రోజూ రూ.3 కోట్లు మాయం! ఎలా మోసం చేస్తున్నారంటే.. | Sakshi
Sakshi News home page

Cyber Fraud: రోజూ రూ.3 కోట్లు మాయం! ఎలా మోసం చేస్తున్నారంటే..

Published Sun, Jan 14 2024 9:51 AM

Cyber Crime On Telangana Fraud Worth Rs 707 Crs - Sakshi

సైబర్‌ యుగంలో ఆన్‌లైన్‌ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. డెబిట్‌, క్రెడిట్‌ కార్డు వివరాలు తెలుసుకుని మన ప్రమేయమేమీ లేకుండానే నేరగాళ్లు షాపింగ్‌ చేస్తున్నారు. రుణయాప్‌ల పేరుతో తోచినంత లాగేస్తున్నారు. కొన్ని టాస్క్‌లు ఇచ్చి అవిపూర్తి చేసిన తర్వాత ఆన్‌లైన్‌ పెట్టుబడి పెట్టాలంటూ మోసాలకు పాల్పడుతున్నారు. పిన్‌ నంబరు కొట్టేసి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు కాజేస్తున్నారు. సిమ్‌ స్వాప్‌ చేసి మన ఫోన్‌కు అందాల్సిన మెసేజ్‌లను మళ్లించి, డబ్బు లాగేస్తున్నారు. ఇలా నిత్యం జరుగుతున్న మోసాల ద్వారా కేవలం తెలంగాణలోనే ఏకంగా దాదాపు 8 నెలల్లో రూ.707 కోట్లమేర సొమ్ము గుంజినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో 2023లో జరిగిన 16,339 సైబర్‌ నేరాల్లో 15 వేల వరకు ఆర్థిక మోసాలే నమోదయ్యాయి. ముఖ్యంగా అయిదు నేరవిధానాల ద్వారా ఆన్‌లైన్‌లో ఆర్థికమోసాలు జరుగుతున్నట్లు తెలంగాణ స్టేట్‌ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(టీఎస్‌సీఎస్‌బీ) నిపుణులు గుర్తించారు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న సైబర్‌ నేరాల్లో ఒక్క తెలంగాణలోనే 40 శాతానికిపైగా ఉండటాన్ని బట్టి రాష్ట్రంపై సైబర్‌ నేరస్థులు ఎలా పంజా విసురుతున్నారో అర్థమవుతోంది. తెలంగాణలో సైబర్‌ నేరస్థులు ఎనిమిది నెలల్లో రూ.707.25 కోట్లు మోసానికి పాల్పడినట్లు నిపుణులు చెబుతున్నారు. అంటే రోజూ రూ.3 కోట్లు మోసం చేస్తున్నారు. అలాంటి సైబర్‌ మోసాలపై అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు.

ఎలా మోసం చేస్తున్నారంటే..

వస్తువులు విక్రయిస్తామంటూ..

ఏదైనా వాహనం లేదా వస్తువును అమ్మకానికి పెట్టినట్లు వెబ్‌సైట్లలో ప్రకటనలిస్తారు. కొనుగోలుకు ఆసక్తిచూపే వారితో వాహనం విమానాశ్రయం పార్కింగ్‌ స్థలంలో ఉందని.. రవాణా ఛార్జీలు పంపిస్తే చాలు మీరు కోరిన ప్రదేశానికి పంపిస్తామని మాటలు చెబుతున్నారు. అలా రూ.వందలతో మొదలుపెట్టి వీలైనంత వరకు కొట్టేస్తున్నారు. 

పెట్టుబడి పెట్టాలంటూ..

మోసగాళ్లు పార్ట్‌టైమ్‌ ఉద్యోగాల పేరిట సందేశాలు పంపి స్పందించిన వారిని టాస్క్‌లు పూర్తి చేయాలని కోరుతున్నారు. తాము సూచించే వెబ్‌సైట్‌లో వీడియోలు పరిశీలించి రేటింగ్‌ ఇస్తే చాలు భారీగా డబ్బులొస్తాయని చెబుతున్నారు. ముందు కొంత డబ్బు పెట్టుబడిగా పెట్టించి టాస్క్‌ను పూర్తి చేస్తే భారీ లాభం ఇస్తున్నారు. దీంతో వారు మరింత పెట్టుబడి పెడుతున్నారు. లక్షలు పెట్టాక మోసం చేస్తున్నారు. 

పార్సిళ్ల పేరుతో..

సైబర్‌ నేరస్థులు కొరియర్‌ ఉద్యోగుల మాదిరిగా నటిస్తున్నారు. ఫోన్‌ చేసి విదేశాల నుంచి మీకో పార్సిల్‌ వచ్చిందని అందులో డ్రగ్స్‌ ఉన్నాయంటూ కస్టమ్స్‌ అధికారులకు అప్పగించామని చెబుతున్నారు. కొద్దిసేపటికే కస్టమ్స్‌ అంటూ మరొకరు ఫోన్‌ చేసి అరెస్ట్‌ వారంట్‌ జారీ అయిందని చెబుతున్నారు. న్యాయపరమైన చిక్కులు తప్పిస్తామంటూ రూ.లక్ష నుంచి వీలైనంత మేరకు వసూలు చేస్తున్నారు.

ఇదీ చదవండి: భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించే టెక్నాలజీ ఇదే.. కానీ..

అప్‌గ్రేడ్‌ చేస్తామంటూ..

క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డులను అప్‌గ్రేడ్‌ చేస్తామని బ్యాంకు ప్రతినిధుల ముసుగులో ఫోన్లు చేస్తున్నారు. లేదంటే కార్డు బ్లాక్‌ అవుతుందని భయపెడుతున్నారు. తాము పంపే ఆ లింక్‌ ద్వారా సమాచారం నింపాలని మాల్‌వేర్‌ను పంపించి కార్డుల ఎక్స్‌పైరీ తేదీ, సీవీవీ నంబరుతోపాటు ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ వివరాలను తీసుకొని ఖాతా ఖాళీ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement