మా ఐటీ కంపెనీ ఎందుకిలా చేసింది? | bengaluru techie viral post slams mandatory 5day wfo policy | Sakshi
Sakshi News home page

మా ఐటీ కంపెనీ ఎందుకిలా చేసింది?

May 28 2026 12:50 PM | Updated on May 28 2026 2:41 PM

bengaluru techie viral post slams mandatory 5day wfo policy

ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఉద్యోగులను వదిలించుకనేందుకు కంపెనీలు రకరకాల ఎత్తులు వేస్తున్నాయి. బెంగళూరుకు చెందిన ఓ ఐటీ సంస్థ తీసుకున్న “వర్క్ ఫ్రమ్ ఆఫీస్” (WFO) నిర్ణయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సంస్థలో పనిచేస్తున్న ఓ సీనియర్ టెక్కీ, ఐదు రోజుల తప్పనిసరి కార్యాలయ హాజరు విధానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ చేసిన పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. రిమోట్ వర్క్ విధానాన్ని అకస్మాత్తుగా ముగించడం ఉద్యోగుల వ్యక్తిగత జీవితం, ఆర్థిక పరిస్థితులపై భారీ ప్రభావం చూపుతుందని అతడు పేర్కొన్నాడు.

దాదాపు పదేళ్ల అనుభవం కలిగిన ఫుల్-స్టాక్ ఇంజనీర్ అయిన ఆ ఉద్యోగి, కంపెనీ గత కొన్నేళ్లుగా వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అనుమతి ఇవ్వడంతో తాను స్వగ్రామంలోనే స్థిరపడ్డానని వెల్లడించాడు. అయితే ఇటీవల డిసెంబర్ నుంచి ప్రతి ఉద్యోగి వారంలో ఐదు రోజులు కార్యాలయానికి హాజరుకావాలని యాజమాన్యం ఆదేశించిందని తెలిపాడు.

రిమోట్ విధానంలో పనిచేసినా ప్రాజెక్టుల డెలివరీ, జట్టు సమన్వయం, పనితీరు ఎక్కడా దెబ్బతినలేదని అతడు వివరించాడు. అయినప్పటికీ “టీమ్ కొలాబరేషన్” పేరుతో కార్యాలయానికి రావాలని ఒత్తిడి తెస్తుండటం అసలు అవసరమా అనే ప్రశ్నను లేవనెత్తాడు.

అమ్మో మళ్లీ బెంగళూరుకా?
కోవిడ్‌కు ముందు బెంగళూరులో నివసించిన అనుభవాన్ని గుర్తు చేసుకున్న టెక్కీ, అక్కడి ట్రాఫిక్, అధిక అద్దెలు, గంటల కొద్దీ ప్రయాణాలు, పెరిగిన జీవన వ్యయాలు మళ్లీ అదే పరిస్థితుల్లోకి వెళ్లాలనే ఆలోచనకే నిరాశ కలిగిస్తున్నాయని పేర్కొన్నాడు. మంచి జీతం ఉన్నప్పటికీ నగర జీవితం, అధిక వ్యయాల కారణంగా సేవింగ్స్‌ అనేవి దాదాపు లేకుండా పోతాయని ఆందోళన వ్యక్తం చేశాడు.

ఇంటినుంచే ప్రశాంతంగా, సమర్థవంతంగా పని చేసే వాతావరణాన్ని తాను ఏర్పరుచుకున్నానని, అనవసర సమావేశాలు, ఫార్మాలిటీ చర్చలు లేకుండా పని మరింత ఫోకస్‌తో సాగుతుందని తెలిపాడు. పూర్తిగా డిజిటల్ విధానంలో నడిచే ఉద్యోగానికి కార్యాలయ హాజరు తప్పనిసరి చేయడం వెనుక అసలు ఉద్దేశం ఉత్పాదకత కాదని, ఉద్యోగులపై నియంత్రణ సాధించడమేనన్న అభిప్రాయం వ్యక్తం చేశాడు.

శాశ్వతంగా ఇంటికి పంపేందుకే..
ఈ పోస్టుపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. కొన్ని సంస్థలు ప్రత్యక్షంగా ఉద్యోగులను తొలగించకుండా, ఇలాంటి కఠిన WFO విధానాల ద్వారా ఉద్యోగులే స్వయంగా రాజీనామా చేసే పరిస్థితి సృష్టిస్తున్నాయని వ్యాఖ్యానించారు. మరికొందరు బెంగళూరులో ట్రాఫిక్, జీవన వ్యయాలు ఉద్యోగుల మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతున్నాయని అభిప్రాయపడ్డారు.

“ఉదయం గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన తర్వాత ఉద్యోగి కార్యాలయంలో ఉత్సాహంగా పనిచేయగలడా?” అంటూ ఒక నెటిజన్ చేసిన వ్యాఖ్య కూడా విస్తృతంగా చర్చకు దారితీసింది.

కోవిడ్ తర్వాత ఐటీ రంగంలో వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతి బలపడగా, ఇప్పుడు అనేక కంపెనీలు మళ్లీ కార్యాలయ హాజరుపై దృష్టి పెట్టడం ఉద్యోగుల్లో అసంతృప్తికి కారణమవుతోంది. ఈ పరిణామం భవిష్యత్తులో ఐటీ రంగ ఉద్యోగ విధానాలపై మరింత చర్చకు దారి తీసే అవకాశముంది.

Mandatory 5-Day Office Feels Like a Massive Step Back
by u/web_dev__ in developersIndia

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement