కాగితంపై ఆహా ఓహో.. ముఖాముఖిలో.. | AI Resumes Revolution Blessing for Job Seekers, Curse for Recruiters | Sakshi
Sakshi News home page

కాగితంపై ఆహా ఓహో.. ముఖాముఖిలో..

May 28 2026 11:09 AM | Updated on May 28 2026 12:26 PM

AI Resumes Revolution Blessing for Job Seekers, Curse for Recruiters

ఉద్యోగ అన్వేషణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సరికొత్త ట్రెండ్‌గా మారింది. ఒకప్పుడు చక్కటి రెజ్యూమే (సీవీ) రాయడం చేతకాక ఎంతోమంది ప్రతిభావంతులు వెనకబడిపోయేవారు. కానీ, ఇప్పుడు చాట్ జీపీటీ, ఇతర ఏఐ టూల్స్ పుణ్యమా అని నిమిషాల్లో ప్రొఫెషనల్ రెజ్యూమేలు సిద్ధమైపోతున్నాయి. కంపెనీల అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ (ఏటీఎస్‌) ఫిల్టర్లను సులభంగా దాటేలా కీవర్డ్స్‌తో వీటిని అభ్యర్థులు ముస్తాబు చేస్తున్నారు. అయితే, ఇదే ఇప్పుడు రిక్రూటర్లకు తలనొప్పిగా మారింది. కాగితంపై అద్భుతంగా కనిపిస్తున్న అభ్యర్థులు తీరా ఇంటర్వ్యూకి వచ్చేసరికి కనీస ప్రతిభ చూపలేకపోతుండటంతో కంపెనీలు తమ ఎంపిక వ్యూహాన్ని మార్చుకుంటున్నాయి.

గణాంకాలు ఏం చెబుతున్నాయి?

ప్రస్తుతం వైట్ కాలర్ ఉద్యోగాలకు పోటీ పడేవారిలో ఏఐ వినియోగం విపరీతంగా పెరిగిపోయిందని మార్కెట్ వర్గాల తాజా డేటా స్పష్టం చేస్తోంది.

హనార్.ఏఐ నివేదిక: ప్రస్తుతం దాదాపు 70 శాతానికి పైగా వైట్ కాలర్ అభ్యర్థులు తమ రెజ్యూమేల రూపకల్పనకు ఏఐని వాడుతున్నారు. ఇక యువత (జెన్‌ జీ) విషయానికి వస్తే ఈ సంఖ్య ఏకంగా 85 శాతం దాటిపోయింది.

నెక్సాస్క్రీన్ విశ్లేషణ: ఒకే రకమైన అనుభవం ఉన్న ఇద్దరు అభ్యర్థుల్లో ఏఐ ద్వారా ఆప్టిమైజ్ చేసిన రెజ్యూమే ఉన్న అభ్యర్థికి షార్ట్‌లిస్ట్ అయ్యే అవకాశం 5 నుంచి 10 రెట్లు ఎక్కువగా ఉంటోంది.

లింక్డ్‌ఇన్ పరిశోధన: కొవిడ్ పూర్వపు రోజులతో పోలిస్తే ప్రస్తుతం నియామక ప్రక్రియలు 40 శాతం పెరిగాయి. అయినప్పటికీ, సరైన అభ్యర్థులను ఎంపిక చేయడం సవాలుగా మారిందని 74 శాతం మంది రిక్రూటర్లు వాపోతున్నారు. ఇందులో 53 శాతం మంది ఏఐ రెజ్యూమేల వెల్లువను నిందిస్తుండగా 47 శాతం మంది నైపుణ్యాల కొరతను కారణంగా చూపుతున్నారు.

నకిలీల జోరు.. పెరిగిన నిఘా!

రెజ్యూమేల్లో ఏఐ వాడకం పెరగడంతోపాటు ఆన్‌లైన్ అసెస్‌మెంట్లలో (పరీక్షల్లో) అవసరాన్ని మించి ఏఐ టూల్స్ వాడుతూ దొరికిపోతున్న వారి సంఖ్య కూడా ఏటా పెరుగుతోంది. ప్రముఖ హైరింగ్ ప్లాట్‌ఫామ్ హైర్‌ప్రో సీఓఓ పసుపతి ఎస్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం రిక్రూటర్ల ముందున్న అతిపెద్ద సవాలు.. ఏఐ సృష్టించిన హడావుడిని దాటుకుని అభ్యర్థిలో ఉన్న నిజమైన ప్రతిభను గుర్తించడమే’ అని పేర్కొన్నారు.

