
బిహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కోసం ఆమోదయోగ్యమైన గుర్తింపు పత్రాల నుంచి ఆధార్‌ను మినహాయించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) సీఈఓ భువనేష్ కుమార్ స్పష్టతనిచ్చారు. ఆధార్ పౌరుల తొలి గుర్తింపు కాదని చెప్పారు. ప్రభుత్వ సర్వీసులు సులువుగా పొందేందుకు వీలుగా దీన్ని రూపొందించినట్లు తెలిపారు.
ఓ మీడియా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడిన కుమార్ నకిలీ ఆధార్ కార్డులను తనిఖీ చేసి వాటిని గుర్తించేందుకు యూఐడీఏఐ చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. ఆధార్ కార్డులకు క్యూఆర్ కోడ్ ద్వారా ఇంటర్నల్ భద్రతా యంత్రాంగం ఉందని పేర్కొన్నారు. జారీ చేసిన అన్ని కొత్త ఆధార్ కార్డులపై క్యూఆర్ కోడ్ ఉందని, యూఐడీఏఐ అభివృద్ధి చేసిన ఆధార్ క్యూఆర్ స్కానర్ యాప్ త్వరలో అందుబాటులో ఉంటుందన్నారు. ఈ యాప్ ద్వారా ఆధార్ కార్డులోని వివరాలను క్యూఆర్ కోడ్‌లో పొందుపరిచిన వాటితో సరిపోల్చుకోవచ్చని చెప్పారు. ఎవరైనా నకిలీ ఆధార్ కార్డు చూపిస్తే దీని ద్వారా సులభంగా చెక్ చేయవచ్చని తెలిపారు.
ఫొటోషాప్ లేదా ప్రింటెడ్ టెంప్లెట్లను ఉపయోగించి ప్రజలు నకిలీగా ఆధార్ కార్డులను సృష్టిస్తున్న సందర్భాలున్నాయని కుమార్ వివరించారు. కొత్త ఆధార్ యాప్ అభివృద్ధి చివరి దశలో ఉందని వెల్లడించారు. ‘ఇప్పటికే ఈ యాప్‌కు డెమో నిర్వహించారు. ఇది పురోగతిలో ఉంది. అంతర్గతంగా దాన్ని చెక్ చేస్తున్నారు. ఈ యాప్ ప్రాథమికంగా ఆధార్ నంబర్ హోల్డర్ సమ్మతితో డిజిటల్ పద్ధతిలో ఐడెంటిటీని పంచుకోవడానికి అనుమతిస్తుంది. ఈ కొత్త యాప్ ద్వారా ప్రజలు తమ ఆధార్ కార్డుల ఫిజికల్ కాపీలను షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇందులో మాస్క్డ్ వెర్షన్ కూడా ఉంటుంది’ అన్నారు.
ఇదీ చదవండి: అంతా ఫేక్.. నమ్మొద్దు!
జూన్ 24న ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం జులై 25 నాటికి బిహార్‌లో దాదాపు 8 కోట్ల మంది ఓటర్లలో అనర్హుల పేర్లను తొలగించి, అర్హులైన పౌరుల జాబితానే సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల వరకు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిలిపేయాలని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) నేత తేజస్వి యాదవ్ ఎన్నికల సంఘాన్ని కోరారు. రాష్ట్రం అంతటా విస్తృతంగా ఉన్న ఆధార్, ఎంఎన్ఆర్ఈజీఏ జాబ్ కార్డులను గుర్తింపు రుజువుగా అంగీకరించకపోవడం వల్ల ఓటర్లు అసౌకర్యానికి గురవుతున్నారని రాష్ట్ర అసెంబ్లీలో ఆయన తెలిపారు.