యూపీఐ ద్వారా PF విత్‌డ్రా.. కొత్త రూల్స్ ఇవే! | EPFO 3 0 PF Withdrawal via UPI Here Are the New Rules | Sakshi
Sakshi News home page

EPFO 3.0: యూపీఐ ద్వారా PF విత్‌డ్రా.. కొత్త రూల్స్ ఇవే!

May 28 2026 4:39 PM | Updated on May 28 2026 5:05 PM

EPFO 3 0 PF Withdrawal via UPI Here Are the New Rules

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO), ఈపీఎఫ్ఓ 3.0 ప్రారభించడానికి సిద్ధమవుతోంది. కాబట్టి చందాదారులు త్వరలోనే తమ పీఎఫ్ డబ్బును మరింత వేగంగా, సులభంగా పొందగలుగుతారు. ఈ కొత్త విధానం ద్వారా.. సభ్యులు యూపీఐ ద్వారా తమ పీఎఫ్ డబ్బును నేరుగా తమ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసుకోవచ్చని, తద్వారా పేపర్ వర్క్, ప్రాసెసింగ్ సమయం వంటివి గణనీయంగా తగ్గుతుందని భావిస్తున్నారు. అయితే.. చాలామందికి ఉన్న సందేహం ఏమిటంటే.. ఖాతా నుంచి ఎంత డబ్బు విత్‌డ్రా చేయవచ్చు?, మొత్తం బ్యాలెన్స్‌ను తక్షణమే పొందవచ్చా?. దీనికి గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

EPFO 3.0 గురించి
ఈపీఎఫ్ఓ 3.0 అనేది ప్రావిడెంట్ ఫండ్ లావాదేవీలను సులభతరం చేయడానికి.. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తీసుకొస్తున్న డిజిటల్ ప్రక్రియ. ఇదివరకు పీఎఫ్ డబ్బు తీసుకోవాలంటే ఫారమ్‌లు, క్లెయిమ్ ప్రాసెసింగ్, ధృవీకరణ వంటి ప్రక్రియలకు ఎక్కువ సమయం పట్టేది. కానీ కొత్త విధానం ద్వారా.. ఈ ప్రక్రియ సులభతరం కానుంది. చందాదారులు తమ పీఎఫ్ ఖాతాలో అర్హత కలిగిన మొత్తాన్ని యూపీఐ ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా పేపర్‌లెస్ విధానం. కాబట్టి ఉద్యోగులకు సమయం, శ్రమ రెండూ తగ్గుతాయి.

ఎంత విత్‌డ్రా చేసుకోవచ్చు?
ఈపీఎఫ్ఓ 3.0 ప్రకారం.. సభ్యులు తమ ఖాతాలోని మొత్తంలో 50% నుంచి 75% వరకు మాత్రమే విత్‌డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే.. మొత్తం డబ్బును ఒక్కసారిగా తీసుకునే అవకాశం లేదు. దీనికి ప్రధాన కారణం.. ఉద్యోగుల రిటైర్మెంట్ భద్రత. భవిష్యత్తు కోసం కొంత మొత్తం ఖాతాలో తప్పనిసరిగా ఉండేలా ప్రభుత్వం నియమాలు రూపొందిస్తోంది.

ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి?
కొత్త నియమాల ప్రకారం.. పీఎఫ్ ఖాతాలో కనీసం 25శాతం ఉండాలి. దీనిని ఉద్యోగులు తమ రిటైర్మెంట్ సమయంలో ఉపయోగించుకోవచ్చు.

అయితే.. ఆటో సెటిల్మెంట్ పరిమితిని పెంచారు. ఇప్పటివరకు ఆటో సెటిల్మెంట్ ద్వారా రూ.1 లక్ష వరకు మాత్రమే క్లెయిమ్‌లు త్వరగా ప్రాసెస్ అయ్యేవి. ఇప్పుడు ఈ పరిమితిని రూ.5 లక్షలకు పెంచారు. దీని వల్ల సభ్యులు తక్షణ అవసరాల కోసం పెద్ద మొత్తాన్ని త్వరగా పొందగలుగుతారు.

యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా
ఈపీఎఫ్ఓ 3.0 విధానంలో.. చందాదారుడు ముందుగా తాను ఎంత మొత్తం విత్‌డ్రా చేసుకోవచ్చు అనేది చూడవచ్చు. తరువాత తన బ్యాంక్ ఖాతాతో లింక్ చేసిన యూపీఐ ఐడీ ద్వారా ఆ మొత్తాన్ని నేరుగా బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియలో సేఫ్టీ కోసం యూపీఐ పిన్ ధ్రువీకరించాల్సి ఉంటుంది. డబ్బు ఖాతాలో జమ అయిన తర్వాత సభ్యుడు ఆ మొత్తాన్ని డిజిటల్ చెల్లింపులు, బ్యాంకుకు బదిలీ చేయడం లేదా ఏట్ఎం ద్వారా నగదు రూపంలో విత్‌డ్రా చేసుకోవచ్చు.

EPFO 3.0 ఎప్పుడు ప్రారంభమవుతుంది?
కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ప్రకారం.. యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రాకు సంబంధించిన అన్ని పరీక్షలు పూర్తయ్యాయి. కాబట్టి ఇది త్వరలోనే ఈ సదుపాయం ప్రారంభం కానుందని ఆయన తెలిపారు. అయితే.. తేదీని మాత్రం అధికారికంగా వెల్లడించలేదు.

ఇదీ చదవండి: గ్యాస్ వినియోగదారులకు ఊరట!

Advertisement
 
Advertisement
Advertisement