వికసిత్‌ భారత్‌కు బ్యాంకింగ్‌ దన్ను | Banking Sector Will Play Major Role in India Viksit Bharat Vision | Sakshi
Sakshi News home page

వికసిత్‌ భారత్‌కు బ్యాంకింగ్‌ దన్ను

May 28 2026 3:12 AM | Updated on May 28 2026 3:12 AM

Banking Sector Will Play Major Role in India Viksit Bharat Vision

మూలధన సమీకరణ, ఇన్‌ఫ్రా అభివృద్ధికి కీలకం

ఎస్‌బీఐ చైర్మన్‌ శెట్టి వెల్లడి 

టెక్నాలజీ, ఏఐపై మరింతగా పెట్టుబడులు 

న్యూఢిల్లీ: వికసిత్‌ భారత్‌ లక్ష్య సాకారంలో బ్యాంకింగ్‌ రంగం కీలకపాత్ర పోషిస్తుందని ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) చైర్మన్‌ సీఎస్‌ శెట్టి తెలిపారు. మూలధన సమీకరణ, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో బ్యాంకింగ్‌ ప్రధానంగా ఉంటోందన్నారు. వార్షిక నివేదికలో షేర్‌హోల్డర్లకు ఇచ్చిన సందేశంలో ఆయన ఈ విషయాలు పేర్కొన్నారు. ‘‘దేశంలోనే అతి పెద్ద బ్యాంకు కావడం వల్ల మాకు అవకాశాలూ, బాధ్యత.. రెండూ ఉంటాయి.

 ఈ విషయాన్ని గుర్తెరిగి, భారత్‌ వృద్ధి ఆకాంక్షలు సాకారం కావడానికి అవసరమైన తోడ్పాటు అందించేందుకు మేము కట్టుబడి ఉన్నాం’’ అని తెలిపారు. డిజిటల్‌ మాధ్యమం, కస్టమర్ల ప్రయోజనాలకు ప్రాధాన్యతనిచ్చేలా ‘డిజిటల్‌ ఫస్ట్, కస్టమర్‌ ఫస్ట్‌’ విధానాలను మరింత పటిష్టంగా అమలు చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో బ్యాంకింగ్‌ సేవలను బలోపేతం చేసేలా టెక్నాలజీ, డేటా అనలిటిక్స్, కృత్రిమ మేథ, సైబర్‌సెక్యూరిటీ, డిజిటల్‌ ఇన్‌ఫ్రాపై పెట్టుబడులను కొనసాగిస్తామని శెట్టి చెప్పారు.

కొత్త ఆవిష్కరణలపై ఫోకస్‌.. 
కొత్త ఆవిష్కరణలకు తెరతీస్తూ, నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపర్చుకుంటూ, మరింత నాణ్యమైన సేవలు అందించేలా వివిధ ప్రక్రియలను సరళతరం చేయడంపై దృష్టి పెడుతున్నట్లు శెట్టి తెలిపారు. ఇందుకు ప్రాజెక్ట్‌ సరళ్‌ కింద ఆటోమేషన్, కృత్రిమ మేథ (ఏఐ)ని మరింత వినియోగించుకోనున్నట్లు వివరించారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement