24 గేట్లను ఎత్తి 84,078 క్యూసెక్కుల
నీరు దిగువకు విడుదల
చర్ల: ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి పెరగడంతో తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో తాలిపేరులోకి 79,821 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ప్రాజెక్ట్‌కు 25 గేట్లు ఉండగా, 13 గేట్లను 2 అడుగుల ఎత్తు మేర, మరో 11 గేట్లను పూర్తిగా ఎత్తి ఉంచి 84,078 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 74 మీటర్లు కాగా ప్రస్తుతం 72.60 మీటర్ల వద్ద క్రమబద్ధీకరిస్తున్నారు. స్థూల నిల్వ సామర్థ్యం 730 మిలియన్ క్యూబిక్ అడుగులు కాగా, ప్రస్తుతం 486 మిలియన్ క్యూబిక్ అడుగుల మేర నీరు నిల్వ ఉంది. ఉదయం 7 గంటలకు ప్రాజెక్టు వద్ద 70 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. పరిస్థితిని ప్రాజెక్ట్ డీఈ తిరుపతి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.


