ఇథనాల్ స్టవ్ ఎలా పనిచేస్తుంది! | Can Ethanol Mixed in Water Burn as Nitin Gadkari Claims | Sakshi
Sakshi News home page

ఇథనాల్ స్టవ్ ఎలా పనిచేస్తుంది!

May 28 2026 6:23 PM | Updated on May 28 2026 6:42 PM

Can Ethanol Mixed in Water Burn as Nitin Gadkari Claims

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ఇథనాల్ ఆధారిత స్టవ్ టెక్నాలజీ గురించి చేసిన ప్రకటన.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నీటిలో 7 శాతం ఇథనాల్ కలిపితే.. వంటగ్యాస్‌లా మంట వస్తుందని, ఇది ఎల్‌పీజీ కంటే తక్కువ ఖర్చుతో ఉపయోగించవచ్చని ఆయన తెలిపారు. ఇది భవిష్యత్తులో వంటగ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా మారుతుందా?, ఇథనాల్ నిజంగా ఎల్‌పీజీ స్థానాన్ని భర్తీ చేయగలదా? అనే సందేహాలు తలెత్తాయి.

ఇథనాల్ అనేది మండే స్వభావం కలిగిన ఒక ఆల్కహాల్. దీనిని ఇప్పటికే ఆటోమొబైల్స్‌లో బయోఫ్యూయల్‌గా కూడా ఉపయోగిస్తున్నారు. ఇది ద్రవరూపంలో ఉంటుంది. కాబట్టి గాలిలో ఆక్సిజన్‌తో కలిసినప్పుడు, సరైన ఉష్ణోగ్రత వద్ద మంట వస్తుంది. అయితే.. ఇథనాల్ మండటానికి దాని సాంద్రత చాలా ముఖ్యమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

'జర్నల్ ఆఫ్ లాస్ ప్రివెన్షన్ ఇన్ ది ప్రాసెస్ ఇండస్ట్రీస్'లో ప్రచురించిన అధ్యయనాల ప్రకారం.. నీటిలో ఇథనాల్ శాతం చాలా తక్కువగా ఉంటే.. మంట నిలకడగా ఉండదు. నీరు ఎక్కువగా ఉండటం వల్ల ఇథనాల్ ఆవిరి త్వరగా ఏర్పడదు. అందుకే బీర్ వంటి ఆల్కహాల్ పానీయాలు సులభంగా మండవు. కానీ వాణిజ్యపరంగా ఉపయోగించే ఇథనాల్ స్టవ్‌లో 70 నుంచి 90 శాతం వరకు అధిక సాంద్రత కలిగిన ఇథనాల్‌ను ఉపయోగిస్తారు. అప్పుడు మాత్రమే ఎల్‌పీజీ మాదిరిగా మంట వస్తుంది.

స్వచ్ఛమైన ఇథనాల్ తక్కువ ఉష్ణోగ్రత వద్ద కూడా మండే లక్షణం కలిగి ఉంటుంది. కానీ.. అందులో నీటి శాతం పెరిగేకొద్దీ మంట తగ్గిపోతుంది కష్టమవుతుంది. ఎందుకంటే నీరు వేడిని గ్రహించి, ఇథనాల్ ఆవిరి ఒత్తిడిని తగ్గిస్తుంది. కాబట్టి సరైన నిష్పత్తి, ప్రత్యేక బర్నర్ టెక్నాలజీ ఉంటే మాత్రమే ఈ విధానం సమర్థవంతంగా పనిచేస్తుంది.

లేటెస్ట్ ఇథనాల్ స్టవ్‌లో ప్రెషరైజ్డ్ బర్నర్లు, ఫ్యూయల్ కార్ట్రిడ్జ్‌లు, ప్రీ-హీటింగ్ సిస్టమ్‌లు వంటి సాంకేతికతను ఉపయోగిస్తారు. ఇవి ఇంధనాన్ని వేగంగా ఆవిరి చేసి స్థిరమైన మంటను అందిస్తాయి. అందువల్ల వంట సులభంగా పూర్తవుతుంది.

భారతదేశంలో చెరకు, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా ఇథనాల్ ఉత్పత్తి పెరుగుతోంది. ఇప్పటికే పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. కాబట్టి భవిష్యత్తులో వంట కోసం కూడా దేశీయంగా తయారయ్యే ఇథనాల్‌ను ఉపయోగిస్తే ఎల్‌పీజీ దిగుమతులపై ఆధారపడటం తగ్గే అవకాశం ఉంది. అయితే భద్రతా ప్రమాణాలు చాలా ముఖ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఇథనాల్ మంట పగటి వేళల్లో స్పష్టంగా కనిపించకపోవచ్చు. అలాగే సరైన నిష్పత్తిలో ఇంధనం లేకపోతే మంట సరిగా రాకపోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement