లాభాలతో కూడిన వృద్ధికే ప్రాధాన్యం

Byju's Ceo Says Focus On Profitable Growth - Sakshi

న్యూఢిల్లీ: ఇంతకాలం కేవలం వృద్ధిపైనే దృష్టి పెట్టిన విద్యారంగ స్టార్టప్‌ బైజూస్‌ తన విధానాన్ని మార్చుకుంది. దేశంలో అత్యంత విలువైన స్టార్టప్‌ బైజూస్, లాభాల ఆధారిత వృద్ధిపైకి తన దృష్టిని మళ్లించినట్టు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో రవీంద్రన్‌ ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. 2020–21 ఆర్థిక సంవత్సరానికి బైజూస్‌ రూ.4,564 కోట్ల భారీ నష్టాలను ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడం తెలిసిందే. ఈ క్రమంలో బైజూస్‌ ఉద్యోగులకు సీఈవో లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

గత ఐదు నెలలుగా ప్రతి నెలా రూ.1,000కోట్లకు పైగా టర్నోవర్‌ నమోదు చేస్తున్నామని, కే12 విభాగంలో మన తర్వాతి రెండు స్థానాల్లో ఉన్న పోటీ సంస్థల టర్నోవర్‌ కంటే ఇది 20 రెట్లు అధికమని చెప్పారు. ‘‘2022–23 ఆ తర్వాతి నుంచి వృద్ధికి, నిలదొక్కుకునే సామర్థ్యాలను జోడిస్తాం. వనరులను మరింత సమర్థవంతంగా వినియోగిస్తాం’’అని రవీంద్రన్‌ ప్రకటించారు. 2020–21 ఆర్థిక సంవత్సరానికి బైజూస్‌ ఆదాయం 3.3 శాతం క్షీణించి రూ.2,428 కోట్లుగా ఉండడం గమనార్హం. 2020–21 ఆడిటింగ్‌ చాలా ఆలస్యమైనట్టు రవీంద్రన్‌ చెప్పారు. దీనిపై అనేక నిరాధార ప్రచారాలు వ్యాప్తిలోకి వచ్చినట్టు పేర్కొన్నారు. కానీ, కంపెనీ వృద్ధి స్థాయికి అనుగుణంగా ఆడిటింగ్‌కు తగిన విధంగా సన్నద్ధం కాకపోవడమే జాప్యానికి కారణమని చెప్పారు.

చదవండి: లక్కీ బాయ్‌.. 5 నిమిషాల వీడియో పంపి, రూ.38 లక్షల రివార్డ్‌ అందుకున్నాడు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top