దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) సందీప్ బక్షి పదవీకాలం పొడిగింపుపై నీలినీడలు ముసురుకుంటున్నాయి. బక్షి నాయకత్వంలో బ్యాంక్ వ్యవస్థాగత పాలనా వైఫల్యాలు, నియంత్రణ ఉల్లంఘనలు, మోసాలకు పాల్పడిందని ఆరోపిస్తూ ప్రముఖ న్యాయవాది, సామాజిక కార్యకర్త ప్రశాంత్ భూషణ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కి లేఖ రాశారు. ఆయన పదవీకాలాన్ని పొడిగించవద్దని, అది బ్యాంకింగ్ నిబంధనలకు విరుద్ధమని భూషణ్ తన విజ్ఞప్తిలో పేర్కొన్నారు.
నియంత్రణ ఉల్లంఘనల పరంపర
సాధారణంగా మూడేళ్ల పాటు ఉండే పదవీకాలాన్ని కాదని వారసత్వ ప్రణాళికలో భాగంగా సందీప్ బక్షికి రెండేళ్ల పొడిగింపు ఇవ్వాలని ఐసీఐసీఐ బ్యాంక్ జనవరిలో ఆర్‌బీఐని కోరింది. ఈ నేపథ్యంలో భూషణ్ లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లోని సెక్షన్లు 35A, 35B, 36AA, 10B కింద ఆర్‌బీఐ తన చట్టబద్ధమైన అధికారాలను ఉపయోగించాలని ఆయన కోరారు.
‘బక్షి హయాంలో నిరంతర నియంత్రణ ఉల్లంఘనలు జరిగాయి. ఆయనను కొనసాగించడం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది’ అని భూషణ్ హెచ్చరించారు. ముఖ్యంగా 2020-21 కాలంలో (చందా కొచ్చర్ నిష్క్రమణ తర్వాత) రుణాల వ్యవహారం, సైబర్ సెక్యూరిటీ, కస్టమర్ రక్షణ వంటి అంశాలలో విఫలమైనందుకు బ్యాంక్‌పై ఆర్‌బీఐ రూ.12 కోట్ల జరిమానా విధించడాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.
రూ.245 కోట్ల మోసాలు.. డేటా ఉల్లంఘనలు
2024 నుంచి ఇప్పటివరకు సుమారు 23 ఆర్థిక మోసాలు జరిగినట్లు భూషణ్ తన లేఖలో జాబితా చేశారు. ‘22 శాఖల్లో సుమారు రూ.245 కోట్ల మేర నష్టం వాటిల్లింది. కస్టమర్ల గోప్యతకు సంబంధించిన డేటా ఉల్లంఘనలు కూడా చోటుచేసుకున్నాయి’ అన్నారు. అయితే, ఈ నష్టాలు బ్యాంకు నికర లాభంలో కేవలం 0.25% మాత్రమేనని, పైగా వీటిలో బక్షి వ్యక్తిగతంగా నిందితుడు కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ, ఒక విపత్తు సంభవించే వరకు ఆర్‌బీఐ వేచి చూడకూడదని భూషణ్ వాదించారు.
కార్మిక చట్టాల ఉల్లంఘన.. ఉద్యోగుల ఆత్మహత్యలు
బ్యాంకులో పని ఒత్తిడి, ఉద్యోగుల వేధింపులపై భూషణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘2024 జనవరి - జూన్ మధ్య సుమారు 800 మంది ఉద్యోగులు పని మానేసినట్లు సమాచారం. ఇది మొత్తం సిబ్బందిలో 0.39%. పని ఒత్తిడి కారణంగా ఇటీవల నలుగురు ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. కార్మిక అధికారులు కోరినప్పటికీ క్రమశిక్షణా చర్యలకు సంబంధించిన సాక్ష్యాధారాలు, రికార్డులు అందించడంలో బ్యాంక్ విఫలమైంది’ అని ఆరోపించారు. దీనిపై బక్షిపై ప్రాసిక్యూషన్ అనుమతి కోరడానికి చర్యలు ప్రారంభించినట్లు లేఖలో పేర్కొన్నారు.
రూ.1,224 కోట్ల జీఎస్టీ డిమాండ్లు
పన్ను చెల్లింపుల్లో కూడా బ్యాంక్ విఫలమైందని భూషణ్ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుంచి సుమారు రూ.1,224 కోట్లకు పైగా జీఎస్టీ డిమాండ్ నోటీసులు రావడం అంతర్గత ఆడిట్ నియంత్రణలో ఉన్న లోపాలను ఎత్తిచూపుతోందని ఆయన విమర్శించారు.
చందా కొచ్చర్ నిష్క్రమణ తర్వాత బ్యాంకును గాడిలో పెట్టిన బక్షి తన చిరకాల ప్రత్యర్థి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో ఉన్న అంతరాన్ని గణనీయంగా తగ్గించగలిగారు. మరి ఈ ఆర్థిక విజయాలను పరిగణనలోకి తీసుకుని ఆర్‌బీఐ ఆయనకు పదవి పొడిగింపు ఇస్తుందా? లేక ప్రశాంత్ భూషణ్ లేవనెత్తిన నియంత్రణ లోపాలపై విచారణ చేపడుతుందా? అన్నది ఇప్పుడు బ్యాంకింగ్ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.
ఇదీ చదవండి: ‘మూన్‌లైటింగ్’ టెక్కీ కన్నీటి గాథ!


