
టెక్ దిగ్గజం యాపిల్ ఇండియా తన దేశీయ కార్యకలాపాలను విస్తరించే దిశగా భారీ అడుగు వేసింది. బెంగుళూరులోని వసంత్‌నగర్‌లో ఉన్న ఎంబసీ జెనిత్ భవనంలో 2.7 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని లీజ్‌కు తీసుకుంది. ఈ డడీల్ విలువ సుమారు రూ.1,010 కోట్లు కాగా, ఇదే ఇప్పటివరకు యాపిల్ ఇండియాలో తీసుకున్న అతిపెద్ద కార్యాలయ స్థలం.
డీల్‌లోని కీలక అంశాలు
ఎంబసీ గ్రూప్‌కు చెందిన సంస్థ మాక్ చార్ల్స్ (ఇండియా) లిమిటెడ్ నుంచి యాపిల్ ఈ స్థలాన్ని లీజ్‌కు తీసుకుంది. 5వ అంతస్తు నుండి 13వ అంతస్తు వరకూ మొత్తం 2.7 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని యాపిల్ తీసుకుంది. ఇందుకు నెలకు రూ.6.315 కోట్లు (చదరపు అడుగుకు రూ.235) చొప్పున అద్దె చెల్లించనుంది. ఈ లీజ్ కాల వ్యవధి 10 సంవత్సరాలు. ఏటా 4.5 శాతం చెప్పున అద్దె పెరుగుతుంది. ఇందుకోసం సెక్యూరిటీ డిపాజిట్ రూ.31.57 కోట్లుగా డీల్‌లో రాసుకున్నారు.
ఇంకా విస్తరించే యోచన
ఎంబసీ జెనిత్ భవనంలో 5 నుండి 13వ అంతస్తు వరకు లీజుకు తీసుకున్న యాపిల్ సంస్థ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ నుండి 4వ అంతస్తు వరకు అదనంగా 1.21 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని కూడా అద్దెకు తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తోంది. ఇది జరిగితే, మొత్తం కార్యాలయ విస్తీర్ణం 4 లక్షల చదరపు అడుగులకు చేరుతుంది.
భారత్‌లో వ్యూహాత్మక ప్రాధాన్యత
యాపిల్ ఈ విస్తరణతో భారతదేశంలో తన ఉనికిని మరింత పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దేశీయంగా ఐఫోన్ ఉత్పత్తిని పెంచనున్నట్లు ఇప్పటికే యాపిల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. బెంగుళూరు, పుణేలో రిటైల్ స్టోర్లను ప్రారంభించడం ద్వారా భారత టెక్, మాన్యుఫాక్చరింగ్ రంగాల్లో కీలక పాత్ర పోషించాలని యాపిల్ భావిస్తున్నట్లుగా మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. యాపిల్ ఇప్పటికే 2021లో ప్రెస్టిజ్ మిన్స్క్ స్క్వేర్‌లో 1.16 లక్షల చదరపు అడుగుల కార్యాలయాన్ని అద్దెకు తీసుకుంది, 2023లో అక్కడ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.
ఇదీ చదవండి: నగరం నలువైపులా భారీ లేఅవుట్లు.. కొత్త వెంచర్లు..