ఒకే మూసలో రెజ్యూమేలు..

‘ఏఐ రెజ్యూమేలు ఏటీఎస్ ఫిల్టర్లను సులభంగా దాటుతున్నాయి. కాగితంపై అంతా సవ్యంగానే ఉంటోంది. కానీ, ప్రతి ఒక్కరూ ఒకే రకమైన టెంప్లేట్లు వాడటం వల్ల రిక్రూటర్లకు అన్నీ ఒకేలా కనిపిస్తున్నాయి’ అని ‘హనార్.ఏఐ’ వ్యవస్థాపకుడు కృష్ణ ఖండేల్వాల్ తెలిపారు. కాగితంపై ప్రొఫైల్ ఎంత బలంగా ఉందో ఇంటర్వ్యూలో అభ్యర్థి ప్రదర్శన అంత బలహీనంగా ఉంటోందని కొందరు నిపుణులు చెబుతున్నారు. అభ్యర్థులు తమ నైపుణ్యాలను స్పష్టంగా వ్యక్తపరచడానికి ఏఐ ఉపయోగపడాలి కానీ, లేని అనుభవాన్ని ఉన్నట్లు చూపించడానికి కాదని హెచ్చరిస్తున్నారు. పేపర్ షార్ట్‌లిస్టింగ్‌లో టాప్‌లో ఉన్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తే అందులో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు కనీసం బాటమ్ 25 పర్సంటైల్ స్కోరు కూడా సాధించలేకపోతున్నారని వాపోతున్నారు.

కెరీర్ మార్చేవారికి శాపం!

ఈ ఏఐ ఆధారిత ఫిల్టరింగ్ వ్యవస్థ వల్ల కొందరు తీవ్రంగా నష్టపోతున్నారని నిపుణులు చెబుతున్నారు. స్వదేశంలో పెద్ద స్టార్టప్‌ల్లో లేదా యూనికార్న్ కంపెనీల్లో పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ ఏటీఎస్ సిస్టమ్స్ ఆయా కంపెనీల పేర్లను గుర్తించలేక వారి అప్లికేషన్లను ఆటో-రిజెక్ట్ చేస్తున్నాయి. వేరే రంగం నుంచి ఐటీ లేదా ఇతర విభాగాలకు మారాలనుకునే అభ్యర్థుల హిస్టరీలో నిర్దిష్ట కీవర్డ్స్ లేకపోవడం వల్ల ఏఐ సహాయంతో రెజ్యూమే మార్చినా సిస్టమ్స్ వాటిని తిరస్కరిస్తున్నాయి.

మారుతున్న నియామక సూత్రాలు

కీవర్డ్స్ ఆధారిత రెజ్యూమేలను నమ్మే పరిస్థితి లేకపోవడంతో కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాల వైపు మొగ్గు చూపుతున్నాయి.

రెఫరల్స్, పోర్ట్‌ఫోలియోలు: పాత కంపెనీల బ్రాండ్ వాల్యూ, గతంలో చేసిన ప్రాజెక్టుల పోర్ట్‌ఫోలియోలు, అంతర్గత రెఫరల్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు.

వాయిస్ బేస్డ్ అసెస్‌మెంట్స్: కేవలం రెజ్యూమేలు చూడకుండా తొలి దశలోనే 15 నిమిషాల వాయిస్ కాల్స్ లేదా ఏఐ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. దీనివల్ల అభ్యర్థికి ఉన్న ప్రాక్టికల్ పరిజ్ఞానం, సమయస్ఫూర్తి బయటపడతాయని రిక్రూటర్లు నమ్ముతున్నారు.

ఫలితాల ఆధారిత పరిశీలన: కేవలం బాధ్యతల గురించిన రాతలు కాకుండా అభ్యర్థి సాధించిన నిర్దిష్ట విజయాలు, ప్రాజెక్ట్ ఓనర్‌షిప్, సమస్యల పరిష్కార సామర్థ్యం ఆధారంగా అంచనా వేస్తున్నారు.

ఇదీ చదవండి: కాసుల వేటలో.. కరుగుతోన్న బంధాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement