కల్యాణం.. కమనీయం | - | Sakshi
Sakshi News home page

కల్యాణం.. కమనీయం

Jul 30 2026 12:33 AM | Updated on Jul 30 2026 12:33 AM

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో బుధవారం రామయ్య కల్యాణం కమనీయంగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు.

వైభవంగా

చండీహోమం పూజలు

పాల్వంచరూరల్‌: గురుపౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో చండీ హోమం పూజలు వైభవంగా నిర్వహించారు. ముందుగా మేళతాళాలు, వేదమంత్రాలతో స్వామివారిని ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం మండపారాధన, గణపతిపూజ గావించారు. చివరన పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పూజల్లో పాల్గొన్న భక్త దంపతులకు అర్చకులు రమేష్‌ అమ్మవారి శేష వస్త్ర ప్రసాదాలను అందజేశారు.

నేడు హుండీ కానుకల లెక్కింపు

పెద్దమ్మతల్లి ఆలయ హుండీ కానుకలను గురువారం ఉదయం 9 గంటల నుంచి లెక్కించినున్నట్లు ఈఓ విజయ్‌కుమార్‌ తెలిపారు.

నేడు ఉమ్మడి జిల్లాలో

మంత్రి పొంగులేటి పర్యటన

ఖమ్మంమయూరిసెంటర్‌: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం భద్రాద్రి జిలాల చంద్రుగొండ మండలంలోని మంగయ్య బంజర్‌, పోకలగూడెం, రవికంపాడు గ్రామాల్లో సీసీ రోడ్లు, కాజ్‌వే పనులను ప్రారంభిస్తారు. అనంతరం అన్నపురెడ్డిపల్లి మండలం కొత్తూరు, నర్సాపురం, ఊటుపల్లి, రంగపురం, ఎరగ్రుంట గ్రామాల్లో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలకు మంత్రి హాజరవుతారు. అలాగే, భీమునిగూడెంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3గంటలకు కల్లూరులో జరిగే కల్లూరు, తల్లాడ మండలాల స్థాయి ప్రజాదర్బార్‌లో మంత్రి పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.

అప్రమత్తంగా ఉండాలి

భద్రాచలంటౌన్‌: భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున గిరిజనులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఐటీడీఏ పీవో బి. రాహుల్‌ బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. గోదావరి ముంపు ప్రాంతాల ప్రజలు నదులు, వాగులు, కాలువల వద్దకు వెళ్లొద్దని, రహదారులపై నీరు ప్రవహిస్తున్నప్పుడు కల్వర్టులను దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లోని విద్యార్థుల భద్రతపై హెచ్‌ఎంలు, వార్డెన్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ప్రసవానికి సిద్ధంగా ఉన్న గర్భిణులను ముందుగానే ఆస్పత్రులు, వసతి కేంద్రాలకు తరలించాలని వైద్యాధికారులకు సూచించారు.

ఉచితంగా వృత్తి నైపుణ్య శిక్షణ

భద్రాచలంటౌన్‌: భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలోని వైటీసీ శిక్షణా కేంద్రంలో గిరిజన యువతకు ఉచితంగా వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు ఐటీడీఏ పీఓ బి. రాహుల్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 33 ఏళ్ల వయసు కలిగిన అభ్యర్థులకు జావా, పైథాన్‌, స్పోకెన్‌ ఇంగ్లిష్‌, సాఫ్ట్‌ స్కిల్స్‌, బ్యూటీషియన్‌, టైలరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగస్టు 7వ తేదీ లోగా వైటీసీ కేంద్రానికి వచ్చి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని, ఇతర 79931 02529 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

‘ఉత్తమ’ అవార్డులకు

దరఖాస్తుల ఆహ్వానం

కొత్తగూడెంఅర్బన్‌: 2026–27 విద్యా సంవత్సరంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి డి.వాసంతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన ఉపాధ్యాయులు ఆగస్టు 10వ తేదీలోగా డీఈఓ కార్యాలయంలో దరఖాస్తులను అందజేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement