ఆగస్టులో రిజిస్ట్రేషన్లు‘ భూమ్‌’! టాప్‌-5 లిస్ట్‌ ఇదే!

Aug month Hyderabad residential property registrations up says Knight Frank - Sakshi

రూ. 3,461 కోట్లు  రిజిస్ట్రేషన్లు, ఈ ఏడాది ఇది రెండో అత్యధికం 

68 శాతం వాటా  రూ. 50 లక్షల లోపు ధర ఉన్నవే: నైట్‌ఫ్రాంక్‌ ఇండియా నివేదిక  

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఏడాది హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ పరుగులు పెడుతుంది. గత నెలలో రూ.3,461 కోట్లు విలువ చేసే 6,493 ప్రాపర్టీలు రిజిస్ట్రేషన్స్‌ అయ్యాయి. ఈ ఏడాది ఈ స్థాయిలో రిజిస్ట్రేషన్స్‌ జరగడం ఇది రెండోసారి. మార్చిలో అత్యధికంగా 6,959 ప్రాపర్టీలు రిజిస్ట్రేషన్స్‌ జరిగాయి. జూలై నెలతో పోలిస్తే రిజిస్ట్రేషన్స్‌లో 17 శాతం, ఏడాది కాలంతో పోలిస్తే 15 శాతం ఎక్కువని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది. ప్రాపర్టీల విలువల పరంగా చూస్తే జూలైతో పోలిస్తే 20 శాతం, ఏడాది కాలంతో పోలిస్తే 22 శాతం ఎక్కువ.  (ఎస్‌బీఐ మాజీ చైర్మన్‌ రజనీష్‌ సంపాదన ఎంతో తెలిస్తే!)

68 శాతం వాటా ఈ గృహాలదే.. 
ఆగస్టులో జరిగిన రిజిస్ట్రేషన్లలో అత్యధిక వాటా రూ.50 లక్షల లోపు గృహాలదే. ఈ ఇళ్ల వాటా 68 శాతంగా ఉంది. విభాగాల వారీగా చూస్తే.. రూ.25 లక్షలు లోపు ధర ఉన్న ప్రాపర్టీల వాటా 16 శాతం కాగా.. రూ.25-50 లక్షలు మధ్య ధర ఉన్న ప్రాపర్టీల వాటా 52 శాతం, రూ.50-75 లక్షలవి రూ.16 శాతం, రూ.75 లక్షల నుంచి రూ.కోటి ధర ఉన్నవి 8 శాతం, రూ.కోటి నుంచి రూ.2 కోట్లు ధర ఉన్నవి 7 శాతం, రూ.2 కోట్లకు మించి ధర ఉన్న ప్రాపర్టీల వాటా 2 శాతంగా ఉంది. 

2 వేల చ.అ. లోపు విస్తీర్ణ ఇళ్లు... 
గత నెలలో జరిగిన రిజిస్ట్రేషన్లలో 1,000 చ.అ. నుంచి 2,000 చ.అ. మధ్య విస్తీర్ణం ఉన్న ప్రాపర్టీ వాటా 70 శాతంగా ఉంది. 2 వేల నుంచి 3 వేల చ.అ. మధ్య ఉన్న ఇళ్ల వాటా 9 శాతం, 3 వేల చ.అ. కంటే ఎక్కువ విస్తీర్ణమైన యూనిట్ల వాటా 2 శాతంగా ఉంది. 
   అత్యధిక రిజిస్ట్రేషన్లు మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలోనే జరిగాయి. ఈ జిల్లా వాటా 43 శాతం ఉండగా.. రంగారెడ్డిలో 39 శాతం, హైదరాబాద్‌లో 17 శాతం రిజిస్ట్రేషన్‌ వాటాను కలిగి ఉన్నాయి. 

టాప్‌-5 రిజిస్ట్రేషన్లన్స్‌ ఇవే.. 
ఆగస్టులో జరిగిన రిజిస్ట్రేషన్లలో టాప్‌–5 జాబితాలో  బేగంపేట, బంజారాహిల్స్, ఖైరతాబాద్‌ ప్రాంతాలలోని ప్రాపర్టీలు నిలిచాయి. అత్యధికంగా బేగంపేటలో రూ. 8.20 కోట్ల మార్కెట్‌ విలువ గల రిజిస్ట్రేషన్‌ జరగగా.. ఆ తర్వాత బంజారాహిల్స్‌లో రూ.7.47 కోట్లు, రూ.5.60 కోట్లు, రూ.5.60 కోట్ల ప్రాపర్టీలు, ఖైరతాబాద్‌లో రూ.4.76 కోట్ల ప్రాపర్టీ రిజిస్ట్రేషన్‌ జరిగింది. ఆయా యూనిట్ల విస్తీర్ణం 3 వేల చ.అ.లకు మించి ఉన్నవే. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top