స్టాక్ మార్కెట్లలో బుల్ రన్.. ఈరోజు లాభాలకు కారణాలు | Dalal Street Surges Sensex, Nifty Jumps Oil Prices Ease Geopolitical Tensions Cool | Sakshi
Sakshi News home page

స్టాక్ మార్కెట్లలో బుల్ రన్.. ఈరోజు లాభాలకు కారణాలు

Apr 29 2026 3:47 PM | Updated on Apr 29 2026 3:53 PM

Dalal Street Surges Sensex, Nifty Jumps Oil Prices Ease Geopolitical Tensions Cool

భారత స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం (ఏప్రిల్ 29, 2026) వృద్ధిని కనబరిచాయి. అంతర్జాతీయ ప్రతికూలతలను అధిగమిస్తూ ఇన్వెస్టర్లు కొనుగోళ్ల వైపు మొగ్గు చూపడంతో దలాల్ స్ట్రీట్ కళకళలాడింది. మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 609 పాయింట్లు లాభపడి 77,496 వద్ద స్థిరపడగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 181 పాయింట్లు పుంజుకుని 24,177 స్థాయికి చేరుకుంది.

లాభాలకు కారణాలు(నిపుణుల అంచనా)

ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల సడలింపు ఆశలు

గత కొద్దివారాలుగా ప్రపంచ మార్కెట్లను వణికించిన ఇరాన్-అమెరికా మధ్య యుద్ధ వాతావరణం కొంత సడలినట్లు కనిపిస్తోంది. యుద్ధం మరిన్ని ప్రాంతాలకు వ్యాపించకుండా అంతర్జాతీయ దౌత్య ప్రయత్నాలు ఫలిస్తున్నాయన్న సంకేతాలు ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని నింపాయి. ముఖ్యంగా హార్మూజ్‌ జలసంధి గుండా చమురు రవాణాకు ఆటంకాలు తొలగుతాయన్న వార్తలు మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచాయి.

క్రూడాయిల్ ధరల తగ్గుదల

మధ్యప్రాచ్యంలో నెలకొన్న సంక్షోభం కారణంగా మార్చి నెలాఖరులో బ్రెంట్ క్రూడ్ ధర 120 డాలర్ల మార్కును దాటినప్పటికీ ప్రస్తుతం అది క్రమంగా తగ్గుముఖం పట్టి 111 డాలర్ల స్థాయికి చేరుకుంది. దీనికి తోడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మే నెలలో ఒపెక్ నుంచి నిష్క్రమిస్తుందన్న వార్తలు చమురు సరఫరా పెరుగుతుందన్న అంచనాలు భారత ఆర్థిక వ్యవస్థకు ఊరటనిచ్చాయి. మన దేశం దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతుంది కాబట్టి చమురు ధర తగ్గడం మార్కెట్లకు సానుకూల అంశంగా మారింది.

యూఎస్ ఫెడ్ నిర్ణయంపై దృష్టి

అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈరోజు తన వడ్డీ రేట్ల నిర్ణయాన్ని ప్రకటించనుంది. ప్రస్తుతం వడ్డీ రేట్లను మార్చకుండా 3.50% - 3.75% వద్దే కొనసాగించవచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందన్న ఆశాభావంతో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తిరిగి భారత మార్కెట్లోకి నిధులను మళ్లించడం గమనార్హం.

భౌగోళిక ఉద్రిక్తతలు ఇంకా పూర్తిగా సద్దుమణగనప్పటికీ భారత కంపెనీల ఆర్థిక పటిష్టత, అంతర్జాతీయంగా చమురు ధరల స్థిరీకరణ నేటి లాభాలకు ప్రధాన కారణమయ్యాయి. రాబోయే రోజుల్లో యుద్ధ పరిణామాలు, అమెరికా ఫెడ్ ఇచ్చే దిశానిర్దేశం మార్కెట్ గమనాన్ని నిర్ణయించనున్నాయి.

ఇదీ చదవండి: ‘ఎండీ పదవీకాలం పొడిగించవద్దు’

Advertisement
 
Advertisement
Advertisement