
మారుతీ చైర్మన్ ఆర్‌సీ భార్గవ పిలుపు
న్యూఢిల్లీ: అమెరికా టారిఫ్‌ల బెదిరింపులకు భారత్ తలొగ్గరాదని ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్‌సీ భార్గవ చెప్పారు. ఇలాంటి వాటికి ప్రజలంతా ఐక్యంగా ఎదురు నిలవాలని, దేశ గౌరవాన్ని కాపాడుకోవాలని ఆయన పేర్కొన్నారు. కంపెనీ 44వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా భార్గవ ఈ విషయాలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దౌత్యపరమైన అంశాల్లో తొలిసారిగా టారిఫ్‌లను ప్రయోగించడం ద్వారా సంప్రదాయ విధానాలు, సంబంధాల విషయంలో దేశాలను పునరాలోచనలో పడేశారన్నారు.
ఇలాంటి తరుణంలో ప్రభుత్వానికి మద్దతుగా నిల్చి, దేశ పరువు ప్రతిష్టలను కాపాడుకోవాల్సిన బాధ్యత భారతీయులపై ఉందని భార్గవ తెలిపారు. అమెరికా మార్కెట్లో మన ఉత్పత్తులకు డిమాండ్ పడిపోయేలా, ట్రంప్ సర్కారు భారత ఎగుమతులపై సుంకాలను ఏకంగా 50 శాతానికి పెంచేసిన సంగతి తెలిసిందే. మరోవైపు, దేశీయంగా వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) విధానంలో సంస్కరణలు వేగవంతమైన వృద్ధికి, ఉద్యోగాల కల్పనకి దోహదపడుతుందని భార్గవ తెలిపారు. సంస్కరణలతో చిన్న కార్లపై జీఎస్‌టీ 18%కి తగ్గుతుందని ఆశిస్తున్నామని, అయితే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇదే జరిగితే చిన్న కార్ల మార్కెట్ మళ్లీ పుంజుకోగలదని భార్గవ చెప్పారు.
స్కూటర్లకు ప్రత్యామ్నాయంగా చిన్న కార్లు..
దేశ జనాభాలో సింహభాగం ప్రజలు వ్యక్తిగత అవసరాల కోసం అత్యంత రిసు్కలతో కూడుకున్న ద్విచక్ర వాహనాలపైనే ఆధారపడుతుంటారని భార్గవ చెప్పారు. ఈ నేపథ్యంలో స్కూటర్లకు ప్రత్యామ్నాయంగా ఉండే చిన్న కార్లను ప్రవేశపెట్టే అవకాశాన్ని పరిశీలించాలన్నారు. 1950లలో ’కీయి’ కార్లను ప్రవేశపెట్టడం ద్వారా జపాన్ ఇలాంటి సమస్యను పరిష్కరించిందని తెలిపారు.