2023 మార్కెట్‌ క్యాప్‌ ర్యాంకింగ్స్‌.. టాప్‌లో టాటా - మూడో స్థానంలో అదానీ

2023 Market Cap Rankings - Sakshi

ద్వితీయ స్థానంలో రిలయన్స్‌ గ్రూప్‌

అదానీ గ్రూప్‌నకు మూడో ర్యాంకు

2023 మార్కెట్‌ క్యాప్‌ ర్యాంకింగ్స్‌ 

ముంబై: గత క్యాలండర్‌ ఏడాది(2023)లో దేశీ కార్పొరేట్‌ దిగ్గజాలలో టాటా గ్రూప్‌ భారీగా లాభపడింది. గ్రూప్‌లోని షేర్లు లాభాల దౌడు తీయడంతో గ్రూప్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌(విలువ) 35 శాతం దూసుకెళ్లింది. ఉమ్మడిగా రూ. 28.68 లక్షల కోట్లను తాకింది. దీంతో మార్కెట్‌ క్యాప్‌రీత్యా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక ముకేశ్‌ అంబానీ గ్రూప్‌ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ విలువ దాదాపు 11 శాతం ఎగసింది. రూ. 19.42 లక్షల కోట్లకు చేరింది. ఫలితంగా అదానీ గ్రూప్‌ను అధిగమిస్తూ ద్వితీయ స్థానాన్ని అందుకుంది. అయితే 2022లో రిలయన్స్‌ గ్రూప్‌ను వెనక్కి నెట్టిన అదానీ గ్రూప్‌ వెనకడుగు వేసింది. మార్కెట్‌ విలువ దాదాపు 28 శాతం క్షీణించడంతో రూ. 14.2 లక్షల కోట్లకు పరిమితమైంది. వెరసి మూడో ర్యాంకులో నిలిచింది. 2022లో టాటా గ్రూప్‌ విలువ రూ. 21.2 ట్రిలియన్లుకాగా.. అదానీ గ్రూప్‌ రూ. 19.7 ట్రిలియన్లు, రిలయన్స్‌ రూ. 17.6 ట్రిలియన్లుగా నమోదయ్యాయి.  

రంగాలవారీగా తీరిలా
దేశీ కార్పొరేట్‌ బిజినెస్‌ గ్రూప్‌లలో ప్రధానంగా ఆటోమోటివ్, ఇంజినీరింగ్, భారీయంత్ర పరికరాలు(క్యాపిటల్‌ గూడ్స్‌), విద్యుత్, మౌలిక సదుపాయాలు(ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌), రిటైల్‌ రంగాలు గతేడాది మెరుగైన పనితీరు చూపాయి. అయితే కమోడిటీలు, ఎనర్జీ, ఫైనాన్స్‌ విభాగాలు మందగించాయి. చెన్నై ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగించే మురుగప్ప గ్రూప్‌ మార్కెట్‌ విలువ దాదాపు 53 శాతం జంప్‌చేసి రూ. 3.36 లక్షల కోట్లకు చేరింది. రిటైల్‌ ఫైనాన్స్, ఇంజినీరింగ్, పవర్‌ ఎక్విప్‌మెంట్, సుగర్, ఆగ్రోకెమికల్స్, అబ్రాసివ్స్‌ తయారీలో ఉన్న మురుగప్ప గ్రూప్‌ మార్కెట్‌ విలువ రీత్యా టాప్‌–10 జాబితాలో చోటు(9వ ర్యాంకు) సాధించింది. 

2022లో గ్రూప్‌ విలువ రూ. 2.2 ట్రిలియన్లు మాత్రమే. ఈ బాటలో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ రూ. 2.39 ట్రిలియన్ల నుంచి రూ. 3.33 లక్షల కోట్లకు చేరడం ద్వారా 10వ ర్యాంకును సాధించింది. ఇందుకు జేఎస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిస్టింగ్‌(రూ. 44,000 కోట్ల విలువ) జత కలిసింది. రాహుల్‌ బజాజ్‌ గ్రూప్‌ విలువ రూ. 8.21 ట్రిలియన్ల నుంచి 23 శాతంపైగా బలపడి రూ. 10.12 లక్షల కోట్లను తాకింది. వెరసి మరోసారి నాలుగో ర్యాంకులో నిలిచింది. ఆదిత్య బిర్లా గ్రూప్‌ 33 శాతం ఎగసి ఐదో ర్యాంకును అందుకుంది. విలువ రూ. 4.98 లక్షల కోట్ల నుంచి రూ. 6.6 ట్రిలియన్లకు చేరింది.   

గ్రూప్‌లు అటూఇటుగా
టెలికం రంగ దిగ్గజం భారతీ(ఎయిర్‌టెల్‌) గ్రూప్‌ మార్కెట్‌ విలువ రూ. 5.17 ట్రిలియన్ల నుంచి 27 శాతంపైగా జంప్‌చేసి రూ. 6.59 లక్షల కోట్లను తాకినప్పటికీ ర్యాంకింగ్‌లో 5 నుంచి 6కు నీరసించింది. ఐటీ సేవల హెచ్‌సీఎల్‌ గ్రూప్‌ మార్కెట్‌ క్యాప్‌ 41 శాతం దూసుకెళ్లి రూ. 3.98 ట్రిలియన్లను తాకింది. రెండు స్థానాలు మెరుగుపడి 7కు చేరింది. ఆటో రంగ దిగ్గజం ఎంఅండ్‌ఎం రూ. 3.95 కోట్ల మార్కెట్‌ విలువతో ఒక స్థానం తగ్గి 8వ ర్యాంకుకు పరిమితమైంది. నిజానికి 2022లో ఎంఅండ్‌ఎం మార్కెట్‌ విలువ రూ. 3 లక్షల కోట్లు మాత్రమే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top