టికెట్ కన్ఫర్మ్.. అయినా నిలబడే ప్రయాణం! | Court Directs Railways To Pay 10x Ticket Price After Passengers Denied Confirmed Seats | Sakshi
Sakshi News home page

టికెట్ కన్ఫర్మ్.. అయినా నిలబడే ప్రయాణం!

May 29 2026 9:27 PM | Updated on May 29 2026 9:32 PM

Court Directs Railways To Pay 10x Ticket Price After Passengers Denied Confirmed Seats

ప్రయాణికులకు కన్ఫర్మ్ టికెట్లు ఇచ్చినా.. వారికి కేటాయించిన బెర్త్‌లు అందించకపోవడం, ఇండియన్ రైల్వే సేవల లోపమే అని వినియోగదారుల కోర్టు స్పష్టం చేసింది. భోజ్‌పూర్ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ రైల్వే శాఖపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రయాణికులకు పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

ఉత్తరప్రదేశ్‌లోని వింధ్యాచల్ నుంచి బీహార్‌లోని ఆరా వరకు వెళ్లాల్సిన నలుగురు ప్రయాణికులు.. ఎల్‌టీటీ పాట్నా ఎక్స్‌ప్రెస్‌లో కన్ఫర్మ్ రిజర్వేషన్ టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే.. వీరు రైలెక్కిన తరువాత తమకు కేటాయించిన బెర్త్‌లపై రైల్వే సిబ్బంది ఉండటం గమనించారు. తమకు కేటాయించిన సీట్లను ఖాళీ చేయాలని కోరినా.. ఎవరూ స్పందించలేదు. దీంతో వారు తమ గమ్యస్థానం వచ్చేవరకు నిలబడే ఉండాల్సి వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

కంప్లైంట్ నంబర్ వచ్చినప్పటికీ..
తాము సీట్లను రిజర్వ్ చేసుకున్నప్పటికీ.. నిలబడే ప్రయాణం చేయడం వల్ల మానసిక, శారీరక ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చిందని పేర్కొన్నారు. వినియోగదారుల కోర్టును ఆశ్రయించడానికంటే ముందు.. రైల్వే హెల్ప్‌లైన్, రైల్వే సేవా, రైల్వే మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కూడా ఫిర్యాదులు చేశారు. తమకు ఎస్ఎమ్ఎస్ ద్వారా కంప్లైంట్ నంబర్ వచ్చినప్పటికీ, ప్రయాణ సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు.

బక్సర్ స్టేషన్ వద్ద వచ్చిన టికెట్ ఎగ్జామినర్‌ (TTE) వద్ద కూడా సమస్యను వివరించారు. అయితే.. రైలులో భారీ రద్దీ ఉందని, ఎలాగోలా మేనేజ్ చేసుకోండని చెప్పినట్లు వారు ఆరోపించారు. ఈ వ్యవహారం రైల్వే ప్రయాణికుల పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపించిందని కోర్టు అభిప్రాయపడింది.

ఇక రైల్వే శాఖ మాత్రం.. ఈ వివాదం శాంతి భద్రతలకు సంబంధించినదని, ఇది ప్రభుత్వ రైల్వే పోలీస్ (GRP) పరిధిలోకి వస్తుందని వాదించింది. తమవైపు నుంచి ఎలాంటి సేవల లోపం జరగలేదని, ఫిర్యాదుపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని తెలిపింది. అయితే.. కోర్టు ప్రయాణికులు సమర్పించిన టికెట్లు, ఫిర్యాదు రికార్డులు, మెసేజ్‌లు, ఫోటోలను పరిశీలించిన తరువాత రైల్వే శాఖ సేవలలో స్పష్టమైన లోపం ఉందని తేల్చింది. ప్రయాణికులకు కన్ఫర్మ్ చేసిన బెర్త్‌లు ఇవ్వకపోవడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొంది.

రూ.20,000 పరిహారం
దీంతో నార్త్ సెంట్రల్ రైల్వే, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కలిసి ప్రయాణికులకు టికెట్ మొత్తానికి (రూ.1,876.80) 8 శాతం వార్షిక వడ్డీతో తిరిగి చెల్లించాలని ఆదేశించింది. అదనంగా రూ.20,000 పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చింది. ఈ మొత్తం 60 రోజుల్లో చెల్లించకపోతే, 10 శాతం వడ్డీతో చట్టపరమైన చర్యల ద్వారా వసూలు చేసుకునే హక్కు ప్రయాణికులకు ఉంటుందని కమిషన్ స్పష్టం చేసింది.

వినియోగదారుల కోర్టు ఇచ్చిన తీర్పును చాలామంది ప్రశంసించారు. కన్ఫర్మ్ టికెట్ ఉన్న ప్రయాణికులకు సరైన సౌకర్యాలు కల్పించడం రైల్వే శాఖ బాధ్యత అని ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది. కాబట్టి ప్రయాణికులకు ఇలాంటి అనుభవం ఎప్పుడైనా  ఎదురైతే.. సంబంధిత శాఖలకు ఫిర్యాదు చేసి, పరిష్కారం పొందవచ్చు.

ఇదీ చదవండి: ఢిల్లీ ఘటన: అందుకే ACలు పేలిపోతున్నాయ్!

Advertisement
 
Advertisement
Advertisement