
టారిఫ్ ప్రభావిత రంగాలకు సాయంపై కేంద్రం దృష్టి
రుణాలపై మారటోరియం
ఎగుమతులకు ప్రోత్సాహకాలు
న్యూఢిల్లీ: భారత ఉత్పత్తులపై అమెరికా 50 శాతం టారిఫ్‌లు విధించడంతో దేశీ ఎగుమతిదారులకు మద్దతుగా నిలించేందుకు కేంద్రం కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. రుణాలపై మారటోరియం (చెల్లింపులపై తాత్కాలిక విరామం), ఎగుమతి ప్రోత్సాహకాలను అందించడంపై దృష్టి సారించినట్టు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. తమకు తక్కువ రేట్లపై రుణసాయం అందించాలని ఎగుమతిదారులు ఎప్పటి నుంచో కోరుతుండగా, వారి డిమాండ్లను పరిశీలిస్తున్నట్టు చెప్పా రు.
ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం గుర్తించిందంటూ.. ఈ దిశగా సానుకూల నిర్ణయాలు వెలువడనున్నట్టు ఆ అధికారి చెప్పారు. ఎగుమతులను వైవిధ్యం చేసుకోవడం, మరిన్ని దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, ఆర్థిక పరమైన మద్దతు చర్యలకుతోడు దేశీ మార్కెట్ విస్తరణ ద్వారా యూఎస్ టారిఫ్‌ల ప్రభావం అధిగమించేలా చూడనున్నట్టు వివరించారు.
ముఖ్యంగా అమెరికా టారిఫ్‌ల ప్రభావం ఎక్కువగా ఉండే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్‌ఎంఈ)ల ఉద్యోగులకు ప్రత్యక్ష నగదు సాయాన్ని సైతం పరిశీలిస్తున్నట్టు సమాచారం. ‘ప్రోత్సాహకాలను ఎలా అందించాలన్నది పరిశీలించాల్సి ఉంది. ఇందుకు ఎంత మొత్తం కేటాయించాలి. రుణ హామీ, తనఖా లేని రుణ పరిమితి పెంపును తొలుత ప్రకటించొచ్చు’ అని ఆ అధికారి తెలిపారు. 2025–26 బడ్జెట్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూ.25,000 కోట్లను ఎగుమతి ప్రోత్సాహకాల కింద ప్రకటించింది.
రాయితీ రుణాలు..
రుణాలపై వడ్డీ రాయితీని తిరిగి ఐదేళ్ల కాలానికి తీసుకురావాలని ఎగుమతిదారులు కోరుతుండడం గమనార్హం. మూలధన అవసరాలకు వీలుగా రుణాల లభ్యతను పెంచడం, ఏడాది పాటు రుణాల అసలు, వడ్డీ చెల్లింపులపై మారటోరియం తదితర సాయాన్ని అందించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సూచనలను ప్రభుత్వం పరిశీలిస్తోందని, టారిఫ్‌ల కారణంగా ఏర్పడే నష్టం తాత్కాలికమేనని ప్రభుత్వ అధికారి పేర్కొన్నారు.
ముఖ్యంగా అమెరికా ఎగుమతులపై ఎక్కువగా ఆధారపడిన రొయ్యలు, టెక్స్‌టైల్స్, తోలు, రత్నాభరణాల పరిశ్రమల నుంచి ఎక్కువ ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర వాణిజ్య శాఖ ఎగుమతిదారులతో సమావేశాలు నిర్వహిస్తూ, తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 4 నెలల్లో అమెరికాకు భారత్ నుంచి ఎగుమతులు 21 శాతం పెరిగి 33.53 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
2024–25లో ఎగుమతులు 86.5 బిలిన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో భారత్ మొత్తం వస్తు ఎగుమతులు 437 బిలియన్ డాలర్లలో 20% అమెరికాకే వెళ్లాయి. మరోవైపు సవాళ్లతో కూడిన ఈ తరుణంలో ఎగుమతిదారుల ఆందోళనలను పరిష్కరిస్తామంటూ కేంద్ర ఆర్థిక శాఖ హామీ ఇచి్చనట్టు భారతీయ ఎగుమతిదారుల సమాఖ్య (ఎఫ్‌ఐఈవో) ప్రకటించింది.