యూఎస్‌బీ టైప్–సీ చార్జింగ్ పోర్ట్‌కు బీఐఎస్ ప్రమాణాలు

న్యూఢిల్లీ: యూఎస్‌బీ టైప్–సీ చార్జింగ్ పోర్ట్ నాణ్యత ప్రమాణాలను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ప్రకటించింది. మొబైల్స్‌కు, ధరించగలిగే ఎలక్ట్రానిక్స్ కోసం రెండు ఒకే తరహా (కామన్) ఛార్జింగ్ పోర్ట్‌లను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తున్న సంగతి తెలిసిందే. వినియోగదారుల ప్రయోజనాలు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించేందుకు పరిశ్రమ వాటాదారులతో సంప్రదింపులు జరిపిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ కంజ్యూమర్ అఫైర్స్ రెండు రకాల సాధారణ ఛార్జింగ్ పోర్ట్‌లను తప్పనిసరి చేయాలని నిర్ణయించింది.
వీటిలో మొబైల్స్, స్మార్ట్‌ఫోన్స్, టాబ్లెట్ పీసీల కోసం యూఎస్‌బీ టైప్–సీ ఛార్జర్ ఒకటి కాగా, మరొకటి వేరబుల్ ఎలక్ట్రానిక్ పరికరాల కోసం ఇతర సాధారణ ఛార్జర్ ఉన్నాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)–కాన్పూర్ స్మార్ట్ వాచెస్ వంటి ధరించగలిగే ఎలక్ట్రానిక్ పరికరాల కోసం సింగిల్ ఛార్జింగ్ పోర్ట్‌ను అధ్యయనం చేస్తోంది. ఐఐటీ కాన్పూర్ నుంచి నివేదిక వచ్చిన తర్వాత పరిశ్రమతో ఈ విషయమై ప్రభుత్వం చర్చించనుంది.