
కృషి, పట్టుదలతో సాధించిన విజయాలు ఎందరికో మార్గదర్శకం అవుతాయి. మరికొన్ని సంఘటనలు ఊహకందని మలుపులు తిరుగుతూ అదఃపాతాళానికి తొక్కేస్తాయి. కారణం ఏదైనా.. కర్త మాత్రం ఫలితాన్ని తప్పకుండా అనుభవించాల్సిందే. ఇలాంటి కోవకు చెందిన ఓ వ్యక్తి గురించి ఈ కథనంలో చూసేద్దాం.
ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి 'సుబ్రమణియన్' ఒక ప్రతిభావంతులైన ఇంజనీర్.. బ్యాంకర్ కూడా. జీరోతో మొదలై వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించిన ఈయన కారాగారంలో ఊచలు లెక్కపెట్టాల్సి వచ్చింది. 1991లో విశ్వప్రియ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీని స్థాపించిన ఈయన.. లాభాలను గడించారు.
రూ. 137 కోట్ల పెట్టుబడి
సుబ్రమణియన్ ప్రారంభించిన విశ్వప్రియ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫైనాన్షియల్ సంస్థ.. ప్రైమ్ ఇన్వెస్ట్, అసెట్ బ్యాక్డ్ సెక్యూరిటీ బాండ్, లిక్విడ్ ప్లస్, సేఫ్టీ ప్లస్ వంటి పథకాలను ప్రసిద్ధి చెందింది. ఈ పథకాలన్నీ ఇతర బ్యాంక్ డిపాజిట్లు లేదా పెట్టుబడి ఎంపికల కంటే గణనీయంగా అధిక రాబడికి హామీ ఇచ్చాయి. వీటన్నింటికీ ఆకర్షితులైన.. సుమారు 587 మంది పెట్టుబడిదారులు ఏకంగా రూ. 137 కోట్ల పెట్టుబడిగా పెట్టారు. ఇందులో ఎక్కువగా మధ్యతరగతి వ్యక్తులు, చిన్న వ్యాపార యజమానులు, పదవీ విరమణ చేసినవారే ఉన్నారు.
సుభిక్షకు మద్దతు
విశ్వప్రియ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫైనాన్షియల్ సంస్థను ప్రారంభించిన తరువాత 1997లో 'సుభిక్ష' అనే రిటైల్ సంస్థను సుబ్రమణియన్ స్టార్ట్ చేశారు. ఇది భారతదేశంలో ఏకంగా 1600 కంటే ఎక్కువ అవుట్‌లెట్‌లకు విస్తరించింది. కంపెనీ విలువ రూ. 3,500 కోట్లకు చేరుకుంది. అజీమ్ ప్రేమ్‌జీ, ఐసిఐసిఐ వెంచర్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి హై-ప్రొఫైల్ పెట్టుబడిదారులు కూడా సుభిక్షకు మద్దతు ఇచ్చారు.
ఇదీ చదవండి: 'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకి
అన్నీ సవ్యంగా సాగుతున్నాయనుకుంటున్న సమయంలో.. పెట్టుబడిదారుల నిధులను సుబ్రమణియన్ షెల్ కంపెనీలకు మళ్లించారు. ఇదే ఈయన జీవితాన్ని మలుపుతిప్పి కష్టాల సుడిగుండంలోకి తీసుకెళ్లింది. 2008లో సుబ్రమణియన్ తీవ్రమైన ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి చేరుకున్నారు. దీంతో పెట్టుబడిదారులకు కూడా రిటర్న్స్ ఇవ్వలేకపోయాడు. దీంతో వారంతా కోర్టును ఆశ్రయించారు. 2009లో సుభిక్ష క్లోజ్ అయింది. దీంతో సుబ్రమణియన్ విశ్వసనీయత కుప్పకూలింది.
20 సంవత్సరాల జైలు శిక్ష
10 సంవత్సరాలుగా స్వచ్ఛంద డిపాజిట్లు చేయడంలో విఫలమయ్యారని, అన్ని కార్యక్రమాలలో డిపాజిటర్లకు చెల్లించాల్సిన రూ.137 కోట్లకు పైగా చెల్లింపులు చేయలేకపోయారని తెలిసింది. దీంతో నవంబర్ 2023లో, తమిళనాడులోని చెన్నైలోని ఒక ప్రత్యేక కోర్టు వందలాది మంది పెట్టుబడిదారులను మోసం చేసినందుకు 'సుబ్రమణియన్'ను దోషిగా నిర్ధారించి.. అతనికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.