గోధుమల ఎగుమతుల బ్యాన్‌: ఫుడ్‌ ఎమర్జెన్సీ నుంచి ఇండియా ఎలా బైటపడిందో తెలుసా?

Ban on Wheat exports check How India overcame food emergency - Sakshi

1964-69 మధ్య పీఎల్‌-480 పేరుతో అమెరికా నుంచి గోధుమలు సాయంగా పొందిన ఇండియా

ఇప్పుడు బియ్యం, గోధుమలు ఎగుమతిచేసే దేశం!

దేశంలో ఆహార భద్రతకు ముప్పు వాటిల్లకుండా చూసేందుకు భారత ప్రభుత్వం కిందటేడాది గోధుమల ఎగుమతిపై నిషేధం విధించింది. ఇంకా, బియ్యం ఎగుమతులపై షరతులతో కూడిన ఆంక్షలు అమలుచేస్తోంది. 2022 సెప్టెంబరులో బియ్యం నూకల ఎగుమతి పూర్తి నిషేధంతో పాటు కేంద్ర సర్కారు ఇతర రకాల తెల్ల బియ్యంపై 20 శాతం ఎగుమతి పన్ను విధించింది. గత సంవత్సరం వరి పండించే రాష్ట్రాల్లో తగినంత వర్షపాతం లేకపోవడం, ఇతర సమస్యల కారణంగా దేశంలో బియ్యం ధరలు పెరగకుండా నిరోధించడానికి కేంద్రం ఈ చర్యలు తీసుకుంది. ఈ ఏడాది బియ్యం ఎగుమతులపై నిషేధాన్ని తొలగించే అవకాశం లేదని మొన్న ఫిబ్రవరిలో ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

అలాగే 2023–2024 సంవత్సరంలో దేశంలో గోధుమల ఉత్పత్తి పెరుగుతుందనే అంచనాలు ఉన్నప్పటికీ ఈ ధాన్యం, గోధుమ ఉత్పత్తుల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఈ ఏడాది మార్కెటింగ్‌ సీజన్‌ గడిచే వరకూ ఇండియా తొలగించకపోవచ్చని కూడా అమెరికా వ్యవసాయ శాఖలోని విదేశీ వ్యవసాయ సేవల విభాగం అంచనా వేసింది. ప్రపంచంలో అతిపెద్ద బియ్యం ఎగుమతి దేశం అయిన ఇండియా దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ చర్యలు తీసుకుంటోంది. స్వాతంత్య్రం వచ్చేనాటికి ఆహారధాన్యాల తీవ్ర కొరత ఎదుర్కొన్న దేశం ఇండియా. అలాంటిది ఈ 75 ఏళ్లలో గోధుమలు, వరి బియ్యం తదితర ఆహారధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెంచగలగడమేగాక వరి, గోధుమలను పెద్ద మొత్తాల్లో ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థితికి నేడు చేరుకోవడం దేశం సాధించిన గొప్ప విజయం. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బెంగాల్‌ ప్రజలకు సరఫరా చేయాల్సిన ఆహారధాన్యాలను బ్రిటిష్‌ సేనల కోసం నాటి ఇంగ్లండ్‌ ప్రధాని విన్‌ స్టన్‌ చర్చిల్‌ ఆదేశాల ప్రకారం తరలించడంతో 1943లో బెంగాల్‌ లో కరువు వచ్చి లక్షలాది జనం మరణించారు.

దేశ విభజనతో ఇండియాలో ఆహారధాన్యాల కొరత తీవ్రం
1947 ఆగస్టులో జరిగిన దేశవిభజనతో భారతదేశంలో తిండిగింజల కొరత తీవ్రమైంది. వరి విపరీతంగా పండే తూర్పు బెంగాల్‌ (నేటి బంగ్లాదేశ్‌), గోధుమల సాగు విస్తారంగా జరుగుతూ, భారీ దిగుబడులకు పేరుగాంచిన పశ్చిమ పంజాబ్‌ ప్రాంతాలు పాకిస్తాన్‌ లో అంతర్భాగం కావడం వల్ల భారత్‌ లో ఆహారధాన్యాల కొరత కనీవినీ రీతిలో పెరిగింది. అంతకు ముందు 1937లో ఇండియా నుంచి బర్మాను విడదీసి బ్రిటిష్‌ వారు దానికి స్వాతంత్య్రం ఇవ్వడంతో దేశంలో పప్పుధాన్యాల కొరత వచ్చింది. ఈ సమస్య నెమ్మది మీద పరిష్కారమైంది. స్వతంత్ర భారతంలో తొలి ప్రధాని పండిత నెహ్రూ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాలు దేశంలో ఆహారధాన్యాల సాగును అభివృద్ధిచేసే కన్నా తిండి గింజలను దిగుమతి చేసుకోవడమే తక్కువ ఖర్చుతో కూడిన పని అని భావించాయి.

మొదటి పదేళ్ల కాలంలో పరిశ్రమల స్థాపనకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. రెండో పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయానికి ప్రాముఖ్యం ఇవ్వాలని 1959లో ఢిల్లీ వచ్చిన అమెరికా వ్యవసాయ నిపుణుల బృందం నెహ్రూ సర్కారుకు సలహా ఇచ్చింది. ఆహారధాన్యాల సాగుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చినాగాని నెహ్రూ కాలం నుంచి 1970 వరకూ ఇండియాలో తిండి గింజల దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి కొనసాగింది. 1964-1969 మధ్యకాలంలో అంటే శాస్త్రి, ఇందిరాగాంధీ పాలనలో అమెరికా నుంచి ఇండియాకు పీఎల్‌-480 అనే పథకం కింద నాసిరకం గోధుమలు ఉచితంగా, రాయితీ ధరలపై సరఫరా అయ్యేవి. అయితే, తమిళనాడుకు చెందిన కేంద్రమంత్రి సి.సుబ్రమణ్యం చొరవతో రూపొందించి, ప్రవేశపెట్టిన వ్యవసాయ రంగ సంస్కరణలు–హరిత విప్లవం పేరుతో తక్కువ కాలంలోనే మంచి ఫలితాలు ఇచ్చాయి. 

అధిక దిగుబడినిచ్చే గోధుమ (మెక్సికో రకం), వరి వంగడాలు విస్తారంగా రైతులకు అందుబాటులోకి రావడం దేశంలో తిండిగింజల ఉత్పత్తి బాగా పెరిగింది. దాంతో అమెరికా నుంచి ఆహారధాన్యాల సాయానికి భారత్‌ స్వస్తి పలికింది. పంజాబ్, పశ్చిమ ఉత్తర్‌ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో గ్రీన్‌ రివల్యూషన్‌ పద్ధతులు సత్ఫలితాలనిచ్చాయి. దీంతో, 1968 రబీ సీజన్‌ లో దేశంలో అంతకు ముందు అత్యధికంగా పండిన పంట కన్నా 30 శాతం ఎక్కువ ఆహారధాన్యాల దిగుబడి సాధించాం. మధ్యలో అనావృష్టి పరిస్థితులు ఎదురైనా..ఈ ఏడున్నర దశాబ్దాల కాలంలో తిండి గింజలు ఎగుమతి చేసే దేశంగా ఇండియా ప్రపంచంలో పేరు సంపాదించుకుంది.

-విజయసాయిరెడ్డి, రాజ్యసభ ఎంపీ, వైఎస్సార్ సీపీ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top