వరి వద్దంటున్న వ్యవసాయశాఖ
వరిసాగుకు సమాయత్తమవుతున్న రైతులు
తొందరపడొద్దంటున్న వ్యవసాయాధికారులు
బూర్గంపాడు: ఎల్‌నినో ప్రభావంతో ఇప్పటికే వరి సాగు ఆలస్యమైనా రెండు రోజులుగా కురుస్తున్న జల్లులు ఆశలు రేపుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వరిసాగు చేయవద్దని, ప్రత్యామ్నాయ పంటలైన కంది, పెసర, మినుము పంటలు సాగు చేసుకోవాలని వ్యవసాయశాఖ ప్రచారం చేస్తోంది. ప్రత్యామ్నాయ పంటల సాగుకు ఆలోచన చేస్తున్న తరుణంలో కురుస్తున్న వర్షాలతో రైతులు మళ్లీ సందిగ్ధంలో పడ్డారు. కొందరు ధైర్యం చేసి వరిసాగుకు సమాయత్తమవుతున్నారు.
అల్పపీడన ప్రభావంతో..
జిల్లావ్యాప్తంగా రెండురోజులుగా ఎడతెరిపిలేకుండా చిన్నపాటి జల్లులు పడుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో మరో రెండు రోజులు కూడా వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ చెబుతోంది. కాగా, ఈ వర్షాలకు చెరువులు, కుంటలకు పెద్దగా నీరు చేరలేదు. రైతులు దమ్ము చేసుకునేందుకు సరిపడా మాగాణులలో నీరు చేరింది. ఈ నేపథ్యంలో రైతులు వరినాట్లకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వరినారు ఎదిగి సిద్ధంగా ఉంది. దీంతో రైతులు మాగాణులను దమ్ము చేస్తున్నారు. మోటార్లు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ల కింద వరినాట్లు వేస్తున్నారు. ఈ వర్షాలకు వరినాట్లు వేసుకుంటే మళ్లీ ఏదో ఒక తుపాను రాకపోతుందా అనే ఆశతో రైతులు ముందుకు వెళ్తున్నారు.
సగం మేర కూడా నిండని చెరువులు
ఈ ఏడాది జిల్లాలో సుమారు 1.90 లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేస్తారని వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా వేసింది. వర్షాభావ పరిస్థితులతో సాగు విస్తీర్ణం 50వేల ఎకరాల వరకు తగ్గుతుందని అధికారులు భావించినా.. ప్రస్తుత వర్షాలతో కనీసం 30వేల ఎకరాల వరకు పెరిగే అవకాశం ఉంది. జిల్లాలో ఎక్కువ ఆయకట్టు ఉన్న తుమ్మలచెరువు, సింగభూపాలెం చెరువు, దోమలవాగు చెరువుల కింద వరినాట్లు ఇంకా మొదలుకాలేదు. 100 నుంచి 300 ఎకరాల ఆయకట్టు ఉన్న చెరువుల కింద కూడా వరినాట్లు ప్రారంభం కాలేదు. ఒకటి, రెండు రోజులు వేచి చూసి చెరువుల్లోకి కనీసం సగానికి నీరు చేరితే నాట్లు ప్రారంభించాలని రైతులు యోచిస్తున్నారు.
అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న తేలికపాటి వానలను నమ్ముకుని రైతులు వరిసాగు చేయవద్దని వ్యవసాయశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా లేవని, వర్షాలు తక్కువగా ఉంటాయని, తొందరపడి వరిసాగు చేస్తే ఇబ్బందులు పడాల్సివస్తుందని సూచిస్తున్నారు. భూగర్భజలాలు అడుగంటుతున్నాయని, కొన్నిచోట్ల బోర్లలో నీరు రావటం లేదని, విద్యుత్ ఉత్పత్తికి కూడా ఇబ్బందికర పరిస్థితులు రానున్నాయని, బోర్ల కింద కూడా వరిసాగు చేయకపోవటమే మేలని వివరిస్తున్నారు. రైతులు మాత్రం వరుణుడిపై నమ్మకంతో ముందుకు సాగుతున్నారు.
రెండు రోజులుగా ఎడతెరిపిలేని వాన


