ప్రముఖ కంపెనీలు ఎట్టకేలకు ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో క్యూ2 ఫలితాలని విడుదల చేశాయి. ఈ ఫలితాలను పరిశీలిస్తే..
హ్యాట్సన్
పాలు, పాల ఉత్పత్తుల వ్యాపారంలోని హ్యాట్సన్ ఆగ్రో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ కాలానికి ఆకర్షణీయమైన పనితీరు చూపించింది. లాభం ఏకంగా 70 శాతం ఎగసి రూ.109 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.64 కోట్లుగానే ఉంది. ఆదాయం సైతం 17 శాతం వృద్ధి చెంది రూ.2,072 కోట్ల నుంచి రూ.2,427 కోట్లకు చేరింది. వ్యయాలు సైతం రూ.1,991 కోట్ల నుంచి రూ.2,284 కోట్లకు చేరాయి.
రేమండ్ లైఫ్‌స్టైల్
బ్రాండెడ్ దుస్తులు, టెక్స్‌టైల్స్ కంపెనీ రేమండ్ లైఫ్‌స్టైల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం దాదాపు రెట్టింపై రూ. 75 కోట్లను అధిగమించింది. బ్రాండెడ్ టెక్స్‌టైల్స్, దుస్తుల అమ్మకాలు పుంజుకోవడం ఇందుకు సహకరించింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 42 కోట్లు ఆర్జించింది. రేమండ్ గ్రూప్ కంపెనీ మొత్తం ఆదాయం సైతం రూ. 1,708 కోట్ల నుంచి రూ. 1,832 కోట్లకు బలపడింది. అయితే మొత్తం వ్యయాలు 8 శాతం పెరిగి రూ. 1,758 కోట్లకు చేరాయి. పార్క్ ఎవెన్యూ, కలర్‌ప్లస్, పార్క్స్, ఎతి్నక్స్ తదితర బ్రాండ్ల కంపెనీ నిర్వహణ లాభం(ఇబిటా) రూ. 259 కోట్లను తాకగా.. 13.9 శాతం మార్జిన్లు సాధించింది.
డీసీఎం శ్రీరామ్
డైవర్సిఫైడ్ దిగ్గజం డీసీఎం శ్రీరామ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం రెండు రెట్లుపైగా జంప్‌చేసి రూ. 159 కోట్లకు చేరింది. అమ్మకాలు పుంజుకోవడం ఇందుకు సహకరించింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 63 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 3,184 కోట్ల నుంచి రూ. 3,531 కోట్లకు బలపడింది. కెమికల్స్, వినైల్, అగ్రికల్చర్ తదితర విభాగాలు కలిగిన కంపెనీ మొత్తం వ్యయాలు సైతం రూ. 3,796 కోట్ల నుంచి రూ. 4,873 కోట్లకు పెరిగాయి. కెమికల్స్, వినైల్ విభాగాల ఆదాయం రూ. 777 కోట్ల నుంచి రూ. 1,108 కోట్లకు ఎగసింది.
ధనలక్ష్మీ బ్యాంక్
ప్రయివేట్ రంగ సంస్థ ధనలక్ష్మీ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 12 శాతం క్షీణించి రూ. 23 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 26 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 380 కోట్ల నుంచి రూ. 418 కోట్లకు ఎగసింది. వడ్డీ ఆదాయం రూ. 329 కోట్ల నుంచి రూ. 384 కోట్లకు పెరిగింది. కాగా.. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 3.82 శాతం నుంచి 3.1 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు నిలకడను చూపుతూ 1.12 శాతంగా నమోదయ్యాయి.
వరుణ్ బెవరేజెస్
గ్లోబల్ పానీయాల దిగ్గజం పెప్సీకోకు బాట్లర్‌గా వ్యవహరించే వరుణ్ బెవరేజెస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్(క్యూ3)లో నికర లాభం 19 శాతం ఎగసి రూ. 745 కోట్లను అధిగమించింది. ఫైనాన్స్ వ్యయాలు తగ్గడం, ఇతర ఆదాయం పుంజుకోవడం, కరెన్సీ లాభాలు ఇందుకు సహకరించాయి. గతేడాది(2024) ఇదే కాలంలో రూ. 629 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 4,932 కోట్ల నుంచి రూ. 5,048 కోట్లకు బలపడింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 4,156 కోట్ల నుంచి రూ. 4,253 కోట్లకు పెరిగాయి. కంపెనీ జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణించే విషయం విదితమే. అమ్మకాలు 2.4 శాతం పుంజుకుని 27.38 కోట్ల కేసులకు చేరాయి.


