు సంబంధించి విదేశీ ప్రయాణికుల సంఖ్య ఆగస్ట్‌లో 19.8 లక్షలుగా ఉందని, కరోనా ముందు నాటితో పోలిస్తే ఇది 32 శాతం అధికమని తెలిపింది.

 2022 మొదటి ఐదు నెలల్లో దేశీ విమాన ప్రయాణికుల సంఖ్య 5.24 కోట్లుగా ఉంటుందని, క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 131 శాతం అధికమని ఇక్రా పేర్కొంది. విమానయాన ఇంధనం (ఏటీఎఫ్‌) ధరలు పెరిగిపోవడంతో ఎయిర్‌లైన్స్‌ ఆదాయం రికవరీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిదానంగా ఉంటుందని అంచనా వేసింది. దీనికితోడు పరిశ్రమపై ద్రవ్యోల్బణ ప్రభావం సైతం ఉంటుందని పేర్కొంది.       

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top