దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్.. తమ ప్రసిద్ధ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ అయిన 'టియాగో ఈవీ'ను కొత్త హంగులతో ఫేస్‌లిఫ్ట్ (టాటా టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్) రూపంలో లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ మోడల్ ప్రారంభ ధర రూ. 6.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). అయితే దీనిని బాస్ (BaaS) స్కీమ్ కింద రూ.4.69 లక్షల ప్రారంభ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.
2026 టాటా టియాగో కొత్త డిజైన్, లేటెస్ట్ ఫీచర్లు, మెరుగైన ఇంటీరియర్‌తో మధ్యతరగతి కుటుంబాలు, యువతను ఆకర్షించేలా తయారైంది.
డిజైన్ విషయానికి వస్తే.. ఇది సాధారణ మోడల్ కంటే కూడా మరింత స్టైలిష్‌గా కనిపిస్తుంది. కొత్త ఫ్రంట్, రియర్ బంపర్లు కారుకు స్పోర్టీ లుక్ ఇస్తాయి. ముందుభాగంలో బ్లాంక్డ్ ఆఫ్ గ్రిల్ ఉండటం వల్ల ఇది ఈవీ అని స్పష్టంగా అర్థమవుతోంది. బ్లాక్ కలర్ ఓఆర్‌వీఎంలు, విండో లైన్, కొత్త వీల్ డిజైన్ కూడా ఇందులో చూడవచ్చు. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్స్ వల్ల రాత్రివేళల్లో మంచి విజిబిలిటీ లభిస్తుంది. టెయిల్‌గేట్‌పై టియాగో ఈవీ అని ఉండటం కూడా గమనించవచ్చు.
ఈ కారు లోపల 10.25 ఇంచెస్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఉంటుంది. ఫ్రీ-స్టాండింగ్ కలర్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, రీడిజైన్ చేసిన సెంటర్ కన్సోల్, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ కార్‌కు ప్రీమియం ఫీల్ అందిస్తాయి. వెనుక సీట్లలో ఉండే ప్రయాణికుల కోసం రియర్ ఏసీ వెంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
పవర్‌ట్రైన్ విషయంలో ఎలాంటి మార్పు ఉండదు. కాబట్టి కొత్త టియాగో ఈవీ కూడా.. స్టాండర్డ్ మోడల్‌లో మాదిరిగానే రెండు బ్యాటరీ ప్యాక్ (19.2 కిలోవాట్, 24 కిలోవాట్) ఎంపికలను పొందుతుంది. పనితీరు, రేంజ్ (పరిధి) అన్నీ కూడా పాత మోడల్ మాదిరిగానే ఉంటాయి.
బాస్ (BaaS) స్కీమ్ గురించి
బాస్ (Battery as a Service) అనేది ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును మరింత చవకగా, సులభంగా చేయడానికి తీసుకొచ్చిన ప్రత్యేక పద్ధతి. ఈ స్కీమ్‌లో కారు, బ్యాటరీని వేర్వేరుగా పరిగణిస్తారు. సాధారణంగా ఎలక్ట్రిక్ కారులో అత్యంత ఖరీదైన భాగం బ్యాటరీ కావడంతో.. దాని ధర మొత్తం కార్ ధరను పెంచుతుంది. కానీ బాస్ విధానంలో వినియోగదారు కారును తక్కువ ప్రారంభ ధరకు కొనుగోలు చేసి, బ్యాటరీ కోసం ప్రత్యేకంగా నెలవారీ లేదా వినియోగానికి అనుగుణంగా చెల్లింపులు చేస్తారు.
ఉదాహరణకు, టాటా టియాగో ఈవీ బాస్ స్కీమ్ కింద రూ. 4.69 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉండటం వల్ల, సాధారణ కొనుగోలుతో పోలిస్తే.. మొదట్లో తక్కువ మొత్తంతోనే కారును సొంతం చేసుకోవచ్చు. ఈ విధానం వల్ల ఎలక్ట్రిక్ కార్లను కొనాలనుకునే మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గుతుంది. అదనంగా.. బ్యాటరీ పనితీరు లేదా మార్పిడి వంటి విషయాల్లో కంపెనీ సపోర్ట్ లభించే అవకాశం ఉంటుంది. అందువల్ల, BaaS స్కీమ్ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తోంది.
ఇదీ చదవండి: ఫాస్ట్‌ట్యాగ్ పనిచేయడం లేదా?: NHAI సూచనలివే..


