
భారత సిలికాన్ వేలీగా పేరొందిన బెంగళూరులో టెకీ సిబ్బంది సంఖ్య 10 లక్షల మార్కును దాటింది. తద్వారా అంతర్జాతీయంగా 12 టెక్నాలజీ హబ్‌లలో ఒకటిగా నిలిచింది. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్‌ఈ విడుదల చేసిన గ్లోబల్ టెక్ టాలెంట్ గైడ్‌బుక్ 2025’లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం నిపుణుల లభ్యత, నాణ్యత, వ్యయాల ప్రాతిపదికన 115 మార్కెట్లను మదింపు చేసి మూడు కేటగిరీలుగా వర్గీకరించారు.
అత్యధిక స్థాయిలో నిపుణుల లభ్యత, తీవ్రమైన పోటీ ఉన్న మార్కెట్లను పవర్‌హౌస్‌లుగా, ప్రతిభావంతుల లభ్యత నిలకడగా ఉండే మార్కెట్లను ఎస్టాబ్లిష్డ్ మార్కెట్లుగా, సామర్థ్యాలను మెరుగుపర్చుకుంటూ వృద్ధి చెందుతున్న మార్కెట్లను వర్ధమాన మార్కెట్లుగా వర్గీకరించారు. 12 టెక్ పవర్‌హౌస్‌లలో బీజింగ్, బోస్టన్, లండన్, న్యూయార్క్, ప్యారిస్ తదితర నగరాల సరసన బెంగళూరు కూడా నిల్చింది.
ఆసియా పసిఫిక్ ప్రాంతంలో బీజింగ్, షాంఘైతో పాటు బెంగళూరులో అత్యధికంగా టెక్నాలజీ నిపుణులు ఉన్నారని, టెక్ సిబ్బంది సంఖ్య 10 లక్షల పైగా ఉందని నివేదిక పేర్కొంది. గ్లోబల్ టెక్ పవర్‌హౌస్‌గా బెంగళూరు ఎదగడమనేది భారత్‌లో డిజిటల్ ఆవిష్కరణలు, కృత్రిమ మేథకు సంబంధించి లోతైన పరిజ్ఞానాన్ని తెలియజేస్తోందని వివరించింది.
ఇదీ చదవండి: అప్పుడు రూ. 3500కోట్ల వ్యాపార సామ్రాజ్యం: ఇప్పుడు 20ఏళ్ల జైలు జీవితం
ఉద్యోగం చేసే వయస్సు గల జనాభాపరంగా 12 భారీ మార్కెట్లలో బెంగళూరు నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. 28 యూనికార్న్‌లు (1 బిలియన్ డాలర్ల పైగా వేల్యుయేషన్ గల స్టార్టప్‌లు), సానుకూల నిబంధనలు మొదలైనవి నగరానికి సానుకూలాంశాలుగా ఉంటున్నాయి. 2024లో 3.3 బిలియన్ డాలర్లు విలువ చేసే 140 వెంచర్ క్యాపిటలిస్ట్ డీల్స్‌కి బెంగళూరు కేంద్రంగా నిల్చింది. వీటిలో 34 డీల్స్ కృత్రిమ మేథకు సంబంధించినవి ఉన్నాయి.