మాజీ ఐఏఎస్ అధికారి 'ధనేంద్ర కుమార్' మరణం తరువాత.. దేశవ్యాప్తంగా ఎయిర్ కండీషనర్(AC)ల భద్రతపై ఆందోళన పెరిగింది. ఢిల్లీలోని హౌజ్ ఖాస్ ప్రాంతంలో ఆయన నివాసంలో ఏసీ ఇండోర్ యూనిట్ పేలడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ధనేంద్ర కుమార్ పొగ పీల్చడం వల్ల ప్రాణాలు కోల్పోగా, ఆయన కుమారుడు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన వేసవి కాలంలో ఎయిర్ కండీషనర్ల వినియోగంలో.. జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉందో స్పష్టంగా తెలియజేస్తోంది.
ప్రస్తుతం భారతదేశంలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనివల్ల ప్రజలు గంటల తరబడి ఎయిర్ కండీషనర్లను ఉపయోగిస్తున్నారు. అయితే.. నిరంతరాయంగా ఏసీ ఆన్‌లో ఉండటం, సరైన నిర్వహణ లేకపోవడం, విద్యుత్ సరఫరాలో వోల్టేజ్ హెచ్చుతగ్గులు వంటి కారణాలు ప్రమాదాలకు దారితీస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఏసీలు పేలడానికి కారణాలు
ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ ప్రకారం.. నగరంలో జరిగే అగ్ని ప్రమాదాలలో సుమారు 60 శాతం విద్యుత్ లోపాల వలన సంభవిస్తున్నాయని తెలుస్తోంది. వీటిలో షార్ట్ సర్క్యూట్లు, ఓవర్ హీటింగ్, హైలోడ్, నాసిరకం విద్యుత్ పరికరాల వినియోగం ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు.
ఎయిర్ కండీషనర్‌లో అత్యంత కీలక భాగం కంప్రెసర్. వేసవిలో ఏసీని గంటల తరబడి ఆపకుండా వినియోగించడం వల్ల కంప్రెసర్‌పై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. దానికి సరైన విరామం ఇవ్వకపోతే.. అంతర్గత ఉష్ణోగ్రతలు పెరిగి మంటలు చెలరేగే ప్రమాదం ఉంటుంది. అందుకే రోజంతా లేదా రాత్రంతా ఏసీని నిరంతరాయంగా నడపకుండా మధ్య మధ్యలో ఆపడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం స్మార్ట్ టైమర్లు, ఇంటెలిజెంట్ ఏసీ కంట్రోలర్లు వినియోగాన్ని నియంత్రించడంలో సహాయపడుతున్నాయి.
➤ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కూడా మరో ప్రధాన కారణం. ఎక్కువసేపు విద్యుత్ సరఫరా జరుగుతుండటం వల్ల వైర్లు వేడెక్కుతాయి. కొన్నిసార్లు వైర్లపై ఉన్న ఇన్సులేషన్ కరిగిపోవడంతో మంటలు చెలరేగే అవకాశం ఉంటుంది. సాధారణంగా మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్లు అధిక లోడ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా ట్రిప్ అవుతాయి. కానీ అవే పనిచేయకపోతే భద్రతా వ్యవస్థ పూర్తిగా విఫలమవుతుంది.
➤వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ కూడా ఎయిర్ కండీషనర్లకు ప్రమాదకరమే. విద్యుత్ సరఫరాలో ఆకస్మిక మార్పులు వచ్చినప్పుడు కంప్రెసర్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ భాగాలు దెబ్బతింటాయి. ముఖ్యంగా వేసవిలో విద్యుత్ ఒత్తిడి ఎక్కువగా ఉండే నగరాల్లో స్టెబిలైజర్లు, సర్జ్ ప్రొటెక్టర్లు లేదా ఇన్వర్టర్ ఆధారిత ఏసీలను ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.
➤దుమ్ము, మురికి పేరుకుపోయిన ఎయిర్ ఫిల్టర్లు కూడా ప్రమాదాన్ని పెంచుతాయి. గాలి సరైన రీతిలో ప్రవహించకపోవడంతో మిషన్ ఎక్కువ ఒత్తిడితో పనిచేస్తుంది. దీనివల్ల ఉష్ణోగ్రత పెరిగి అంతర్గత విద్యుత్ లోపాలు సంభవించే అవకాశాలు ఎక్కువవుతాయి. అదేవిధంగా పాత వైరింగ్, నాసిరకం కనెక్షన్లు కూడా షార్ట్ సర్క్యూట్ ప్రమాదాన్ని పెంచుతాయి.
ముందే హెచ్చరిక సంకేతాలు!
ఎయిర్ కండీషనర్‌లో సమస్యలు తలెత్తే ముందు కొన్ని హెచ్చరిక సంకేతాలు కనిపిస్తాయి. అసాధారణ శబ్దాలు రావడం, ఏసీ పదేపదే ఆన్-ఆఫ్ అవడం, సమానంగా చల్లదనం రాకపోవడం, కాలిన వాసన రావడం లేదా పొగ కనిపించడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే అనుభవజ్ఞులైన టెక్నీషియన్లతో తనిఖీ చేయించాలి.
భద్రత కోసం.. ఇండోర్, అవుట్‌డోర్ వైరింగ్ సరిగా ఉండేలా చూసుకోవాలి. ఎయిర్ ఫిల్టర్లను తరచుగా శుభ్రం చేయాలి. అవుట్‌డోర్ యూనిట్ చుట్టూ చెత్త లేదా అడ్డంకులు లేకుండా చూసుకోవాలి. ఏసీఉష్ణోగ్రతను 24 నుంచి 26 డిగ్రీల మధ్య ఉంచడం మంచిది. అలాగే రిపేర్లు లేదా ఇన్‌స్టాలేషన్ కోసం కేవలం అధీకృత టెక్నీషియన్ల సేవలనే ఉపయోగించాలి.
నిర్వహణ లేకపోతే..
ధనేంద్ర కుమార్ విషాద ఘటన ఒక పెద్ద హెచ్చరికగా నిలిచింది. ఎయిర్ కండీషనర్ అనేది కేవలం సౌకర్యం కోసం ఉపయోగించే పరికరం మాత్రమే కాదు. సరైన నిర్వహణ లేకపోతే, విద్యుత్ వ్యవస్థలపై అధిక ఒత్తిడి పెరిగితే అది ప్రాణాంతక ప్రమాదాలకు కూడా కారణమవుతుందని ఈ ఘటన స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: యూపీఐ ద్వారా PF విత్‌డ్రా.. కొత్త రూల్స్ ఇవే!


