దేశంలో శ్వేత విప్లవ పురోగతి

Crisil Estimates On White Revolution In India - Sakshi

వ్యవస్థీకృత డెయిరీ పరిశ్రమ వృద్ధి 12 శాతం

 2021–22 ఆర్థిక సంవత్సరంలో విలువ రూ.1.6 లక్షల కోట్లు!    

ముంబై: భారత్‌లో వ్యవస్థీకృత డెయిరీ పరిశ్రమ మార్చితో ముగిసే 2021–22 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 12 శాతం పురోగమించే అవకాశం ఉందని క్రిసిల్‌ రేటింగ్స్‌ తాజా నివేదిక పేర్కొంది. విలువలో ఇది రూ.1.6 లక్షల కోట్లని విశ్లేషించింది. వాల్యూ యాడెడ్‌ ప్రొడక్ట్స్‌ (వీఏపీ) డిమాండ్‌ రికవరీ కావడం, లిక్విడ్‌ పాల అమ్మకాలు స్థిరంగా ఉండడం, రిటైల్‌ ధరలో పెరుగుదల వంటి అంశాలు శ్వేత విప్లవ పురోగతికి కారణమని పేర్కొంది. నివేదిక ముఖ్యాంశాలను పరిశీలిస్తే... 
- కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో 2020–21 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి పదేళ్ల కనిష్టం.. ఒక శాతం పడిపోయిన భారత వ్యవస్థీకృత డెయిరీ పరిశ్రమ ఆదాయాలు 2021–22లో మహమ్మారి ముందస్తు స్థాయికి క్రమంగా పరిశ్రమ కోలుకుంటున్నాయి. 
- వాల్యూ యాడెడ్‌ ప్రొడక్ట్స్‌ (వీఏపీ) విభాగం వ్యవస్థీకృత రంగ విక్రయాలలో మూడింట ఒక వంతు వాటా కలిగి ఉంది.  దీనితోపాటు ఈ రంగంలో దాదాపు మూడింట రెండు వంతుల వాటా ఉన్న లిక్విడ్‌ పాల విభాగానికి స్థిరమైన డిమాండ్‌ కొనసాగుతోంది. ఈ విభాగాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అలాగే  వచ్చే ఆర్థిక సంవత్సరం (మహమ్మారి ముందు ఉన్న ట్రెండ్‌కు అనుగుణంగా) 5–6 శాతం వృద్ధి నమోదయ్యే వీలుంది.  
- నిర్వహణ లాభదాయకత 2020– 2021 ఆర్థిక సంవత్సరంలో 6 శాతం ఉంది.  వచ్చే రెండు రెండు ఆర్థిక సంవత్సరాలలో 5–5.5 శాతం శ్రేణిలో ఉండే వీలుంది.  డెయిరీలు ఈ ఏడాది కేటగిరీల వారీగా రిటైల్‌ ఉత్పత్తుల ధరలను 3–4 శాతం పెంచడం, అధిక ముడి పాల ధరలు దీనికి కారణం. రవాణా, ప్యాకేజింగ్‌ వ్యయాలు పెరిగినప్పటికీ నిర్వాహణా లాభాలకు విఘాతం ఏర్పడదు.  
- మెరుగైన రాబడులు, వృద్ధి, స్థిరమైన నిర్వహణ లాభాలు, పటిష్ట బ్యాలెన్స్‌ షీట్‌ల వంటి అంశాలు డెయిరీ పరిశ్రమలకు ’స్థిరమైన’ క్రెడిట్‌ ఔట్‌లుక్‌ హోదా కల్పించే అవకాశం ఉంది.  
- నెయ్యి, వెన్న, జున్ను, పెరుగు వంటి వాల్యూ యాడెడ్‌ ప్రొడక్ట్స్‌  (వీఏపీ) కోసం డిమాండ్‌ భారీగా పెరగనుంది. ఈ ఆర్థిక సంవత్సరం   మూడవ త్రైమాసికంలో (అక్టోబర్‌–డిసెంబర్‌) పండుగలు, వివాహాల సీజన్, దేశ వ్యాప్తంగా వాణిజ్య సంస్థలు తిరిగి ప్రారంభమవడం వంటి అంశాలు ఈ విభాగాల్లో బలమైన పునరుద్ధరణకు కారణం.  
- వాల్యూ యాడెడ్‌ ప్రొడక్ట్స్‌  (వీఏపీ) అమ్మకాల్లో 17 నుంచి 18 శాతం వృద్ధి నమోదయ్యే వీలుంది. కరోనా ఆంక్షల అనంతరం హోటళ్లు, రెస్టారెంట్లు, కేఫ్‌లు (వ్యవస్థీకృత రంగాల విక్రయాలలో 20 శాతం వాటా) తిరిగి తెరుచుకోవడం, పండుగలు,  వివాహ వేడుకలు, ఉపాధి కల్పన మెరుగుపడ్డం వంటి అంశాలు దీనికి ప్రధాన కారణం.  
- కోవిడ్‌–19 రెండవ,  మూడవ వేవ్‌ల ప్రభావం డెయిరీ పరిశ్రమపై ఎటువంటి భౌతిక ప్రభావం చూపలేదు. ఆంక్షలు స్థానిక స్థాయికి పరిమితం కావడం, ప్రత్యక్ష ఫుడ్‌–డెలివరీ సేవలు, తినుబండారాలు పని చేస్తూనే ఉండడం వంటి అంశాలు దీనికి కారణం.  
- 57 రేటెడ్‌ డెయిరీల క్రిసిల్‌ రేటింగ్స్‌ విశ్లేషణ ఆధారంగా ఈ నివేదిక రూపొందింది.  వ్యవస్థీకృత సెగ్మెంట్‌ ద్వారా వస్తున్న రూ. లక్ష కోట్ల ఆదాయంలో ఈ 57 రేటెడ్‌ డెయిరీల వాటా దాదాపు 60 శాతం.   

చదవండి:భారీగా పామాయిల్‌ సాగు 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top