
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ డిజిటల్ పేమెంట్స్ ఎక్కువవుతున్నాయి. ఒకప్పటిలాగా పర్సుల్లో క్యాష్ ఉంచుకోవడం గణనీయంగా తగ్గిపోయింది. అయితే చిరువ్యాపారుల పట్ల ఈ డిజిటల్ లావాదేవీలు శాపంగా మారుతున్నాయి. ప్రతి ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ ప్రభుత్వ వ్యవస్థల్లో రికార్డు అవుతుండడంతో రోజువారీ లావాదేవీలను పరిగణలోకి తీసుకుని చిరువ్యాపారులకు జీఎస్టీ నోటీసులు అందుతున్నాయి. గతంలో ఫిజికల్ క్యాష్ ద్వారా వస్తు మార్పిడి జరిగేదికాస్తా డిజిటల్ పేమెంట్స్ పుణ్యమా అని వారి చేతిలో జీఎస్టీ నోటీసులు దర్శనమిస్తున్నాయి. దాంతో చేసేదీమీ లేక యూపీఐ చెల్లింపులకు నో చెబుతూ.. కస్టమర్లను క్యాష్ ఇమ్మంటున్నారు.
బెంగళూరులో ఈమేరకు చాలా మంది వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులకు ఇటీవల జీఎస్టీ నోటీసులు అందాయి. దాంతో యూపీఐ క్యూఆర్ స్కానర్లు పక్కన పడేసి, క్యాష్ ఇవ్వాలని కస్టమర్లను కోరుతున్నారు. చాలా షాపుల ముందు ‘నో యూపీఐ.. ఓన్లీ క్యాష్’ అనే బోర్డులు వెలుస్తున్నాయి. ‘రోజుకు సుమారు రూ.3,000 వ్యాపారం చేసి వచ్చే కొద్దిపాటి లాభంతో జీవిస్తున్నాను. నేను ఇకపై యూపీఐ చెల్లింపును అంగీకరించలేను’ అని హోరమావులోని ఓ దుకాణదారుడు తెలిపాడు.
స్ట్రీట్ ఫుడ్ దుకాణాలు, తోపుడు బండ్లు, కార్నర్ షాపులు సహా అధికారికంగా నమోదు కాని వేలాది చిన్న వ్యాపారాలకు జీఎస్టీ నోటీసులు అందాయని వ్యాపారులు, న్యాయవాదులు, అకౌంటెంట్లు చెబుతున్నారు. కొందరికి రూ.లక్షల్లో డిమాండ్లు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా ఫెడరేషన్ ఆఫ్ బెంగళూరు స్ట్రీట్ వెండర్స్ అసోసియేషన్స్ సంయుక్త కార్యదర్శి న్యాయవాది వినయ్ కె.శ్రీనివాస మాట్లాడుతూ..‘చాలా మంది విక్రేతలు జీఎస్టీ అధికారుల వేధింపులు, పౌర అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుందని భయపడుతున్నారు. దాంతో చాలామంది ఇప్పటికే కస్టమర్ల నుంచి నగదు కోరుతున్నారు’ అని చెప్పారు. ప్రస్తుత జీఎస్టీ ఫ్రేమ్‌వర్క్ ప్రకారం వస్తువులను సరఫరా చేసే వ్యాపారులు తమ వార్షిక టర్నోవర్ రూ.40 లక్షలు దాటితే జీఎస్టీ చెల్లించాలి. సర్వీస్ ప్రొవైడర్లకు పరిమితి రూ.20 లక్షలుగా ఉంది.
ఇదీ చదవండి: క్రెడిట్ కార్డే దిక్కు!
ఈ వ్యవహారంపై వాణిజ్య పన్నుల శాఖ స్పందిస్తూ 2021-22 నుంచి యూపీఐ లావాదేవీల డేటా జీఎస్టీ రిజిస్ట్రేషన్ అవసరమయ్యే టర్నోవర్ స్థాయులను చేరిన వారికే నోటీసులు జారీ చేసినట్లు పేర్కొంది. అటువంటి వ్యాపారులు వెంటనే వివరాలు నమోదు చేసుకోవాలని, పన్ను పరిధిలోకి వచ్చే టర్నోవర్‌ను వెల్లడించాలని తెలిపింది. ఇదిలాఉండగా, జీఎస్టీ అధికారులు యాదృచ్ఛిక గణాంకాలను టర్నోవర్‌గా పేర్కొనలేరని కర్ణాటక వాణిజ్య పన్నుల మాజీ అదనపు కమిషనర్ హెచ్‌డీ అరుణ్ కుమార్ అన్నారు.