డిజిటల్ ప్రకటనల రంగంలో ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకున్న ఒక కేసులో ఢిల్లీ హైకోర్టు, గూగుల్‌పై కీలకమైన తీర్పును వెల్లడించింది. ప్రముఖ బాత్‌రూమ్ ఫిట్టింగ్స్ అండ్ శానిటరీ వేర్ తయారీ సంస్థ 'హింద్‌వేర్' ట్రేడ్‌మార్క్ హక్కులను ఉల్లంఘించిందని గుర్తించిన కోర్టు, గూగుల్‌కు రూ.30 లక్షల జరిమానా విధించింది.
హింద్‌వేర్ అనేది భారతదేశంలో ప్రసిద్ధి చెందిన శానిటరీ వేర్ బ్రాండ్. వినియోగదారులు గూగుల్‌లో Hindware అని వెతికినప్పుడు, హింద్‌వేర్ వెబ్‌సైట్‌కు బదులుగా ప్రత్యర్థి కంపెనీల ప్రకటనలు ముందుగా కనిపిస్తున్నాయని సంస్థ గుర్తించింది. దీనికి కారణం.. ఆ కంపెనీలు హింద్‌వేర్ అనే పదాన్ని తమ ప్రకటనల కోసం కీవర్డ్‌గా కొనుగోలు చేయడమే.
గూగుల్ యొక్క AdWords (ప్రస్తుతం గూగుల్ యాడ్స్) వ్యవస్థలో కంపెనీలు తమకు కావలసిన కీవర్డ్లపై బిడ్ వేస్తాయి. వినియోగదారులు ఆ పదాలను సెర్చ్ చేసినప్పుడు, ఎక్కువ బిడ్ వేసిన కంపెనీల ప్రకటనలు పైభాగంలో కనిపిస్తాయి. ఈ విధంగా హింద్‌వేర్ పేరును ప్రత్యర్థులు ఉపయోగించుకోవడం వల్ల వినియోగదారులు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని కంపెనీ వాదించింది.
163 పేజీల తీర్పు
ఈ కేసును విచారించిన న్యాయమూర్తి.. గూగుల్ కేవలం ఒక మధ్యవర్తి కాదని స్పష్టం చేశారు. గూగుల్ స్వయంగా కీవర్డ్లను సూచించడం, వాటి వేలాన్ని నిర్వహించడం, ప్రకటనల ప్రదర్శనను తన అల్గోరిథమ్‌ల ద్వారా నియంత్రించడం వంటి చర్యలు చేపడుతోంది. కాబట్టి ట్రేడ్‌మార్క్‌ను వ్యాపార ప్రయోజనాల కోసం ప్రదర్శించాల్సిన బాధ్యత గూగుల్‌పైనా ఉంటుందని కోర్టు తన 163 పేజీల తీర్పులో పేర్కొంది.
కోర్టు అభిప్రాయం ప్రకారం.. హింద్‌వేర్ అనే ట్రేడ్‌మార్క్‌పై గూగుల్‌కు ఎటువంటి యాజమాన్య హక్కు లేదు. అయినప్పటికీ.. ఆ పేరును ప్రత్యర్థి సంస్థలకు అమ్మి లాభం పొందడం ద్వారా గూగుల్ ఆ కంపెనీ ప్రతిష్ఠను వాణిజ్యపరంగా వినియోగించుకుంది. దీనిని కోర్టు ఫ్రీ రైడింగ్ (ఇతరుల కృషి వల్ల ఏర్పడిన పేరును ఉపయోగించి లాభపడటం) అని వెల్లడించింది.
గూగుల్ వాదన
గూగుల్ తనను తాను కేవలం ప్రకటనల వేదికగా మాత్రమే పేర్కొంటూ.. హింద్‌వేర్ సమస్యకు తాము బాధ్యులు కాదని వాదించింది. కీవర్డ్స్ అనేవి వినియోగదారుడు సెర్చ్ చేసినప్పుడు.. ప్రకటనలు చూపించడానికి బ్యాక్ ఎండ్‌లో పనిచేసే కొన్ని సాధనాలు మాత్రమే అని వెల్లడించింది. అంతేకాకుండా.. సమాచార సాంకేతిక చట్టం, 2000లోని సెక్షన్ 79 ప్రకారం తమకు సేఫ్ హార్బర్ రక్షణ వర్తిస్తుందని తెలిపింది. అయితే కోర్టు ఈ వాదనను తిరస్కరించింది.
ఎందుకంటే.. గూగుల్ కేవలం ప్రకటనలను ప్రదర్శించడం మాత్రమే కాకుండా, ట్రేడ్‌మార్క్‌లను కీవర్డ్లుగా అమ్మి ఆదాయం పొందుతోందని గుర్తించింది. అందువల్ల గూగుల్ ఒక క్రియాశీల పాత్ర పోషిస్తోందని, సేఫ్ హార్బర్ రక్షణకు అర్హత లేదని తీర్పు చెప్పింది.
ప్రత్యర్థి సంస్థలు
ఈ కేసులో ప్రత్యర్థి సంస్థలుగా గ్రోహే ఇండియా, ఓంకార ఇన్ఫోవెబ్, సెరా శానిటరీవేర్ కూడా ఉన్నారు. వీరు హింద్‌వేర్ పేరును లేదా హింద్‌వేర్ శానిటరీవేర్ వంటి పదాలను కీవర్డ్లుగా కొనుగోలు చేసి తమ ప్రకటనలను ప్రదర్శించారు. అయితే విచారణ సమయంలో ఈ సంస్థలు హింద్వేర్‌తో రాజీ చేసుకోవడంతో, చివరకు గూగుల్ మాత్రమే ఈ కేసులో మిగిలింది.
ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు భారతదేశంలోని డిజిటల్ మార్కెటింగ్ రంగానికి ఒక మైలురాయిగా నిలిచింది. ఇప్పటి వరకు అనేక కంపెనీలు ప్రత్యర్థి బ్రాండ్ల పేర్లను కీవర్డ్లుగా కొనుగోలు చేసి తమ వ్యాపారాలను ప్రోత్సహించేవి. ఇకపై అలాంటి చర్యలు ట్రేడ్‌మార్క్ ఉల్లంఘనగా పరిగణించబడే అవకాశం ఉంది. నితిన్ కామత్ కూడా ఈ తీర్పును స్వాగతిస్తూ, తమ సంస్థకు ఇలాంటి సమస్యలు సంవత్సరాలుగా ఎదురవుతున్నాయని, ఇప్పుడు చట్టపరమైన పరిష్కారం పొందేందుకు మార్గం ఏర్పడిందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ట్రైన్ టికెట్ కన్ఫర్మ్.. అయినా నిలబడే ప్రయాణం!


