● అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ● పూలు, పండ్లు సమర్పించిన గిరిజనులు ● వైభవంగా శోభాయాత్ర, నిత్యకల్యాణోత్సవం
భద్రాచలం: రామయ్య స్వామికి ఆవాసం కల్పించి, కంచర్ల గోపన్న ద్వారా ఆలయ నిర్మాణానికి ఆద్యురాలుగా నిలిచిన దమ్మక్కకు భక్తులు నీరాజనం పలికారు. బుధవారం భద్రగిరి శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో దమ్మక్క సేవా యాత్ర నిర్వహించారు. భక్తుల శ్రీరామనామస్మరణ, గిరిజనుల నృత్యాలు, సంప్రదాయ ఆట పాటల నడుమ వేడుక కనుల పండువగా సాగింది. జోరున వర్షం కురుస్తున్నా గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయంలో 2014 నుంచి ఆషాఢ పూర్ణిమ సందర్భంగా ఈ కార్యక్రమం జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో పలు గ్రామాల నుంచి తరలి వచ్చిన గిరిజనులు అధికారులతో కలిసి ఆలయ ప్రదక్షిణ చేశారు. అనంతరం మేళతాళాలు, కోలాటాలు, నృత్యాల నడుమ సీతారామ ఆఫీసర్స్ క్లబ్ వద్ద నున్న దమ్మక్క విగ్రహం వద్ద పూజలు జరిపారు. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు దమ్మక్కకు పూలు, పండ్లను సమర్పించారు. అనంతరం రామదాసు కీర్తనలతో శోభాయాత్ర నిర్వహించారు. ఆ తర్వాత తానీషా కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద స్వామి వారి ఉత్సవ మూర్తులకు కల్యాణోత్సవం జరిపారు. ఈ సందర్భంగా గిరిజనులు పలు రకాల పండ్లు, పూలను సమర్పించారు. గిరిజన పెద్దలకు ఈఓ దామోదర్‌రావు వస్త్రాలను అందజేసి సత్కరించారు. ఏఈఓలు శ్రావణ్‌కుమార్, భవాని రామకృష్ణ, గిరిజన పెద్దలు ముర్ల రమేష్, రమణయ్య, ఆలయ ప్రధాన అర్చకుడు విజయరాఘవన్, అర్చకులు, పండితులు, సిబ్బంది, వివిధ గ్రామాల నుంచి వచ్చిన గిరిజనులు పాల్గొన్నారు.


