వావ్‌..డాక్టర్లు చేయలేని పని చాట్‌జీపీటీ చేసింది..కుక్క ప్రాణాలు కాపాడి!

Chatgpt-4 Ai Gives Correct Diagnosis For Sick Pet When Vets Failed - Sakshi

డాక్టర్లు చేయలేని పనిని అర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ (ఏఐ) ఆధారిత టూల్‌ చాట్‌జీపీటీ  చేసింది. ప్రాణ ప్రాయ స్థితులో ఉన్న మూగజీవి ప్రాణాలు కాపాడి అందరితో శభాష్ అనిపించుకుంటుంది. 

వివరాలు ఇలా ఉన్నాయి.. ట్విటర్‌ యూజర్‌ కూపర్‌ Cooper (@peakcooper) ఓపెన్‌ఐకి చెందిన చాట్‌జీపీటీ లేటెస్ట్‌ వెర్షన్‌ జీపీటీ-4 ఏఐ తన కుక్క ‘సాసీ’(Sassy) ప్రాణాల్ని కాపాడిందని ట్వీట్‌ చేశారు. 

Tick-borne జబ్బుతో 
కుక్కల్లో పేలు బ్యాక్టీరియా, వైరస్‌, పరాన్నజీవుల ద్వారా Tick-borne అనే జబ్బు చేస్తోంది. ఈ ప్రమాదకరమైన అనారోగ్య సమస్య కారణంగా మూగజీవాల్లో ఆకలి లేకపోవడం, శోషరస గ్రంథులు ఉబ్బడం, కీళ్ల వాపులు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, శరీరంలోని లోపలి భాగాల్లో రక్తస్త్రావం జరుగుతుంది.  కొన్ని సందర్భాలలో మూగజీవాలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. 

నచ్చని వైద్యుల సలహా 
అయితే కూపర్‌ పెంపుడు కుక్క సాసీ Tick-borneతో అనారోగ్యం పాలైంది. అత్యవసర చికిత్స కోసం వెటర్నరీ డాక్టర్లను సంప్రదించాడు. రక్తహీనత ఏర్పడి అనారోగ్యం పాలైనట్లు వైద్యులు నిర్ధారించారు. చికిత్సతో ఆరోగ్యం కుదుట పడింది. కానీ కొన్ని రోజులకు ఆరోగ్యం యధావిధికి  చేరింది. దీంతో చేసేది లేక మరోసారి ఆస్పత్రికి తరలించి టిక్-బోర్న్ పరీక్షలు చేయించాడు. రిపోర్ట్‌ నెగిటీవ్‌ వచ్చింది. కుక్క ఆరోగ్యం విషయంలో ఏం జరుగుతుందో కొన్ని రోజులు వేచి  చూడాలని వైద్యులు సలహా ఇచ్చారు. ఆ సలహా కూపర్‌కు నచ్చలేదు. మరో ఆస్పత్రికి తీసుకెళ్లాడు. 

చాట్‌జీపీటీ-4 సాయంతో 
అదే సమయంలో టెక్నాలజీ రంగంలో సంచలనంగా మారిన చాట్‍ జీపీటీని ఆశ్రయించాడు. తన కుక్క సాసీ అనారోగ్య సమస్యను చాట్‌జీపీటీ-4కి వివరించాడు. అందుకు జీపీటీ తాను వెటర్నరీ డాక్టర్‌ను కాదంటూనే..కుక్కకి తీసిన బ్లడ్‌ శాంపిల్స్‌తో మీ కుక్క ఎందుకు అనారోగ్యం పాలైందోనని అర్థం చేసుకోవడంలో సహాయం చేస్తానని తెలిపింది. 

సాసీ అనారోగ్యానికి కారణం ఇదే
వెంటనే కుక్క ఎందుకు అనారోగ్యం పాలైందో తెలుపుతూ జబ్బులకు సంబంధించిన లక్షణాల గురించి చాట్‌జీపీటీ-4 ఓ డేటాను అందించింది. చాట్‌జీపీటీ చెప్పిన అనారోగ్య సమస్యలు సాసీలో ఉన్నాయని బదులివ్వడంతో..మీ కుక్క ఇమ్యూన్-మెడియేటెడ్ హెమోలిటిక్ అనీమియా (IMHA) అనే సమస్యతో బాధపడుతుందని సూచించింది. 
 
చాట్‌జీపీటీ-4 చెప్పింది.. వైద్య చరిత్రలో ఇదో అద్భుత ఘట్టం!
దీంతో రెండో సారి ఆశ్రయించిన వైద్యులతో సాసీకి ఐఎంహెచ్‌ఏ సమస్య ఏమైనా ఉందా? అని కూపర్‌ ప్రశ్నించాడు. అదే అనుమానాన్ని రక్తపరీక్ష చేసిన వైద్యులు నిజం చేశారు. కుక్క ఐఎంహెచ్‌ఏ సమస్య తలెత్తిందని.. కాబట్టే ఆరోగ్యం క్షీణించిందని నిర్ధారించారు. ప్రస్తుతం సాసీ ఆరోగ్యం కుదుట పడిందంటూ చాట్‌జీపీటీతో చేసిన సంభాషణ స్క్రీన్‌ షాట్‌లను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఆ స్క్రీన్‌ షాట్‌లు వైరల్‌ అవుతున్నాయి.  

ఆశ్చర్యంలో 9 మిలియన్ల మంది యూజర్లు
కూపర్ ట్విట్‌లను 9 మిలియన్ల మంది యూజర్లు వీక్షించారు. పెంపుడు జంతువు యజమానికి చాట్‌జీపీటీ-4 ఎలా సహాయం చేసిందో తెలుసుకొని చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి👉 వాళ్ల ఉద్యోగాలు ఊడడం ఖాయం.. చాట్ జీపీటీ సృష్టికర్త సంచలన వ్యాఖ్యలు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top