
కృత్రిమ మేధ రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. దాదాపు అన్ని రంగాల్లో ఏఐ వినియోగం ఎక్కువైంది. సాఫ్ట్‌వేర్‌లోనైతే దీని వాడకం మరీ అధికం. ఇప్పటివరకు కోడింగ్ నిపుణులకు ఏఐ సాయంగా నిలుస్తుంది. అయితే రాబోయే కొన్ని నెలల్లోనే ఏఐ పూర్తి కోడింగ్ రాస్తుందని మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ అంచనా వేశారు. ఈ నేపథ్యంలో త్వరలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
వచ్చే 12 నుంచి 18 నెలల్లో కృత్రిమ మేధ(ఏఐ) మెటా అంతర్గత ఏఐ ప్రాజెక్టులకు, ముఖ్యంగా దాని లామా ప్రాజెక్ట్‌ల్లో పూర్తిగా కోడింగ్ సేవలందిస్తుందని మార్క్ జుకర్‌బర్గ్ చెప్పారు. ఇప్పటికే ఈ విభాగాల్లో ఏఐ మెజారిటీ కోడ్‌ను రాస్తుందన్నారు. రానున్న రోజుల్లో ప్రాజెక్ట్ లక్ష్యాలను నిర్దేశించడం, పరీక్షలను నిర్వహించడం, బగ్‌లను గుర్తించడం, కోడ్ నాణ్యతను మెరుగుపరచడం వంటి మరింత అధునాతన పనులను ఏఐ చేపడుతుందని జుకర్‌బర్గ్ భావిస్తున్నారు. కృత్రిమ మేధ త్వరలోనే ఈ రంగాల్లో ఇంజినీర్లను రిప్లేస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.
సుందర్ పిచాయ్..
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా ఇటీవల ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రధాన టెక్ కంపెనీల్లో కృత్రిమ మేధను గణనీయంగా వినియోగిస్తున్నట్లు చెప్పారు. గూగుల్ ఆల్ఫాకోడ్, మెటా ఏఐ నమూనాలు వాటి లార్జ్ ల్యాంగ్వేజీ మోడల్స్‌తో ఫంక్షనల్ కోడ్‌ను జనరేట్ చేయడం, దోషాలను డీబగ్గింగ్ చేయడం, పనితీరును ఆప్టిమైజ్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.
ఇదీ చదవండి: బంగారమా..? మకొద్దు బాబోయ్..!
ఏఐకి అంత సీన్ లేదు..
ఇదిలాఉండగా, ఏఐను అతిగా అంచనా వేయొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోడింగ్‌లో ఏఐ పురోగతి మెరుగ్గానే ఉన్నప్పటికీ, హ్యూమన్ డెవలపర్లను పూర్తిగా భర్తీ చేయడం కుదరదని చెబుతున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌లో ఫంక్షనల్ కోడ్ రాయడం కంటే సంక్లిష్టమైన వ్యాపార అవసరాలను అర్థం చేసుకోవడం, నైతిక నిర్ణయాలు తీసుకోవడం, దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా వ్యవస్థలను రూపొందించడం అవసరం అవుతుంది. ఈ పనులకు సృజనాత్మకత, సందర్భోచిత అవగాహన, డెసిషన్ మేకింగ్ ఎంతో తోడ్పడుతుంది. వీటిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమర్థంగా నిర్వహించలేదనే వాదనలున్నాయి.