రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు, యువ వ్యాపారవేత్త అనంత్ అంబానీ తన విలాసవంతమైన ఆటోమొబైల్ కలెక్షన్‌కు (Anant Ambani Car Collection ) మరో కొత్త మాస్టర్ పీస్‌ను జోడించారు. రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII సిరీస్ II ఎక్స్‌టెండెడ్ (Rolls Royce Phantom VIII Series II) కారును ఆయన కొనుగోలు చేశారు.ఆకర్షణీయమైన ‘స్టార్ ఆఫ్ ఇండియా ఆరెంజ్’ రంగులో ఉన్న ఈ మోడల్ ధర సుమారు రూ.10.5 కోట్లు.
విస్తరించిన వీల్‌బేస్ వేరియంట్ రోల్స్ రాయిస్ సాంప్రదాయం, ఆధునికతను సమపాళ్లలో మిళితం చేస్తుంది. హస్తకళతో రూపొందించిన ఇంటీరియర్, శబ్దరహిత V12 ఇంజిన్, అత్యున్నత సౌకర్యం కలిగిన కేబిన్ దీని ప్రధాన విశేషాలు. లెదర్, ఓపెన్‌పోర్ వుడ్ వెనీర్స్, కస్టమైజ్డ్ డీటైల్స్‌తో కూడిన ఇంటీరియర్ బ్రాండ్ తత్వమైన “సమయానికి మించిన లగ్జరీ”ని ప్రతిబింబిస్తుంది.
‘స్టార్ ఆఫ్ ఇండియా’కు నివాళి
ఈ ప్రత్యేక ఆరెంజ్ షేడ్ (Anant Ambani Rolls Royce) 1934లో రాజ్‌కోట్ మహారాజా ఠాకూర్ సాహిబ్ ధర్మేంద్రసింహ్‌జీ లఖాజీరాజ్ ఆవిష్కరించిన పురాతన రోల్స్ రాయిస్ ఫాంటమ్ II నుండి ప్రేరణ పొందింది. ఆ కారు ‘థ్రప్ & మాబెర్లీ’ రూపొందించిన ఏడు సీట్ల క్యాబ్రియోలెట్ మోడల్.. షాఫ్రాన్, సిల్వర్ రంగుల కలయికలో తయారైంది. దానిని అప్పట్లో ‘స్టార్ ఆఫ్ ఇండియా’ అని పిలిచేవారు. ఇది భారతీయ రాయల్టీ మోటరింగ్ చరిత్రలో అత్యంత చరిత్రాత్మక కార్లలో ఒకటి.
తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు 2025లో అంబానీ కార్ల కలెక్షన్‌లో మెరిసింది. తాజా ఫాంటమ్ కూడా అదే కలర్ స్కీమ్‌ను కలిగి ఉంది. ప్రస్తుతం అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీలో ఉన్న ఇది 563 క్యారెట్ల నక్షత్ర నీలమణి.. ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్ సఫైర్ నుండి ప్రేరణ పొందింది.
రాజ్‌కోట్ యువరాజు మంధాతసింహ్ జడేజా ఈ అసలైన ‘స్టార్ ఆఫ్ ఇండియా’ ఫాంటమ్ IIని మొనాకో వేలంలో బ్రిటిష్ కలెక్టర్ నుంచి తిరిగి కొనుగోలు చేయడం ద్వారా ఈ చరిత్రాత్మక కారు భారతదేశానికి తిరిగి తీసుకువచ్చారు.
అప్పట్లోనే ఆధునిక సాంకేతికత
1930లలోనే ఈ కారు స్టీరింగ్ వీల్‌తో నియంత్రించగలిగే, వాహనం కదలికను అనుసరించే హెడ్‌లైట్లు వంటి అనేక ఆధునిక ఫీచర్లను కలిగి ఉండేది . నేడు బిఎమ్‌డబ్ల్యూ, మెర్సిడెస్ వంటి కార్లలో కనిపించే అడాప్టివ్ కర్వ్ లైట్స్ సాంకేతికతకు ఇది తొలి రూపం అని చెప్పవచ్చు.


