బొగ్గు ఉత్పత్తి పెంపునకు కృషి

8th Round Of Commercial Coal Mines Auction To Be Launched - Sakshi

న్యూఢిల్లీ: పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా దేశీయంగా బొగ్గు ఉత్పత్తిని పెంచేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి ప్రకటించారు. 2070 నాటికి 50 శాతం విద్యుత్‌ను పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా సమకూర్చుకోవాలని, సున్నా కర్బన ఉద్గారాల విడుదల స్థాయికి చేరుకోవాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. ఎనిమిదో విడత వాణిజ్య స్థాయిలో బొగ్గు బ్లాకుల వేలాన్ని మంత్రి బుధవారం ప్రారంభించిన అనంతరం మాట్లాడారు.

‘‘ఇంతకుముందెన్నడూ లేని స్థాయిలో విద్యుత్‌ వినియోగం నమోదవుతోంది. గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ ఇప్పటికే 240 గిగావాట్లకు చేరుకుంది. 2030 నాటికి ఇది రెట్టింపు అవుతుందన్న అంచనా ఉంది. ఇంధన వనరుల్లో బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి తగ్గొచ్చు. కానీ, మొత్తం మీద బొగ్గు విద్యుదుత్పత్తి ప్రస్తుత స్థాయి నుంచి పెరుగుతుంది’’అని వివరించారు. బొగ్గు మైనింగ్‌లో సుస్థిరతాభివృద్ధి సూత్రాలను అమలు చేయడంతోపాటు సంయుక్త కృషి ద్వారా పెరుగుతున్న డిమాండ్‌ను చేరుకోగలమన్నారు.   

3 లక్షల మందికి ఉపాధి 
ప్రస్తుతం వేలం వేస్తున్న బొగ్గు గనులకు సంబంధించి రూ.33,000 కోట్ల పెట్టుబడులు రానున్నట్టు మంత్రి ప్రహ్లాద్‌ జోషి చెప్పారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 3 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రకటించారు. ‘‘వాణిజ్య బొగ్గు మైనింగ్‌ ఎనిమిదో విడత వేలాన్ని ప్రారంభిస్తున్న నేడు ప్రత్యేకమైన రోజు. మొత్తం 39 బొగ్గు గనులను వేలానికి ఉంచాం. ఎందుకు ప్రత్యేకమైన రోజు అంటే నేడు గిరిజనుల గౌరవ దినోత్సవం’’అని మంత్రి ప్రహ్లాద్‌ జోషి పేర్కొన్నారు. బొగ్గు రంగానికి, గిరిజనులకు లోతైన అనుబంధం ఉందన్నారు. వేలంలో ఉంచిన బొగ్గు గనుల్లో ఉత్పత్తి మొదలైతే గిరిజనులే ఎక్కువగా ప్రయోజనం పొందుతారని చెప్పారు. ఇప్పటి వరకు ఏడు విడతల వేలంలో మొత్తం 91 బొగ్గు గనులను వేలం వేసినట్టు గుర్తు చేశారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top