ప్రమాదాలను నివారించాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): రానున్న 36 గంటల్లో వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులు కార్యస్థానాలను విడిచి వెళ్లొద్దని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బుధవారం కలెక్టర్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వరద ముంపునకు గురయ్యే ప్రాంతాలను ముందుగానే గుర్తించి, ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. తాగునీరు కలుషితం కాకుండా, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
లబ్ధిదారుల ఎంపిక
ద్విచక్ర, మూడు చక్రాల వాహనాల లబ్ధిదారులను బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ అంకిత్ లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు. ప్రధాన మంత్రి జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ పథకం కింద ప్రభుత్వం మత్స్యకారులకు వాహనాలు మంజూరు చేసింది. ద్విచక్ర వాహనాలకు 274, త్రిచక్ర వాహనాలకు 26 దరఖాస్తులు రాగా, 51 ద్విచక్ర వాహనాలు, 12 మూడు చక్రాల వాహనాలు మంజూరయ్యాయని జిల్లా మత్స్యశాఖ అధికారి జి.శివప్రసాద్ తెలిపారు.
95శాతం డిజిటలైజేషన్ పూర్తి
జిల్లాలో ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ 95 శాతం పూర్తయిందని, మిగిలిన ప్రక్రియను కూడా నిర్ణీత గడువులో పూర్తి చేస్తామని కలెక్టర్ అంకిత్ తెలిపారు. హైదరాబాద్ నుంచి ఎస్‌ఐఆర్ కార్యక్రమం పురోగతి, ఓటర్ల వివరాల డిజిటలైజేషన్, డేటా నమోదు, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ తదితర అంశాలపై బుధవారం కలెక్టర్లతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ హాజరై జిల్లా స్థితిగతులను వివరించారు. అనంతరం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. పొరపాట్లకు తావులేకుండా ఈఆర్‌ఓలు, సూపర్‌వైజర్లు తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో అధికారులు నాగలక్ష్మి, వి.బాబూరావు, కె.మహేశ్వరరావు, వి.రామిరెడ్డి, టి.భరత్, నాగేశ్వరరావు, వెంకటరమణ, తుకారాం రాథోడ్, అనూష , రంగా ప్రసాద్ పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం జిల్లా స్థాయి రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రహదారులపై పశువులను వదిలే యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను అరికట్టేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా గుర్తించిన 42 బ్లాక్ స్పాట్లలో భద్రతా చర్యలను వచ్చే నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. బ్లాక్ స్పాట్ల వద్ద హెచ్చరికలు, సూచిక బోర్డులు, రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయాలన్నారు. రహదారుల వెంట ఏర్పడిన గుంతలను పూడ్చివేయాలని చెప్పారు. కాగా, జిల్లాలో జనవరి నుంచి ఇప్పటివరకు 289 రోడ్డు ప్రమాద కేసులు నమోదయ్యాయని అధికారులు వివరించారు.
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులకు కలెక్టర్ అంకిత్ ఆదేశాలు


