దూసుకెళ్తున్న మహిళా సారథులు

Deloitte Company Survey Women Ceo Increases In Corporate - Sakshi

పెరుగుతున్న సీఈవోల సంఖ్య 

చైర్‌పర్సన్‌ల సంఖ్యలో తగ్గుదల 

డెలాయిట్‌ నివేదిక

ముంబై: కార్పొరేట్‌ ప్రపంచంలో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్లుగా (సీఈవో) సారథ్య బాధ్యతలు చేపడుతున్న మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అదే సమయంలో బోర్డ్‌ చైర్‌పర్సన్‌లుగా ఉంటున్న వారి సంఖ్య మాత్రం తగ్గుతోంది.  కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్‌ గ్లోబల్‌ రూపొందించిన ’బోర్డ్‌రూమ్‌లో మహిళలు’ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.

దీని ప్రకారం దేశీయంగా 2014లో కంపెనీల బోర్డుల్లో మహిళల సంఖ్య 9.4 శాతంగా ఉండగా, ప్రస్తుతం ఇది 17.1 శాతానికి పెరిగింది. అయితే, బోర్డ్‌ చైర్‌పర్సన్‌లుగా ఉన్న వారి సంఖ్య 2018తో పోలిస్తే 0.9% తగ్గి 3.6 శాతంగా మాత్రమే ఉంది. ప్రతీ బోర్డులో కనీసం ఒక్క మహిళైనా ఉండాలంటూ నిర్దేశించే కంపెనీల చట్టం 2014లో అమల్లోకి వచ్చింది. కొన్ని అంశాలకు సంబంధించి దాన్ని ప్రాతిపదికగా తీసుకుని డెలాయిట్‌ ఈ నివేదిక రూపొందించింది. దేశీయంగా సీఈవో బాధ్యతలు చేపడుతున్న మహిళల సంఖ్య 2018లో 3.4 శాతంగా ఉండగా ప్రస్తుతం 4.7 శాతానికి పెరిగింది. 

అంతర్జాతీయంగా స్వల్పంగా పెరుగుదల ... 
ప్రపంచవ్యాప్తంగా కంపెనీల బోర్డుల్లో మహిళల సంఖ్య 19.7 శాతంగా ఉంది. 2018తో పోలిస్తే 2.8 శాతం పెరిగింది. ఇదే పరిస్థితి కొనసాగితే పురుషులతో దాదాపు సమాన స్థాయిలో మహిళలకు కూడా బోర్డుల్లో చోటు దక్కాలంటే 2045 నాటికి గానీ సాధ్యపడకపోవచ్చని డెలాయిట్‌ వివరించింది. ఆస్ట్రియా, కెనడా, ఐర్లాండ్, ఇటలీ, పోలాండ్, పోర్చుగల్, స్పెయిన్, బ్రిటన్, అమెరికా దేశాల్లోని కంపెనీల్లో మహిళా చైర్‌పర్సన్‌ల సంఖ్య చెప్పుకోతగ్గ స్థాయిలో పెరిగింది. మరోవైపు, అంతర్జాతీయంగా కంపెనీల బోర్డుల్లో స్త్రీల సంఖ్య విషయానికొస్తే పురుషుల సారథ్యంలోని సంస్థలతో పోలిస్తే (19.4 శాతం), మహిళల నేతృత్వంలోని కంపెనీల్లో ఎక్కువ మంది మహిళలు (33.5 శాతం) ఉంటున్నారు. 

దేశీయంగా పెరిగిన పదవీ కాలం.. 
దేశీయంగా మహిళా డైరెక్టర్ల సగటు పదవీకాలం 2018లో 5 ఏళ్లుగా ఉండగా 2021లో 5.1 సంవత్సరాలకు పెరిగింది. అంతర్జాతీయంగా మాత్రం ఇది సగటున 5.5 ఏళ్ల నుంచి 5.1 ఏళ్లకు తగ్గింది. ముఖ్యంగా అమెరికా (2018లో 6.3 ఏళ్ల నుంచి 2021లో 5.3 ఏళ్లకు), బ్రిటన్‌లో (4.1 సంవత్సరాల నుంచి 3.6 ఏళ్లకు), కెనడా (5.7 ఏళ్ల నుంచి 5.2 సంవత్సరాలకు)లో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. కంపెనీల బోర్డుల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగేలా ప్రోత్సహించేందుకు దేశీ నియంత్రణ సంస్థలు మార్గదర్శకాలు ప్రవేశపెట్టినప్పటికీ ఆశయాలకు, వాస్తవ పరిస్థితికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటోందని డెలాయిట్‌ ఇండియా చైర్‌పర్సన్‌ అతుల్‌ ధవన్‌ తెలిపారు.

      

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top